తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Medical Seats Issue: తెలంగాణ మెడికల్ సీట్ల భర్తీలో వెలుగు చూసిన అక్రమాలు

TS Medical Seats Issue: తెలంగాణ మెడికల్ సీట్ల భర్తీలో వెలుగు చూసిన అక్రమాలు

HT Telugu Desk HT Telugu

06 October 2023, 8:23 IST

    • TS Medical Seats Issue: తెలంగాణ మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మెడికల్ సీట్లలో లోకల్ కోటాను పూర్తిగా తెలంగాణ స్థానికత ఉన్న వారికే  ఇవ్వాలనే నిర్ణయంతో కొందరు అక్రమాలకు తెరతీశారు. వీటిని పసిగట్టిన వర‌్శిటీ పోలీస్ కేసులు నమోదు చేసింది. 
హైకోర్టు
హైకోర్టు

హైకోర్టు

TS Medical Seats Issue: తెలంగాణ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంలో నకిలీ స్థానిక ధృవీకరణ పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. నకిలీ ధృవపత్రాలతో అక్రమంగా ఎంబిబిఎస్‌ సీట్లను పొందిన ఏడుగురు విద్యార్ధులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి అడ్మిషన్లను రెండు రోజుల క్రితం కాళోజీ యూనివర్శిటీ రద్దు చేసింది. వీరిలో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన పోపులు సుబ్రహ్మణ్య సాయితేజ, వానిపెంట సాయిప్రీతికారెడ్డి, తమ్మినేని విష్ణుతేజారెడ్డి, తన్నీరు సంజయ్, అరికట్ల హనుమాన్ రెడ్డి, టేకులపల్లి మహేష్, గేర్లె భార్గవ్ ధర్మతేజ, యశ్వంత్ నాయుడులను అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

తప్పుడు ధృవీకరణ పత్రాలు రూపొందించిన కన్సల్టెన్సీ నిర్వాహకుడు కామిరెడ్డి నాగేశ్వరరావును కూడా గుర్తించారు. విజయవాడలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న నాగేశ్వరరావు ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. విద్యార్ధులతో పాటు నిర్వాహకుడిపై వరంగల్ మట్టెవాడ పిఎస్‌లో కేసు నమోదైంది. కాళోజీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

2023-24 విద్యా సంవత్సరానికి ఎంబిబిఎస్‌,బిడిఎస్ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎంబిబిఎస్ సీట్లు వచ్చిన ఏడుగురు విద్యార్ధులు సమర్పించిన పత్రాలపై వర్శిటీ అధికారులకు అనుమానం రావడంతో దర్యాప్తు జరిపారు. విద్యార్ధులు ఆరు నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నట్లు పత్రాలు సమర్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా వీరికి లోకల్ కోటలో సీట్లను కేటాయించారు.

విద్యార్ధులు పదోతరగతితో పాటు ఇంటర్ ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్నారు. నీట్‌ పరీక్షను కూడా విజయవాడలోనే రాశారు. వీరిని అనుమానించిన యూనివర్శిటీ అధికారులు ఒరిజినల్ పత్రాలతో నేరుగా వర్శిటీలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. విద్యార్ధులు తమ తరపున కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడని వెల్లడించారు. కామిరెడ్డి నాగేశ్వరరావు తమ తరపున ధృవపత్రాలను అప్‌లోడ్ చేసినట్లు చెప్పడంతో ఆ ధృవపత్రాలను నకిలీగా తేల్చిన యూనివర్శిటీ అధికారులు విద్యార్ధులతో పాటు నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.

ఏపీలో చదివితే తెలంగాణ స్థానికత ధృవీకరణ ఎలా?

ఏపీలో చదువుకున్న విద్యార్ధికి తెలంగాణలో స్థానిక ధృవీకరణ ఏ ప్రాతిపదికన ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ అలంపూర్‌ తహసీల్దార్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మెడికల్ సీట్ల భర్తీలో 85శాతం స్థానిక కోటా విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను ఇప్పటికే హైకోర్టు సమర్థించింది. స్థానికత విషయంలో మాత్రం సడలింపులు ఇచ్చింది.

ఈ క్రమంలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో, ఇంటర్‌ను కృష్ణా జిల్లాలో చదివిన ఓ విద్యార్థినికి మెడికల్‌ అడ్మిషన్‌ నిమిత్తం అలంపూర్‌లో 18 ఏళ్లుగా నివాసం ఉంటున్నట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది.

ధ్రువపత్రం ఇవ్వడానికి కారణాలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ అలంపూర్‌ ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నివాస ధ్రువీకరణపత్రం సమర్పించినా తన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జోగులాంబ-గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన సింగోటం వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినా మెడికల్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ ప్రక్రియలో స్థానిక కోటా కింద కాళోజీ యూనివర్సిటీ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. తన వినతిపత్రాన్ని తిరస్కరిస్తూ యూనివర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి అడ్మిషన్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. యూనివర్శిటీ వాదనలను విన్న ధర్మాసనం ఏపీలో చదివిన విద్యార్థినికి నివాస ధ్రువీకరణ పత్రాన్ని ఏ ప్రాతిపదికన ఇచ్చారో, ఏ ప్రాతిపదికన ధృవీకరణ మంజూరు చేశారో వివరణ ఇవ్వాలంటూ అలంపూర్‌ ఎమ్మార్వోను ఆదేశించింది.

తెలంగాణ స్థానికత కలిగి, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారికి స్థానికత విషయంలో రెవిన్యూ అధికారులు విచారణ తర్వాత ధృవీకరణలు మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టు గత నెలలో ఆదేశించింది.

తదుపరి వ్యాసం