తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Politics: నల్గొండలో కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్, ముఖ్య నేతల చేరికలకు ప్లాన్

Nalgonda Politics: నల్గొండలో కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్, ముఖ్య నేతల చేరికలకు ప్లాన్

HT Telugu Desk HT Telugu

14 September 2023, 10:27 IST

    • Nalgonda Politics: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశాల సందర్భంగా ఒకేసారి ముఖ్య నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
కాంగ్రెస్‌ పార్టీలో చేరికలతో కొత్త ఉత్సాహం
కాంగ్రెస్‌ పార్టీలో చేరికలతో కొత్త ఉత్సాహం

కాంగ్రెస్‌ పార్టీలో చేరికలతో కొత్త ఉత్సాహం

Nalgonda Politics: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. టీడీపీ ఆవిర్భావం దాకా జిల్లాలో అయితే కాంగ్రెస్, లేదంటే కమ్యూనిస్టులు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీలు సమ ఉజ్జీలుగా నిలిచాయి. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా జిల్లాలో బీఆర్ఎస్ ను కేవలం అయిదు స్థానాలకే పరిమితం చేయగలిగింది కాంగ్రెస్.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

2018 ఎన్నికల సమయంలో మాత్రం ప్రాభవం కోల్పోయి కేవలం మూడు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో ఇద్దరు ఎంపీలను గెలిపించుకుని బలాన్ని నిరూపించుకుంది. ఇపుడు 2023 శాసన సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తమ సత్తా చూపేందుకు సంసిద్దమవుతోంది. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ కు బాగా పట్టుందన్న అంచనాలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.

పట్టు జారిందిలా..

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ హుజూర్ నగర్, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కానీ, నల్గొండ ఎంపీగా హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉండిన ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవడంతో ఆయన తన శాసన సభ్యత్వాన్ని వదులుకున్నారు.

హుజూర్ నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ తీర్ధం పుచుకోవడంతో అక్కడా ఖాళీ అయ్యింది. మునుగోడు ఎమ్మెల్యేగా ఉండిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక జరిగి ఆ నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇలా 2018లో గెలుచుకున్న మూడు స్థానాలు చేజారాయి. ఇపుడు ఒక్క చోట కూడా ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

పూర్వ వైభవం కోసం..

ఏడు దశాబ్దాల కిందటి నుంచి జిల్లాలో పార్టీకి ఉన్న ఘన చరిత్ర మసకబారకుండా ఈ సారి పూర్తి స్థాయిలో పట్టు నిరూపించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ పార్టీకి ఇపుడు కనీసం మూడు నాలుగు చోట్ల బలమైన అభ్యర్థులు లేరు. నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్ నగర్ లో ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, నాగార్జున సాగర్ లో కుందూరు జానారెడ్డి, దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. ఇక, మిర్యాలగూడ, ఆలేరు, భువనగిరి, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ స్థానాల్లో పార్టీ వెదుకులాటలో ఉంది. ఇందులో మనుగోడు, మిర్యాలగూడ వామపక్షాలతో పొత్తు కుదిరే పక్షంలో సీపీఐ, సీపీఎంలకు కేటాయించే వీలుంది. కాగా, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల కోసం బయటి నుంచి నాయకులను ఆహ్వానిస్తోంది.

ఆ ముగ్గురు నేతలకు ఆహ్వానం

భువనగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఇండిపెండెంటుగా పోటీ చేసి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చిన జిట్టా బాలక్రిష్ణారెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకురానున్నారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న మోత్కుపల్లి నర్సింహులును బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి, తుంగతుర్తి నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉంది. ఆయన ఇప్పటికే ఓ మారు తుంగతుర్తి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న చరిత్ర ఉంది. నకిరేకల్ నియోజకవర్గంలో 2014లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, 2018 లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.

సోనియా గాంధీ సమక్షంలో చేరికలు ?

హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా ఈ ముగ్గురు నాయకుల చేరికకు పార్టీ అధినాయకత్వం పచ్చజెండా ఊపిందని చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీన లేదంటే 17వ తేదీన జరిగే బహిరంగ సభా వేదికపై వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పే వీలుంది.

వీరితో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుల చేరిక కూడా ఆ రోజే ఉండనుంది. వీరిలో తుమ్మల నాగేశ్వర రావు, మోత్కుపల్లి నర్సింహులు 1983ల నుంచి రాజకీయ సహచరులు. అదే విధంగా యన్నం శ్రీనివాస్ రెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి బీఆర్ఎస్ లో పార్టీ ఆవిర్భావం (నాటి టీఆర్ఎస్) నుంచి తెలంగాణ ఉద్యమ కారులుగా కలిసి పనిచేశారు. ఇద్దరూ బీజేపీలోనూ కలిసి పనిచేడమే కాకుండా ఇద్దరూ బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు.

.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

తదుపరి వ్యాసం