తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Members : టిఎస్‌పిఎస్సీలో సభ్యుల్ని ఎలా నియమించారని ప్రశ్నించిన హైకోర్టు..

TSPSC Members : టిఎస్‌పిఎస్సీలో సభ్యుల్ని ఎలా నియమించారని ప్రశ్నించిన హైకోర్టు..

HT Telugu Desk HT Telugu

02 December 2022, 9:26 IST

    • TSPSC Members తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌లో సభ్యుల  నియామకానికి ఎలాంటి పద్ధతి అవలంబిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల నియామకంపై ప్రొఫెసర్‌  వినాయక్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం , సభ్యుల నియామకాలకు అనుసరించిన విధివిధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీకి నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీకి నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు (HT_PRINT)

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీకి నిరసనగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు

TSPSC Members తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సభ్యుల నియామకాలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది. సర్వీస్ కమిషన్‌లో సభ్యుల నియామకాలకు ఎలాంటి విధి విధానాలను అవలంబిస్తున్నారని ప్రశ్నించింది. కమిషన్ సభ్యుల నియామకాలకు నిర్ధిష్టమైన విధానం ఏదైనా ఉందా అని నిదీసింది. కమిషన్‌లో ఖాళీల విషయంలో నియమితులైన సభ్యులకు సమాచారం ఎలా తెలిసిందని ప్రశ్నించింది. సభ్యులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు వచ్చి తెలుసుకున్నారా, లేకుంటే ఎక్కడైనా పాన్ డబ్బాలో ఖాళీల గురించి చెప్పుకుంటుంటే విని దరఖాస్తు చేసుకున్నారా అని వ్యాఖ‌్యానించింది.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం జరిగిందని హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ వినాయక్‌ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్‌ ఉజ్జల్ భూయాన్, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌ రెడ్డిల ధర్మానం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరపున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. సభ్యుల నియామకాలపై వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, నియామకాలు మాత్రం నిబంధనల ప్రకారం జరగలేదని తెలిపారు.

టిఎస్‌పిస్సీ సభ్యులుగా నియమితులైన వారిలో రమావత్ ధన్‌సింగ్‌ జీహెచ్‌ఎంసీలో ఈఎన్‌సీ‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సుమిత్ర ఆనంద్ జడ్పీ స్కూల్‌ తెలుగు టీచర్‌గా పనిచేశారు. ఏ.చంద్రశేఖర్‌ రావు ఆయుర్వేద వైద్యుడిగా పని చేశారు. రవీంద్రరెడ్డి రిటైర్డ్‌ డిప్యూటీ తాసీల్దారుగా పనిచేశారు. ఆర్‌.సత్యానారయణ ఎమ్మెల్సీగా పనిచేశారని, నిబంధనల ప్రకారం రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌లో ఫస్ట్‌ క్లాస్‌ గెజిటెడ్‌ హోదాలో పనిచేసిన వారికి మాత్రమే కమిషన్ సభ్యులుగా నియమితులయ్యే అవకాశం ఉంటుందని వాదించారు.

రాజ్యాంగబద్దమైన పోస్టుల భర్తీలో విస్తృత స్థాయిలో కసరత్తు జరగాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. నల్సార్ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్ నియామకానికి ఓ కమిటీ ఉంటుందని, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ సభ్యుల నియామకాలకు ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. సభ్యుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానించి, పరిశీలించి కమిటీ సిఫార్సుతో నియామకాలు చేపట్టారా అని ప్రశ‌్నించారు. దరఖాస్తుల్ని ఎలా ఆహ్వానించారు. నోటిఫికేషన్ ఏదైనా ఇచ్చారా, దరఖాస్తులు ఎలా చేశారు, ఎంపికకు ఎలాంటి విధానాలు అనుసరించారని ప్రశ్నించారు. తెలంగాణ వంటి కొత్త రాష్ట్రంలో అర్హులైన వారు, ఆశావహులు చాలామంది ఉంటారని వారందరికి పారదర్శకంగా అవకాశాలు కల్పించారా అని కోర్టు ప్రశ్నించింది.

న్యాయమూర్తుల నియామకానికి కొలిజియం ఉందని, సీనియర్ న్యాయవాదులు గుర్తింపుకు నోటీసు జారీ చేసి, దరఖాస్తు చేసుకున్న వారితో కమిటీ మాట్లాడటం వంటివి చేస్తుందన్నారు.కమిషనర్ సభ్యుల నియామకంలో కూడా పారదర్శకమైన విధానాలు ఉండాలన్నారు. అలా జరిగాయా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.

చట్టబద్దంగానే నియామకాలు…..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు జీవో 54 ప్రకారమే చేపట్టినట్లు అడ్వకేట్ జనరల్ బి.ఎస్‌.ప్రసాద్ కోర్టుకు వివరించారు. నిబంధనల్లో అచ్చు తప్ప దొర్లడం తప్ప నియామకాలు చట్టబద్దంగానే నిర్వహించినట్లు తెలిపారు. కమిషన్‌లో ఖాళీలున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌ ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మంత్రి మండలిలో చర్చించి అర్హులైన వారిని కమిషన్ సభ్యులుగా నియమించినట్లు చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా నియమితులైన వారు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఏజీ తెలిపారు.

అస్సోం ఉద్యమంలో నష్టపోయిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని తెలంగాణలో కూడా అలాంటి రిజర్వేషన్లు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో అలాంటి రిజర్వేషన్లు లేవని, స్థానిక రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని ఏజీ వివరించారు. మంత్రి మండలి సిఫార్సుల ఆధారంగా సభ్యుల నియామకాలు చేపట్టినట్టు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్‌పై తీర్పును వాయిదా వేశారు.

తదుపరి వ్యాసం