తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Congress Geethareddy: ఎన్నికల్లో పోటీకి మాజీ మంత్రి గీతారెడ్డి దూరం..

TS Congress Geethareddy: ఎన్నికల్లో పోటీకి మాజీ మంత్రి గీతారెడ్డి దూరం..

HT Telugu Desk HT Telugu

29 August 2023, 13:13 IST

    • TS Congress Geethareddy: మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి ఇకపై ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 77ఏళ్ల గీతారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నారు. ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గీతా రెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు.
ఎన్నికల్లో పోటీకి  కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి దూరం
ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి దూరం (facebook)

ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి దూరం

TS Congress Geethareddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గీతారెడ్డి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర‌్ణయించుకున్నారు. 77ఏళ్ల గీతారెడ్డి సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వయోభారం కారణంగా ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని గీతారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఏడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన గీతారెడ్డి నాలుగుసార్లు విజయం సాధించగా మూడు సార్లు ఓటమి పాలయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

గీతా రెడ్డి చివరిసారిగా 2018 లో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేశారు. నాటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్ధి కొనింటి మాణిక్ రావు చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం జహీరాబాద్‌లో ఈ సారి చంద్రశేఖర్‌ను బరిలో దింపాలని భావిస్తోంది.

మాజీ మంత్రి, ఐదు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఏ.చంద్రశేఖర్ ఈసారి జహీరాబాద్ నియోజకవర్గం నుండి పోటీలో నిలపాలని ఆ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. చంద్రశేఖర్ ని జహీరాబాద్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆగష్టు 28న జహీరాబాద్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచి గీతా రెడ్డి ని రాజ్య సభకి పంపడానికి కృషి చేస్తానని చెప్పటంతో గీతారెడ్డి ఇక ఎన్నికల్లో పోటీచేయరని స్పష్టమైంది.

వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ అయినా గీతారెడ్డి 1971 నుండి 1985 వరకు ఆస్ట్రేలియా, లండన్, సౌదీ అరేబియాలలో భర్త రామచంద్ర రెడ్డి తో కలిసి పని చేసారు. మాజీప్రధాని రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరి 1989లో గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1994, 1999 లో గజ్వేల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2004లో అదే నియోజకవర్గం నుండి గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో పని చేసారు. 2009లో నియోజక వర్గాల పునర్ విభజన తర్వాత గజ్వేల్ జనరల్ సీట్‌గా మారింది. జహీరాబాద్ ఎస్సి రిజర్వుడు స్థానంగా గా మారటంతో గీతా రెడ్డి 2009లో గజ్వేల్ నుండి జహీరాబాద్ మారారు.

2009 ఎన్నికల్లో జహీరాబాద్‌లో కూడా విజయం సాధించి వైఎస్సార్‌, రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో పది సంవత్సరాలు మంత్రిగా పని చేశారు . 2014 లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి గెలిచినా, కొత్తగా గెలిచిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం తో, ప్రతిపక్షం ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా పనిచేశారు

ప్రస్తుతం వయసు పైబడటం, గీతారెడ్డికి రాజకీయ వారసులు కూడా ఎవరు లేకపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత జహీరాబాద్ నియోజకవర్గంలో గీతారెడ్డి పరిమితంగానే పర్యటించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా అనుభవజ్ఞుడైన చంద్రశేఖర్ ని ఎన్నికలలో నిలబెట్టాలని నిర్ణయించుకోవడంతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని గీతారెడ్డి నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే గీతా రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం లేదా , ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.

(Reporting S.Kavitha/Medak)

తదుపరి వ్యాసం