తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jp Nadda : తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగుపడింది, బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు- జేపీ నడ్డా

JP Nadda : తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగుపడింది, బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు- జేపీ నడ్డా

25 June 2023, 20:29 IST

    • JP Nadda : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.
జేపీ నడ్డా
జేపీ నడ్డా

జేపీ నడ్డా

JP Nadda : తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, కానీ ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ది పొందిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. నాగర్ కర్నూలులో జరిగిన బీజేపీ నవ సంకల్ప బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ... తెలంగాణకు ప్రధాని మోదీ భారీగా నిధులు ఇచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశం పురోగమిస్తోందన్నారు. బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని జేపీ నడ్డా అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించామని, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనతో అన్ని వర్గాలకు న్యాయం చేశామని, దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని వారందరికీ నివాళి అర్పించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సామర్థ్యం పూర్తిగా నాశనం అయిందంటూ జేపీ నడ్డా మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నేతల జేబులు నింపుతున్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి

Pet Dog Attacked Infant : పెంపుడు కుక్క దాడిలో 5 నెలల పసికందు మృతి, రష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!

Medak Crime : భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం- పిల్లలు గుర్తొచ్చి మహిళ ఆత్మహత్య

Mahabubabad Crime : మంత్రాల నెపంతో దంపతులపై దాడి, మహబూబాబాద్ జిల్లాలో తరచూ దారుణాలు!

కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది

తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేస్తే ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని జేపీ నడ్డా ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే తెలంగాణ ఏర్పాటుతో లబ్ది పొందారని వ్యాఖ్యానించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనతో దేశం ఎన్నో రంగాల్లో ముందుకెళ్లగా, అందులో తెలంగాణ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో వేసిన రోడ్లను మోదీ ప్రభుత్వం కేవలం 9 ఏళ్ల పాలనలోనే నిర్మించారన్నారు. కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి రేషన్ అందిస్తుందని వెల్లడించారు. పేదవాడు ఆకలితో ఉండకూడదనే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదరికం 22 శాతం ఉంటే, మోదీ పాలనతో పేదరికం 10 శాతం కన్నా తక్కువకు తగ్గిందన్నారు. పేదవాడికి సొంతింటి కల సాకారం చేయడానికి 4 కోట్ల మందికి పక్కా 2.5 లక్షల ఇళ్లు కట్టించామన్నారు. కేసీఆర్ సర్కార్ ఆ ఇండ్లు తామే కట్టించామని గొప్పలు చెప్పుకుంటుందని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ విమర్శలు

రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదని, ప్రజలు అనుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అవినీతి, కుటుంబ పాలనపై కేంద్రం డేగ కళ్లతో చూస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, జానారెడ్డి చెప్పారన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన వాళ్లు బీఆర్ఎస్ లోకి వస్తారని కేసీఆర్‌ ప్లాన్ వేస్తున్నారన్నారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్‌ ఖరారు చేస్తారని, వారిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవొద్దని కేసీఆర్ కాంగ్రెస్ ను పైకి లేపుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ బలహీనంగా ఉన్న చోట 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు రూ.వేల కోట్లు పాకెట్‌ మనీ ఇచ్చి పెంచి పోషిస్తున్నారని కేసీఆర్ పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

తదుపరి వ్యాసం