తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Ktr | హైదరాబాద్ కు అన్నివైపులా ఐటీ పరిశ్రమలు.. ఉప్పల్‌ టూ నారపల్లి స్కైవే

Minister KTR | హైదరాబాద్ కు అన్నివైపులా ఐటీ పరిశ్రమలు.. ఉప్పల్‌ టూ నారపల్లి స్కైవే

HT Telugu Desk HT Telugu

13 February 2022, 16:39 IST

  • హైదరాబాద్ కు అన్ని వైపులా.. ఐటీ పరిశ్రమలను విస్తరించే లక్ష్యంతో పని చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరానికి తూర్పున ఉన్న ప్రాంతంలో లక్ష మంది ఐటీ ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఉప్పల్‌లో జెన్‌ ప్యాక్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.

జెన్‌ ప్యాక్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన
జెన్‌ ప్యాక్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన (Twitter)

జెన్‌ ప్యాక్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్‌‌లో ఐటీ ఒకే ప్రాంతానికి పరిమితం కావొద్దని.. ప్రభుత్వం అనుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందులో భాగంగానే నూతన ఐటీ పాలసీ తీసుకొచ్చినట్టు చెప్పారు. వెస్ట్ హైదరాబాద్‌కి దీటుగా ఈస్ట్ హైదరాబాద్ కూడా ఐటీ రంగంలో ఎదుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

జెన్‌ ప్యాక్ విస్తరణ పూర్తయితే లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తామని కేటీఆర్ వివరించారు. అంతేకాదు.. జెన్ ప్యాక్ వరంగల్ లోనూ.. విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. మాదాపూర్, హైటెక్‌ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు నగరం నలుమూలల విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో.. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు సేవలను విస్తరిస్తున్నాయని వివరించారు.

'పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా తూర్పు హైదరాబాద్‌ ఎదుగుతోంది. తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోల్ లో శిల్పారామం ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు స్కైవే నిర్మాణం జరుగుతుంది. ప్పల్‌ కూడలిలో స్కై వాక్‌ నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుంది.' అని మంత్రి కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ జన్మదిన వేడుకల కోసం పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 15, 16, 17 తేదీలలో సంబరంగా జరుపుకుందామని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ జన్మదినాన్ని సందర్భంగా ఎవరి తోచిన విధంగా వారు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకోవాలని కేటీఆర్ కోరారు. 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని.., ఫిబ్రవరి 17 తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం రోజున తెలంగాణ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తదుపరి వ్యాసం