తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ku Promotions: కేయూ సూపరింటెండెంట్ ప్రమోషన్లలో అవకతవకలు.. రాతపరీక్షలో ఫెయిలైనా ప్రమోషన్

KU Promotions: కేయూ సూపరింటెండెంట్ ప్రమోషన్లలో అవకతవకలు.. రాతపరీక్షలో ఫెయిలైనా ప్రమోషన్

HT Telugu Desk HT Telugu

24 January 2024, 7:06 IST

    • KU Promotions: కాకతీయ యూనివర్సిటీలో అధికారులు కల్పించిన ప్రమోషన్లలో జరిగిన అక్రమాలు కలకలం రేపుతున్నాయి.
వరంగల్ కేయూ పదోన్నతుల్లో అక్రమాలు
వరంగల్ కేయూ పదోన్నతుల్లో అక్రమాలు

వరంగల్ కేయూ పదోన్నతుల్లో అక్రమాలు

KU Promotions: వరంగల్‌ కేయూలో పదోన్నతుల కోసం రాత పరీక్ష నిర్వహించగా.. అందులో ఫెయిల్ వ్యక్తికి నాలుగేళ్ల తరువాత ప్రమోషన్ ఇవ్వడం వర్సిటీలో చర్చనీయాంశమైంది.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

అక్రమంగా ప్రమోషన్ కల్పించడం పట్ల అర్హులైన అభ్యర్థులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కాకతీయ యూనివర్సిటీ లో సూపరింటెండెంట్ గా ప్రమోషన్ల కోసం 2019 ఫిబ్రవరి లో రాత పరీక్ష నిర్వహించారు.

సూపరింటెండెంట్ ప్రమోషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది. కానీ సీనియర్ అసిస్టెంట్లతో పాటు కొందరు ల్యాబ్ అసిస్టెంట్ లను కూడా రాత పరీక్షకు అనుమతించారు. ఈ పరీక్షకు మొత్తం 34 మంది హాజరు కాగా.. అందులో తొమ్మిది మంది రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో ల్యాబ్ అసిస్టెంట్లు నలుగురు, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇందులో అర్హత సాధించిన వారికి మూడేళ్ల కిందట సూపరింటెండెంట్ ప్రమోషన్ ఇచ్చారు.

ఫెయిలయిన వారికి ప్రమోషన్

కాకతీయ యూనివర్సిటీలో ఒక సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉండగా.. రాత పరీక్షలో అర్హులైన వారిని సీనియార్టీ ప్రకారం నియమించాల్సి ఉంది. కానీ ఆ రూల్ పట్టించుకోకుండా కాకతీయ యూనివర్సిటీ వీసీ, మరో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కు బంధువైన ఉద్యోగినికి ప్రమోషన్ కల్పించడం విమర్శలకు దారి తీసింది.

గతంలో ప్రమోషన్ల కోసం నిర్వహించిన పరీక్షకు హాజరైన ల్యాబ్ అసిస్టెంట్ నర్మద ఫెయిల్ కాగా.. తన ప్రమోషన్ కోసం పాస్ కావడానికి 10శాతం మార్కులు తగ్గించమని వినతి పత్రం ఇచ్చింది. దీంతో 2021 జనవరిలో జరిగిన 133వ పాలక మండలి సమావేశంలో పాస్ మార్కులు తగ్గించడం కుదరదని, తప్పకుండా మళ్లీ పరీక్ష రాయాల్సిందేనని పాలక మండలి సభ్యులు తీర్మానం చేశారు.

అదే విధంగా కేవలం దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే 10 శాతం మార్కుల తగ్గింపు నియమం వర్తిస్తుందని నిర్ణయించారు. ఉద్యోగుల ప్రమోషన్ పరీక్షకు వర్తించదని కూడా పాలక మండలి సమావేశంలో స్పష్టం చేశారు.

ఈసీ నిర్ణయాలు బేఖాతరు

పాలక మండలి నిర్ణయానికి విరుద్ధంగా ల్యాబ్ అసిస్టెంట్ నర్మదకు సూపరింటెండెంట్ గా ప్రమోషన్ ఇవ్వడం యూనివర్సిటీలో చర్చనీయాంశమైంది. వీసీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు తమ కులానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇస్తూ మిగిలిన వారికి అన్యాయం చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

పి.నర్మదకు సూపరింటెండెంట్ ప్రమోషన్ ఇవ్వడానికి ప్రత్యేకంగా రీవాల్యుయేషన్ సౌకర్యం కల్పించి, అందులో పాస్ చేసి మరీ ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఏకంగా వీసీ పేషీ లోనే పోస్టింగ్ ఇవ్వడం కూడా వివాదానికి దారి తీసింది.

పరీక్ష ఫలితాలు వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత రీవాల్యుయేషన్ ఎలా చేస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఐదుగురు పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఉండగా ఫెయిల్ అయిన వారిని ఎందుకు నియమించాల్సి వచ్చిందనే దానిపై యూనివర్సిటీలో చర్చ జరుగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా సూపరింటెండెంట్ గా నియమించిన పి.నర్మదకు ప్రమోషన్ తో పాటు దానికి సంబందించిన బెనిఫిట్స్ 2020 నుంచే ఇస్తున్నట్లు ప్రమోషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

రిజిస్ట్రార్ ను నిలదీసిన ఉద్యోగులు

సూపరింటెండెంట్ గా నర్మదకు సోమవారం ప్రమోషన్ గా కల్పించగా.. అక్రమంగా జారీ చేసిన ప్రమోషన్ ఉత్తర్వులను రద్దు చేయాలని అర్హులైన అభ్యర్థులు, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వర్సిటీలో రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు అంతా కలిసి లెటర్ కూడా ఇచ్చారు.

రాత పరీక్ష పాసైన ఐదుగురిలో అర్హులైన వారికి మాత్రమే సూపరింటెండెంట్ ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగులకు న్యాయం చేయాలని, వెంటనే అక్రమంగా ఇచ్చిన ప్రమోషన్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఉత్తర్వులు రద్దు చేసేంత వరకు పోరాడుతామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

దీంతో రిజిస్ట్రార్ ఆ ప్రమోషన్ ఉత్తర్వులను రద్దు చేయడానికి నోట్ తయారు చేసినట్టు తెలిసింది. దీనిని అప్రూవల్ చేయడానికీ వీసీ సంతకం అవసరం ఉండగా.. వీసీ ప్రొఫెసర్ రమేష్ గత రెండు రోజుల నుంచి అందుబాటులో లేకపోవడం గమనార్హం.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం