తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vande Bharat Express : త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు….

Vande Bharat Express : త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు….

HT Telugu Desk HT Telugu

24 January 2023, 10:10 IST

    • Vande Bharat Express దక్షిణాది రాష్ట్రాల మీదుగా  త్వరలో మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌రైళ్లను  ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.  దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను  నడుపుతుండగా,  మరో మూడు సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ సిరీస్ రైళ్ల ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 
దక్షిణ భారత దేశంలో త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు.....
దక్షిణ భారత దేశంలో త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు..... (HT_PRINT)

దక్షిణ భారత దేశంలో త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు.....

Vande Bharat Express దక్షిణాది రాష్ట్రాల పరిధిలో మరో మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది. కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరుకు, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్‌ నుంచి పుణె నగరాల మధ్య సర్వీసులను అందించనున్నట్టు తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్‌ రైలును చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య గతేడాది నవంబర్‌లో ప్రారంభించారు.

సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్‌-వైజాగ్‌ మధ్య మరో రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య సర్వీసులు ప్రారంభమైనప్పట్నుంచి ఈ రైలు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు వీలుగా భాజపా శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దక్షిణాదికి ప్రత్యేకంగా కేటాయింపులపై ప్రచారం చేసుకునేందుకు వీలుగా కొత్త రైళ్లను ప్రకటించనున్నారు.

మరోవైపు వందేభారత్ రైళ్ల మెయింటీనెన్స్‌ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ డివిజన్లలో కనీసం ఒక్క కోచింగ్‌ డిపోలోనైనా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేయాలని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే డివిజన్ల అధికారులు ఉన్నతాధికారులను కోరారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరికల్లా 75 వందే భారత్‌ రైళ్లు నడపాలని కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది.

వచ్చే మూడేళ్లలో 400లకు పైగా వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. వందే భారత్‌ రైళ్లను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలోని పలు నగరాల మధ్య ఎనిమిది రైళ్లను నడుపుతోంది.

వందే భారత్‌కు పెరుగుతున్న ప్రయాణికుల ఆదరణ….

సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని ప్రారంభించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మంచి స్పందన లభిస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. తొలి మూడ్రోజుల్లో రైలు పూర్తి స్థాయి సామర్థ్యంతో రాకపోకలు సాగించింది. ట్రైన్‌లో సీట్లన్ని నిండిపోయాయి. జనవరి 14వ తేదీ నుంచి ప్రయాణికులకు బుకింగ్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చినా రైలు సర్వీసులు మాత్రం 16వ తేదీ నుంచి మొదలయ్యాయి.

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ నగరాల మధ్య ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వచ్చిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సీట్ల వినియోగం 100 శాతం కంటే అధికంగా ఉందని వెల్లడించింది. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య 16వ తేదీన 99శాతం సీట్లు నిండాయి, 17వ తేదీన 144శాతం , 18 తేదీన 149% ఆక్యుపెన్సీ వచ్చిందని ప్రకటించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య 16వ తేదీన 122%, 17న 147%, 18న 117% ఆక్యుపెన్సీ నమోదైంది.

విశా‌ఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలులో 14 ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లలో 1024 సీట్లు, 2 ఎగ్జిక్యూటివ్‌ ఏసీ ఛైర్‌ కార్‌ కోచ్‌లలో 104 సీట్లు కలిపి మొత్తం 1128 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభించిన అనతి కాలంలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. విశాఖ-సికింద్రాబాద్ మధ్య వేగంగా ప్రయాణించడానికి వీలుగా ఉండటంతో ఎక్కువ మంది రైలును ఎంచుకుంటున్నారు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుండటంతో ఎక్కువ మంది ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం