తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మార్పు ఎందుకైంది? ఓ డాక్టర్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్

మార్పు ఎందుకైంది? ఓ డాక్టర్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్

HT Telugu Desk HT Telugu

03 January 2024, 10:36 IST

    • మన తెలంగాణల మూడో తాప ఓట్ల పందేరం ఒడిసింది. పేపరోళ్ళు పెద్ద పెద్ద టీవీ లోళ్లు కూడా అటా, ఇటా అన్నట్టే చెప్పిండ్రు. కానీ.., కొంచెం అటే అన్నరు. అంటే ఎనుకట బాపు (ముళ్ళపూడి వెంకట రమణ గారు) సెప్పినట్టు "ఆడ మగ రెండు సమానమే కానీ, మగ కొంచెం ఎక్కువ సమానం" అని. లేకుంటే మళ్ళా ఏనుకసీరి ఏమైతదో వాల్లకెరికే గదా.
ఓటమి అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశంలో కేసీఆర్
ఓటమి అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశంలో కేసీఆర్ (Mohammed Aleemuddin)

ఓటమి అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశంలో కేసీఆర్

మనమే పాస్, పస్టుల పాస్ ఐతం సంబురాలకు సామాను సదురుకోండి అని చిన్న సారు ట్విట్టర్ పిట్టల సెప్పంగనే కారు గుర్తోల్లు మస్తు జోష్ లకు అచ్చి వాట్సాప్ ఫోన్ లల్ల పెట్టిందే పెట్టిండ్రు. అటోళ్ళకేమో అస్సలు అర్థం కాక చేతులు వణికినయ్ జర.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

మూడొద్దులు పానం బిగవట్టుకొని కూసున్నరు కొందరైతే. ఆకిరికి ఆదివారం రానే అచ్చింది పగటికి లెక్క మొత్తం దొరికింది. చెయ్యి మీదికి లేసింది, కారు తొవ్వ తప్పింది, పువ్వు రెక్కలు ఎక్కువైనయి, గాలిపటం గక్కన్నే ఆగింది, కంకికొడలి నేనింకా ఉన్నా అని సెప్పింది, ఏనుగు ఎరుకలేకుంట అయింది.

ఇగ తెలంగాణ కోసం చావు నోట్లె తలకాయ పెట్టిన మన బాపును జనాలు ఎందుకు గిట్ల అగం చేసిండ్రు అని బాగా సోచాయించిన. ఎనకటికి పోయి అన్ని తవ్వుకుంట అత్తే కొన్ని ఇషయాలు నాకు సమజయినయ్. గవ్వే ముచ్చట్లు గిక్కడ జెప్తా.

గా "వేణు స్వామి లెక్క జ్యోతిష్యం" సెప్పుడు నానుంచైతే కాదు. డాక్టర్ను కదా రోగమెరిగి మందు రాస్తా. సచ్చిన బాడీని కోసి మొత్తం చెకప్ చేసి ఎందుకు సచ్చిందో పోస్ట్ మార్టం రిపోర్ట్ ల చెప్తాం కదా, గట్లన్నట్టు. అయితే గిది జర ముఖ్యమైన కిరికిరి కేసు కదా. మొత్తం సెకింగు చెయ్యలే గందుకనే మొదలు రిపోర్టు (Preliminary Report) ఎప్పుడో రాసిన గానీ ఫైనల్ రిపోర్ట్ జర ఆల్స్యమైంది అన్నట్టు. (Visecra FSL lab కి పంపి, దాని reporting కు లేట్ అయిన్నట్లు).

అంటే మళ్ళీ ఇప్పుడు ఎవలు సచ్చిండ్రు అని లాజిక్కులు లాగకుండ్రి. డాక్టర్ భాషల చెప్తా గంతే. అప్పుడప్పుడు మనుసు సివుక్కుమన్నప్పుడు, మస్త్ మజాలా ఉన్నప్పుడు జరంత కళాపోసణ బయటికచ్చి పెన్ను పట్టుకోమంటది, పేపరు ఖరాబ్ చేత్తది ఇప్పుడు కూడా గంతే.

అసలు ముచ్చటకద్దాం..

మన నీళ్లు, మన పైసలు(నిధులు), మన నౌకర్లు(నియామకాలు) ఈ మూడింటి కోసమని మన పెద్ద సారు "ప్రొఫెసర్ జయశంకర్ సార్" ఆయన జీవితకాలమంతా బతికిండు. ఆంధ్రోళ్ల రుబాబ్ మీద దండిగ ఆలోచించిండు, లెక్కలు మస్తు చేసిండు, బుక్కులు బాగా రాసిండు. ఆఖరికి లొల్లి కూడా చేసిండు కానీ.., తెలంగాణ పురుడు పోసుకోకముందే పెద్దాయన జీవిడిసిండు.

అంటే ఆ మీదకెళ్లి దేవుని దగ్గర పైరవి జేసిండు కావచ్చు. అందుకనే అంతకు ముందు ఎన్నిసార్లు లొల్లులు జెసినా రాని తెలంగాణ గీతాప జర జల్లినొచ్చింది. పోస్టుమార్టం అని మల్ల ఈ పాత సోది ఏంది అనుకోకుండ్రి. "తెలంగాణ అంటే మొదలు మనకు యాదికి రావాల్సింది ప్రొఫెసర్ జయశంకర్ సార్" అంతే. ఆయన పేరు లేకుండా తెలంగాణ ముచ్చట పలికే అర్హత ఎవ్వరికీ లేదు. తెచ్చినం, కొట్లాడినం, ఇచ్చినం అనేటోళ్ళందరూ గిది గట్టిగా గుసాయించుకోవాలె మెదట్ల. “తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ సార్” గారు మాత్రమే.

ముందుగాల నీళ్ల ముచ్చటకత్తే..

మిషన్ కాకతీయ తోటి చెరువులు, మిషన్ భగీరథ తోని మంచినీళ్లు, కాలేశ్వరం ఎత్తిపోతల పథకం తోటి సాగునీళ్లు బాగానే చేసిండ్రు. ముందుగాల అంతా మంచిగనే కొట్టింది. కానీ.., రాను రానే జర తేడా కొట్టింది.. భగీరథలో శానా ఊళ్ళళ్ళ పైపులేసిండ్రు. నీల్లయితే కొన్ని జాగల్లనే అత్తన్నయి.

కాకతీయ కింద చెరువులైతే మంచిగ చేసిండ్రు. కానీ అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, పూడికతీత, తూములు, మత్తడి, కాలువల కంటే కట్టమీద తోవ్వ, దానిమీద గడ్డి వీటికే పైసల్ బాగ వేస్ట్ చేసినట్టు కొట్టింది. ఆ గడ్డి సంబురం, రోడ్డు మురిపం మూడు రోజుల ముచ్చటే అయింది. ఊరుకో మినీ ట్యాంక్ బండ్ అని పైసలు అన్ని తీసుకుపోయి చెర్ల పోసినట్టు అయింది.

ఇగ కాలేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే పెద్ద పుస్తకమే రాయచ్చు. మొదటి కాంచి లొల్లే అది. డిజైన్ మార్చుకుంటా మార్చుకుంటా ఖర్చు తడిసి మోపెడు అయిందన్నరు. చేసిన అప్పు, దాని మీద వడ్డీ కట్టడానికే నడ్డి విరిగిపోయినట్లు అనిపిస్తుంది. మొత్తం అయ్యాక అద్భుత ఇంజనీరింగ్ కట్టడం అన్నారు.

నిజమే, ఇప్పటికీ కాలేశ్వరం ప్రాజెక్టు అద్భుత ఇంజనీరింగ్ కట్టడం. అందుకనే మొదలైన కొత్తల బస్సులు పెట్టి మరీ తీసుకపోయి సూయించిండ్రు. ఆ సొరంగాలు, బాహుబలి మోటార్లు చూసిన జనాలు ఆహా ఓహో అని నోరెళ్లబెట్టారు. ఒక్కసారి గట్టి వానలు పడంగనే మొత్తం ఉల్టా పుల్టా అయింది. ఏం అర్థం కాలే. మొన్న మొన్న మేడిగడ్డ కుంగిపోతే చిన్న ముచ్చట అని తీసిపారేసి పట్టించుకోలేదు. అప్పుడు బస్సులలో తీసుకెళ్లినోళ్ళు ఇప్పుడు పోయి ఏమైందో చూద్దామంటే పేపరు టీవీలోల్లను కూడా పోనీయకుండా పోలీసులను పెట్టి గెదిమిండ్రు.

ఇగ మా వైద్యం లెక్కల "రిస్క్ వర్సెస్ బెన్ఫిట్ రేషియో" (Risk vs Benifit Ratio) అని ఉంటది. అంటే ఒకలకు రోగం వస్తే ఆ రోగం తోటి ప్రాణాలకు రిస్క్ ఎంత ఉంటది, దానికి వాడే మందులు గాని ఆపరేషన్ గాని చేస్తే దాంతోటి సైడ్ ఎఫెక్ట్‌లు, రిస్కులు ఎంతుంటాయి, ఇవి లెక్కలు వేసుకొని మొత్తం పేషెంటుకు, వాల్లోళ్లకు చెప్పి, సరే అన్నంకనే ట్రీట్మెంట్ చేస్తారు.

అట్లనే బిజినెస్ లో కూడా "కాస్ట్ వర్సెస్ బెనిఫిట్ రేషియో" (Cost vs Benifit Ratio) అని ఉంటది. అంటే కాలేశ్వరం ప్రాజెక్టు పెట్టిన ఖర్చు, తీసుకున్న రిస్కుకు వచ్చే బెనిఫిట్ కు ఏ రకంగా ఎక్కడా పొంతన లేదు. "కాస్ట్ అండ్ రిస్క్ ఫుల్లు బెనిఫిట్ నిల్లు" అన్నట్లు ఉంది ఇప్పుడు.

బర్రెను సాధుకుంటా పాలమ్ముకొని నాలుగు రాళ్లు సంపాదించెటోడు, కొత్తగా తెల్ల ఏగును కొనుక్కొని దాన్ని మేపుటానికి బుడ్డగోసి కాంచెలి అమ్ముకున్నట్టు అయింది. మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్త అప్పులకుప్పగా మారడానికి ఇదో ముఖ్య కారణం అంటున్నారు.

పైసల (నిధులు) లొల్లి సూద్ధాం..

ఇచ్చుకపోయేటప్పుడు ఫుల్లుగా పైసలు ఉన్న రాష్ట్రమని అందరం సంకలు గుద్దుకున్నం. ఇప్పుడేమో లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నారు. నా నెత్తి మీద కూడా లక్ష రూపాయలు మీదనే అప్పుందట. నీ యవ్వ.., నేను చేసిన అప్పులే కట్టుకోలేక సత్తాంటే ఇదేంది మల్ల..? ఈ అప్పును ఎవడు, ఎట్లా, ఎప్పుడు కట్టాలి..? వాళ్ళ జాగలు, బంగళాలు అయితే అమ్మి కట్టరు గదా..?

ఆంధ్రోళ్ల తోటి కలిసున్నప్పుడు వాళ్లే ఎక్కువ పైసలు గుంజుక పోతాండ్రు, మనకు ఇత్తలేరు అని కాగితాల మీద లెక్కలు చూపించుకుంటా అసెంబ్లీలో లొల్లి లొల్లి జేత్తిరి. మరి ఇప్పుడేమయ్యింది చింతమడకల కడపకు 10 లక్షలు అనెవరకు మా పాణం పాయె. కొడుకు, అల్లుని ఊళ్ళకే అంతా ఇచ్చి పక్కనున్న వాళ్ళను పట్టించుకోబోతిరి.

ఇగ మీకు ఆంధ్రోళ్లకు తేడా ఏంది సారు..? ఊరుకొక రాష్ట్రం కావాలని కొట్లాడాల్నా ఏంది అభివృద్ధి కావాలంటే..? మీ ముగ్గురు నలుగురి నియోజకవర్గాలు కాదు కదా రాష్ట్రం అభివృద్ధి అంటే. పట్నంల పెద్ద పెద్ద రోడ్లు, నడిమిట్ల పెద్ద పెద్ద లైట్లు పెడితే అయిపోయిందా...? (అవి కూడా స్మార్ట్ సిటీ కింద కేంద్రపోళ్ళ పైసల తోటి అని అ పువ్వు గుర్తోళ్లు మొత్తుకుంటుర్రు).

వైకుంఠధామం అని మంచి పేరుతో స్మశానాలు కడితే వాటికి పైసలు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుని అదే స్మశానానికి పోతే మరి నిధులన్నీ యాడికి పోయినట్లు సారూ...? పైసలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఎగజల్లి ఖజానా మొత్తం ఖాళీ సేత్తిరి. ఎలక్షన్లు అత్తున్నాయంటే సాలు, కులపోల్ల ఓట్లు లెక్క గట్టి ఎవరియైతే మనకు గట్టిగ పడతాయో వాళ్లను పిలిచి మంచి జాగలిచ్చి, కుల సంఘాల పేరిట బంగ్లాలు కడితిరి, ఇదేం సంక్షేమం..?

ఆ బంగ్లాలలో పోరగాండ్లకు సదువు సెప్తారా..?, లేక రోగం వచ్చినోళ్ళకి సూది మందులు ఇస్తారా..? "బై ఎలక్షన్లంటే సాలు.. బంధు అంటారు". ఓ పారి దళిత బంధు, ఓ పారి బీసీ బంధు. అది కూడా అసలైనోళ్ళకి గాక మీ పార్టీలో ఉన్నోళ్ళకి కమిషన్లు తీసుకొని ఇత్తిరి. వేరే పార్టీల ఉంటేనో, ఏ పార్టీలో లేకుంటేనో పేదోళ్లు కాదా..? వాళ్లు ఓట్లకు పనికిరారా..? ఇదేం సంక్షేమయ్యా..? అసలు ఇయ్యాల్సిన వాళ్లు 100 మంది ఉంటే మీకు అక్కరకత్తరని మీ పార్టీల పదిమందికి ఇత్తే మిగిలిన 90 మంది లొల్లి చేయరా మరి..?

ఇప్పుడు అసలు ముచ్చట నౌకర్లు (నియామకాలు).

అస్సలు అని ఎందుకన్నా అంటే లక్షల మంది పోరగాండ్లు తెలంగాణా వత్తే తమ బతుకులు మారుతాయి అని రోడ్లెక్కి లొల్లి చేసింది, వందలాదిమంది ప్రాణం తీసుకుంది ఈ నౌకర్ల కోసమే కదా. అసలు వాళ్ళు ప్రాణాలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం అయ్యేది కాదు, కేంద్రం వెన్నుల వణుకు వచ్చేది కాదు, ఇయ్యాల్ల ఈ తెలంగాణ సూసెటోల్లం గాదు.

మరి అసొంటి పిల్లలకు నౌకర్లు సరిగ్గా ఇచ్చి, అమరవీరులు కుటుంబాలకు అసలైన న్యాయం చేసి, అమరులకు నిజమైన నివాళి ఇవ్వాలి కదా..!? తొమ్మిదిన్నరేండ్లల్ల ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి? ఎన్ని పరీక్షలు పెట్టిండ్రు? ఎన్ని రిజల్ట్స్ ఇచిండ్రు..? ఎంతమందిని కొలువుకెక్కించారు..? పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్షలు ఎన్ని సార్లు రద్దు చేశారు..?

ఎప్పుడన్నా చూసిండ్రా ఇంత ఘోరం..? లక్షల మంది పిల్లలు కోచింగ్ ల కోసం అప్పు సప్పు చేసి చదువుకుంటూ, ఎంతోమంది ఆడపడుచులు తమ భర్తలు పిల్లలు వదిలి, మొగోళ్ళు తమ భార్య పిల్లల్ని వదిలి నిద్రాహారాలు మాని చదివి, పరీక్ష రాత్తే, రెండుసార్లు ఆ పరీక్షలు రద్దు చేస్తే ఆ తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి..?

TSPSC తో మాకు సంబంధం ఏంటి అనే మాట బాధ్యతారాహిత్యమా ..? నిర్లక్ష్యమా...? మమ్మల్ని ఏం చేస్తారనే అహంకార ధోరణా...? కనీసం రెండోసారి రద్దయినప్పుడన్నా ఆ కమిషన్ ప్రక్షాళన దిశగా ఒక్క పనైనా చేసిండ్రా..? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పాత చింతకాయ పచ్చడి డైలాగులు చెప్తారా..? ప్రభుత్వంతో TSPSC కి ఎందుకు సంబంధం లేదు.? మీరు పెట్టిన సభ్యులు కాదా? మీరు పెట్టిన చైర్మన్ కాదా? డైరెక్ట్ గా పైనుంచి ఊడి పడ్డారా? ఎంత ఘోరం..?

ఎలక్షన్ కు పది రోజుల ముందు పెయిడ్ ఆర్టిస్టులతో కింద కూర్చొని మాట్లాడితే అన్నీ మర్చిపోయి ఓట్లు ఏస్తారని ఎట్లా అనుకున్నారు సారు..? వాళ్లే కాక, వాళ్ళ తల్లిదండ్రులు, అవ్వ తాతలని కూడా మీకు ఓటేయనిస్తారా సార్..? లాజిక్కులు బాగా మాట్లాడే మీరు ఇంత చిన్న లాజిక్ ని ఎట్లా మిస్ అయ్యారు సార్..?

మాట్లాడితే లక్షల ఉద్యోగాలు ఇచ్చినం అని చెప్పే మీరు అవి కాంట్రాక్టువా, ఔట్సోర్సింగ్ వా అని ఎందుకు చెప్పరు..? వేలమంది అవుట్సోర్సింగ్ వాళ్ళు జీతాలు లేక అలమటిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు కూడా మీ బినామీలైతే ఇంకెంత దారుణం..? ఎన్ని రోజులు రోడ్ల మీదికి వచ్చారు జీతాల కోసం..? ఇంకా ఏమని ఓటేస్తారు సార్ వాళ్ళు మీకు..?

ఇంకిన్ని ముఖ్యమైన ముచ్చట్లు

ఇంటర్ పరీక్షల రిజల్ట్స్. ఇప్పటిదాకా చరిత్రల ఇంటర్ రిజల్ట్స్ గంతగనం గడిబిడ ఎప్పుడు కాలే. ఫస్ట్ క్లాస్ వచ్చినోడిని ఫెయిల్ అని సూపెడితే ఎంత ఘోరం. పరీక్షలు, రిజల్ట్స్ బాధ్యత అంతా తెలిసిన కంపెనీకి ఇచ్చిండ్రని గ్లోబ్ అంతా కోడై కూసింది. కానీ.. పదుల సంఖ్యలో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే సర్కార్ కు చీమకుట్టినట్టు కూడా లేదు. పసిపిల్లలు సార్.., పాపం సార్. ఆ పిల్లలకు ఓటు హక్కు లేదనా..? అప్పట్లో వీడియోల ఓ పిల్లగాడు మాట్లాడండి ఇప్పటికి నాకు యాదికుంది. "మాకు ఓటు హక్కు వచ్చినంక మేమంటే ఏందో చూపిస్తాం ఖబర్ధార్" అని. నిజంగానే ఈ ఎలక్షన్ వరకు వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది సార్, వాళ్లు కూడా వాళ్ళ రిసల్ట్స్ ఇచ్చేసిండ్రు.

ఇగ మాది, అంటే.. వైద్యం. ఏదేమోగాని కరోనా వచ్చినప్పుడు అసెంబ్లీల ముఖ్యమంత్రి సార్ చెప్పిన ముచ్చట ఇంటే ప్రతిపక్షాలోళ్లు, సోషల్ మీడియా వోళ్లు సార్ కు పెట్టిన పేరు కరెస్టేనేమో అనిపించింది. గప్పడిదాకా నేనైతే నమ్మలే, ఆ మాట ఇనంగనే కోపం వచ్చేది నాకు, మా సార్ ని గట్ల అంటారా అని. ఇది వైద్యం కదా జర్రంతనన్న తెలుస్తది నాకు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. "నిన్ననే ఓ సైంటిస్ట్ భాయ్ సాబ్ ఫోన్ చేసిండు ఈ కరోనా వైరస్ మన తాన ఎక్కడ బతుకుతది 36 డిగ్రీస్ రాంగనే పట్టుమని చచ్చిపోతది" ఆ మాట ఇన్నంక నేను షాక్ లకు పోయిన.

