తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kakatitya University: వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ

Kakatitya University: వరుస వివాదాల్లో కాకతీయ యూనివర్సిటీ

HT Telugu Desk HT Telugu

09 January 2024, 10:10 IST

    • Kakatitya University: రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీగా పేరున్న కాకతీయ యూనివర్సిటీ వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది.
కాకతీయ యూనివర్శిటీ
కాకతీయ యూనివర్శిటీ

కాకతీయ యూనివర్శిటీ

Kakatitya University: కాకతీయ వర్శిటీలో వీసీ నియామకం నుంచి వివాదాలు వెంటాడుతుండగా.. తాజాగా కాంట్రాక్టర్​ కు బిల్లులు ఇచ్చేందుకు ఆడిట్​ సెక్షన్​ అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్​ కిష్టయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

ఆ తరువాత కూడా అదే పరిస్థితులు కొనసాగుతుండటం కూడా కలవరానికి గురి చేస్తోంది. దీంతోనే కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఇక్కడి విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

వరుస ఘటనలతో కలకలం

యూనివర్సిటీ హాస్టళ్లకు పాలు, పెరుగు సప్లై చేసే కాంట్రాక్టర్​ కు బిల్లులు చెల్లించే విషయంలో ఇక్కడి అధికారులు చేతివాటం చూపారు. పెండెం రాజేందర్​ అనే కాంట్రాక్టర్ వర్సిటీలోని నాలుగు హాస్టళ్లకు గతేడాది వరకు ​ పాలు, పెరుగు సరఫరా చేయగా.. ఆయనకు దాదాపు 19 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది.

ఆ బిల్లులు చెల్లించడానికి ఆడిట్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ రిజిస్ట్రార్​ కిష్టయ్య లంచం డిమాండ్​ చేశారు. రూ.50 వేలు ఇస్తేనే బిల్లులు క్లియర్​ చేస్తానని చెప్పడంతో చివరకు సదరు కాంట్రాక్టర్​ కిష్టయ్యను ఏసీబీకి పట్టించారు.

చదువులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో అవినీతి బాగోతం బయటపడటంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగిన మరునాడే మరో వివాదం కేయూ ఆఫీసర్లను చుట్టుముట్టింది. న్యాక్​ ఏ ప్లస్​ గ్రేడ్​ కోసం క్యాంపస్​ లో వివిధ పనులు చేయగా.. దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వడంలోనూ ఆఫీసర్లు కమీషన్లకు ఆశపడ్డారు.

ఈ మేరకు కమీషన్లు అందేదాకా బిల్లులు రిలీజ్​ చేయకపోవడంతో ఆ కాంట్రాక్ట్​ పనులు చేసిన వ్యక్తి మనోవేదనకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం వీసీ బిల్డింగ్​ కు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాగా కేయూ అధికారులు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే కాంట్రాక్టర్​ చనిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు వత్తాసు!

సక్రమంగా పనులు చేసే కాంట్రాక్టర్ల నుంచి లంచాలు డిమాండ్​ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కాకతీయ యూనివర్సిటీ అధికారులు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రం వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. తాజా ఘటనల్లో ఇద్దరు కాంట్రాక్టర్లు ఆఫీసర్ల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా.. కమీషన్లు ఇస్తున్న కాంట్రాక్టర్లు క్వాలిటీ లేని ఫుడ్​, పాలు, పెరుగు సరఫరా చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వర్సిటీలో 2023–24 విద్యాసంవత్సరానికి కిరాణా సామగ్రి, గుడ్లు, అరటి పండ్లు, పాలు, పెరుగు తదితర సరకులు సరఫరా చేసేందుకు 2023 ఆగస్టులో టెండర్లు నిర్వహించగా.. గతంలో సరఫరా చేసిన రాజేందర్​ కు కాకుండా ఈసారి వేరే వ్యక్తికి టెండర్​ ఇచ్చారు.

వర్సిటీ అధికారుల నిబంధనల ప్రకారం నాణ్యమైన విజయ డెయిరీ లేదా ముల్కనూరు డెయిరీకి సంబంధించిన పాలు, పెరుగు మాత్రమే సరఫరా చేయాలి. కానీ ఆ రెండూ కాకుండా తక్కువ రేటు కలిగిన క్వాలిటీ లేని పాలు, పెరుగు సరఫరా చేస్తున్నారని కేయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీలకు చెందిన పాలు, పెరుగు సప్లై చేస్తున్న ఫొటోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలోని విద్యార్థులకు క్వాలిటీ లేని ఫుడ్​ పెడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటున్న అధికారులు అన్నీ తెలిసీ సైలెంట్​ గా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాణ్యతలేని సరుకులు పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

వీసీ తీరుపై తీవ్ర విమర్ళలు

కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్​ నియామకం అయినప్పటి నుంచి ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021 మే నెలలో ఆయన వీసీగా బాధ్యతలు తీసుకోగా ఆయనకు ప్రొఫెసర్​ గా పదేండ్ల అనుభవం లేకున్నా వైస్​ ఛాన్సలర్​ పదవి అప్పగించడం వివాదానికి దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా తాటికొండ రమేశ్​ ను వీసీగా నియమించారంటూ కొందరు కోర్టుకు వెళ్లగా.. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి.

దీంతో పాటు వీసీ రమేశ్​, రిజిస్ట్రార్​ శ్రీనివాస రావు ప్రొఫెసర్ల ప్రమోషన్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. రూల్స్​ కు విరుద్ధంగా ఇద్దరూ సీనియర్​ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు తీసుకోవడంతో పాటు మరికొందరి విషయంలోనూ రూల్స్​ బ్రేక్​ చేశారనే వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.

పీహెచ్‌డి సీట్ల కేటాయింపులో అక్రమాలు

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్​డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగిన వ్యవహారం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. కొంతమంది అనర్హులకు పీహెచ్​ డీ సీట్లు కట్టబెట్టారని విద్యార్థి సంఘాల నేతలు గత ఏడాది సెప్టెంబర్​ 5వ తేదీ నుంచి దాదాపు 40 రోజుల పాటు నిరసన దీక్ష కొనసాగించారు.

దీంతో అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్​, అప్పటి ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ కల్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇలా ఒకదాని తరువాత మరో వివాదం వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం ఫోకస్​ పెట్టాలని వేడుకోలు

గత సెప్టెంబర్​ లో విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్​ రెడ్డి సందర్శించి, ఇక్కడి వీసీ, రిజిస్ట్రార్​ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వీసీ రమేశ్​ బీఆర్​ఎస్​ కు బంట్రోత్​ గా పని చేస్తున్నాడని, వీసీ, రిజిస్ట్రార్​ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఫైర్​ అయ్యారు.

ఇప్పుడు వరుస వివాదాలు వర్సిటీని చుట్టుముడుతుండటంతో సీఎం రేవంత్​ రెడ్డి వర్సిటీపై ఫోకస్​ పెట్టాలని ఇక్కడి విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు. కొందరు నేతలు ఇప్పటికే నేరుగా సీఎం రేవంత్​ రెడ్డిని కలిసి ఇక్కడి పరిస్థితిని కూడా వివరించినట్లు తెలిసింది. మరి సీఎం రేవంత్​ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ అధికారుల తీరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం