తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Communist Congress Alliance: తెలంగాణలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్‌ పొత్తు పొడిచేనా? నేటి వరకు డెడ్‌లైన్

Communist Congress Alliance: తెలంగాణలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్‌ పొత్తు పొడిచేనా? నేటి వరకు డెడ్‌లైన్

Sarath chandra.B HT Telugu

02 November 2023, 8:00 IST

    • Communist Congress Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులపై నేటి వరకు వేచి ఉండాలని వామపక్షాలు భావిస్తున్నాయి. మధ్యాహ్నం మూడులోగా కోరిన స్థానాలు ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకోవాలని  అవి భావిస్తున్నాయి. 
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Communist Congress Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు విషయంలో వామపక్షాలకు స్పష్టత రాలేదు. కోరిన స్థానాలను కేటాయించే విషయంలో కాంగ్రెస్‌ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం సిపిఐ, సిపిఎంలను అసంతృప్తికి గురి చేసింది. మొదట్లో కేటాయిస్తామన్న స్థానాలను కూడా ఇప్పుడు కేటాయించే పరిస్థితులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచ చేస్తున్నాయి. మరోవైపు భట్టవిక్రమార్క విజ్ఞప్తితో నేటి మధ్యాహ్నం వరకు వేచి చూడనున్నట్లు సిపిఎం ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Online Job Fraud: ఆన్​ లైన్​ జాబ్​ పేరుతో మోసం, 12 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు, వరంగల్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు

TS TET 2024 Hall Tickets : కాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Hyd Brutal Attack: హైదరాబాద్‌లో ఘోరం.. పెంపుడు కుక్క వివాదంతో భార్యాభర్తలపై యువకుల దాడి

BRS Politics: గులాబీ గూటిలో గుబులు... భవిష్యత్ కార్యాచరణపై నజర్ పెట్టిన నేతలు

డెడ్‌లైన్‌లు పొడిగిస్తున్నా కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల మధ్య పొత్తుల విషయంలో క్లారిటీ మాత్రం రావడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ భావించినా అవి కోరిన స్థానాలను కేటాయించే పరిస్థితి లేకపోవడంతో పొత్తులు ముందుకు కదలడం లేదు. వామపక్షాలకు చెరో రెండు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తామని మొదట ప్రతిపాదించినా ఇప్పుడు ఆ స్థానాలపై స్పష్టత కొరవడింది.

చెన్నూరు నియోజక వర్గాన్ని మొదట సిపిఐకు కేటాయిస్తామని ప్రతిపాదించారు. మాజీ ఎంపీ వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో సమీకరణలు మారిపోయాయి. చెన్నూరులో బాల్క సుమన్‌పై వివేక్‌ను పోటీకి దింపుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో సిపిఐకు చెన్నూరును కేటాయించలేమని కాంగ్రెస్ చెప్పడంపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత మరొకరు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారంటూ ట్విిట్టర్‌లో కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు.

చెన్నూరులో పోటీ విషయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. వివేక్ పెద్దపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారా, అసెంబ్లీ ఎన్నికల్లో తలపడతారా అనే దానిపై స్పష్టత కొరవడింది. దీని ప్రభావం సిపిఐతొ పొత్తులపై పడింది.

మరోవైపు సిపిఎంతో పొత్తు విషయంలో కూడా ప్రతిష్టంబన కొనసాగుతొోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. తమ్మినేని విధించిన గడువు ముగిసే సమయానికి భట్టి విక్రమార్క మరికొంత గడువు కావాలని కోరడంతో గురువారం వరకు వేచి చూస్తామని సిపిఎం ప్రకటించింది.

ఇప్పటికే ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని ఆ పార్టీ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. సిపిఐ పోటీ చేసే స్థానాల్లో పోటీ చేయకూడదని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయించారు. మిర్యాలగూడ, వైరా స్థానాలు తమకు కేటాయించాలని సిపిఎం పట్టుబడుతోంది.

పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో 10 స్థానాల్లో పోటీకి సిద్ధపడాలన్న కీలక నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కలిపి 9 స్థానాల్లో పోటీ చేయాలని, ఇబ్రహీంపట్నంలోనూ బరిలో ఉండాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన ఆధారంగా గురువారం నిర్ణయాన్ని వెలువరించనున్నారు.

రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు బెడిసికొట్టాయి. తెలంగాణలోనూ తమతో పొత్తుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేనట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి.

మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌... ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధ పడటంతో కాంగ్రెస్‌తో జత కట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్‌ కూడా దీనికి సుముఖత వ్యక్తం చేసింది. మొదట్లో సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్‌ను కోరగా ఆ తర్వాత జరిగిన చర్చల్లో మూడు చొప్పున సీట్లు ఇవ్వాలని అడిగాయి. చివరకు ఆ సంఖ్య రెండేసి స్థానాల వద్దకు చేరుకుంది.

సీపీఐ కొత్తగూడెం, మునుగోడు అడగ్గా సీపీఎం మిర్యాలగూడతోపాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను కోరింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం వామపక్షాలు కోరిన స్థానాల్లో మార్పులు చేసింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు.. సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని ప్రతిపాదించింది. చివరకు సీపీఎంకు వైరా స్థానం కేటాయించే విషయంలో కాంగ్రెస్‌ పేచీ పెట్టింది. ఆ స్థానం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే పొత్తు ఉంటుందని సీపీఎం తేల్చిచెప్పింది.

సిపిఐకు కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినా ఇప్పటివరకు కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన చేయకపోవడంపై సీపీఐ అసంతృప్తిగా ఉంది. ఒంటరి పోరుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయించగా సీపీఐ మాత్రం ఎటూ తేల్చు కోలేకపోతుంది. కాంగ్రెస్‌తో ఎలాగైనా కలిసి ముందుకు సాగాల్సిందేనని, అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని సీపీఐకి చెందిన ఒక కీలక నేత పట్టుబడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

తదుపరి వ్యాసం