అప్పుడే సార్ మీ మీద మొత్తం ఇంప్రెషన్ పోయింది. ఎందుకంటే 2018 లో ఎలక్షన్లకు 10 రోజుల ముందుగాల నేనే రాసిన "ఎలక్షనీయం" పేరుతోటి మీకెందుకు ఓటేయాలని, కాదు కాదు…, మీకే ఓటు వెయ్యాలని నాలుగు పేజీలు రాసిన. మహాకూటమిల చంద్రబాబు (CBN) సొచ్చినంక మస్తు కోపం వచ్చి రాసిన.

కానీ..., కరోనా ముచ్చట్లు ఇన్నంక నాకు కూడా తెలిసిపోయింది శానా వరకు జూటా మాటాలని. మాటలతోనే మత్పరిత్తవ్ గంతే. దాంట్ల నిజం ఉందా అబద్ధం ఉందా అనే ఆలోచన కంటే, ఎట్లా చెప్తే ఎదుటోడు చెవులు నిక్కరించి ఇంటడు, బాగా మైండ్లో పెట్టుకుంటాడు అనేది మీకు తెలిసినంత ఎవ్వలికీ తెల్వదు. కానీ..., తర్వాత ఏమైందో చూసిండ్రు కదా. లాక్ డౌన్ లు, ఆక్సిజన్ లేదు, బెడ్లు లేవు, చావులు, ఒమిక్రాన్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇంకా ఇప్పటి కూడా సతాయిస్తుంది సారూ... 36 డిగ్రీస్ కి కరోనా వైరస్ సచ్చిపోతది అంటే ఇంకా ఏం మాట్లాడేది?

ముఖ్యమంత్రి అంటే సాఫ్ట్ వేర్ నౌకరి అయింది. WFH వర్క్ ఫ్రం హోంకే పరిమితమైంది. వాస్తు పేరుతోటి సెక్రటేరియట్ కి రాకపోవడమేంది అసలు..? ఏమన్నా అంటే పని అవుతుందా లేదా ఆంటిరి...? గవర్నమెంట్ నౌకరి గాడు ఇంట్లకెల్లే పని చేస్తే ఒప్పుకుంటారా..? వాస్తు కోసమని ఉన్నది కూలగొట్టి వందల కోట్లు పెట్టి కొత్త బంగ్లా గడితిరి..! ఇప్పుడు ఏవలు కూసుంటండ్రు అక్కడ పెద్ద కుర్చీల మరి?

వాస్తు, యజ్ఞ యాగాలు, సెంటిమెంట్లు అన్ని సార్ల పనికి రావేమో..! ఓట్లే ఎప్పటికైనా గెలిపించేవి. అసలు ఎప్పుడొత్తరు సార్ మీరు బయటికి? సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు సచ్చిపోతేనో, లేకపోతే మీ ఎమ్మెల్యేల, మినిస్టర్ల ఇంట్లో సావులైతేనో, ప్రతిపక్షపోళ్ళని తిట్టుటానికో, ఎలక్షన్లు, బై ఎలక్షన్లు ఉంటేనో గంతే ఇగ. గప్పట్ల (1st Term లనే) కొండగట్టు కాడ బస్సు బొందల వడి 60 మందికి పైగా సచ్చిపోతే ఇప్పటిదాక ఒక్కసారైనా మందలిచ్చినవా..? ఎంత ఘోరం సార్ ఇది..? ఎనకటికి రాజులు కూడా పండగలప్పుడు జాతర్లప్పుడు పబ్లిక్ లకు వచ్చి కనిపించేటోల్లు అంటా.

మొన్న వచ్చిన 39 సీట్లలో కూడా ఎక్కువ వచ్చినయ్ ఆ GHMC లనే. అంటే మళ్ళా ఆంద్రోళ్ళ ఓట్లతో గెలిచినట్టు అనిపిత్తంది. అప్పుడేమో వాళ్లను పొట్టు పొట్టు తిడితివి, కొడుతా అంటివి. అసొంటిది ఇప్పుడు వాళ్లు బెల్లం అయిండ్రు. వాళ్ళ "సెప్పుకు ముళ్ళు ఇరికితే నోటితోటి తీత్తా" అంటే ఎందన్నట్లు..? రియల్ ఎస్టేట్ పడిపోతుందని, సాఫ్ట్ వేర్(Software) సంకనాకి పోతుందినని మస్తు భయపెట్టిండ్రు అంటా కదా సీక్రెట్ మీటింగ్ లల్ల.

హైదరాబాద్, అండ్ల ఇంకా హైటెక్ సిటీ చుట్టుపక్కల ఏరియా, ఆ బంగ్లాలు, ఆఫీసులు, రోడ్లు, ట్రాక్ లు చూస్తే మాత్రం మస్తు అనిపిస్తది, కళ్ళు జిగేల్ మంటాయి. అది చూసినంక మనం హైదరాబాద్ లో ఉన్నామా ఇంకేడున్నాం అనిపిస్తది. ఎవ్వలైనా ఆ డెవలప్మెంట్స్ ని ఒప్పుకోవాల్సిందే. అది సూసే ఓట్లు పడ్డాయి కావొచ్చు. కానీ మన పార్టీ మొదలు పెట్టినప్పుడు ఎన్నచ్చినయి సార్ మనకు హైదరాబాద్ లో..? మనల్ని మొదాటి కాంచి కడుపుల వెట్టుకోని సాదుకున్నది ఎవలు..? కరీంనగర్ ఓళ్లు, వరంగల్ ఓళ్లు కాదా..? ఇప్పుడెన్ని వచ్చినయ్ గాడ...?

"తెలంగాణకు హైదారాబాద్ గుండెకాయ కావొచ్చు కానీ, కరీంనగర్ తలకాయ". ఆ తలకాయల ధిమాగ్ ఏం సోచాయిస్తుందో అన్నది పట్టించుకోలే. గందుకే ధీమాగ్ కరాభ్ అయ్యే రిజల్ట్స్ ఇచ్చిండ్రు. (అంటే సిన్నప్పటికెల్లి ఆ కరీంనగర్ పేరు ఎక్కడ చెప్పిన జర్రంత వేరే ఉంటది లే).

ఇగ ఉద్యమంల పెద్ద మనుషుల తానకి వద్దాం. అసలు ప్రొఫెసర్ కోదండరాం సార్ సేసిన పాపం ఏందో ఇప్పటికీ ఎవ్వలకీ ఎరుకయిత లేదు. గప్పట్ల ఎగిలివారంగా తలుపులు తన్ని ఎత్తుకొని పోయిండ్రు పోలీసోళ్లు. మొన్ననేమో ఉద్యోగులంతా భుజాల మీదికి ఎత్తుకుని ఎగురవట్టిండ్రు. గాదె ఇన్నయ్య సారు ఆవేశంగా మాట్లాడుతుంటే ఆయనకు ఆనంద బాష్పాలు వచ్చినయ్. పాశం యాదగిరి సార్ , అందెశ్రీ గారు వీళ్ళంతా మాట్లాడుతుంటే వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్సా లేక తెలంగాణకి స్వతంత్రమా అనిపిచ్చింది..!

ఒకప్పుడు వీళ్ళందరే కదా ఈ తెలంగాణ గడ్డకోసం కొట్లాడింది, ముందట నిల్చున్నది. కరెంట్ JAC రఘు ఇలాంటి ఎంతో మంది తెలంగాణ పోరులో మీతో కలిసి నడిచిన వాళ్ళు తర్వాత ఎందుకు కంటికి కనవడ లేదు..? ఇంకా ఆ పెద్ద సారు, ప్రొఫెసర్ జయశంకర్ సారు ఉండి ఉంటే... వామ్మో ఊహకి కూడా అందడం లేదు దేవుడా..!

సర్కారు నౌకరోళ్లకు కరువు భత్యాలు, PRC లు పక్కకు వెడితే.., పస్టు తారిఖే జీతాలు ఇత్తం అని ఎలక్షన్ హామీల పెట్టే కాడికి ఈ రాష్ట్రం ఎందుకు దిగజారింది..? అగో గప్పటినుంచెలిమార్పు కోరుకున్నరు జనాలు.

అందుకే మార్పయింది.

ఆ మార్పు మంచికా చెడుకా అనేది కాలం నిర్ణయిస్తుంది..

-డాక్టర్ విజయ్ కుమార్ చల్లూరి, పిల్లల వైద్య నిపుణులు

డాక్టర్ విజయ్ కుమార్ చల్లూరి

(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు.)

తదుపరి వ్యాసం