తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Etela Rajender : నాడు కేసీఆర్ కుడిభుజం, నేడు బీజేపీ చేతిలో అస్త్రం

Etela Rajender : నాడు కేసీఆర్ కుడిభుజం, నేడు బీజేపీ చేతిలో అస్త్రం

22 July 2023, 7:00 IST

    • Etela Rajender: రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నేత.. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం కొట్లాడిన ప్రస్థానం. ఆత్మగౌరవం నినాదంతో రాజీనామా చేసి కేసీఆర్ ను ఢీకొట్టి విజయం సాధించిన ఘనత. టీఆర్ఎస్ లో రెండో స్థానం వరకూ ఎదిగి అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసిన ఈటల పొలిటికల్ జర్నీపై కథనం.
ఈటల రాజేందర్
ఈటల రాజేందర్

ఈటల రాజేందర్

Etela Rajender Political Journey : తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం కొట్లాడిన నేత, కేసీఆర్ కుడిభుజంగా టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలుగిన నాయకుడు. ఆత్మగౌరవం నినాదంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ నే ఢీకొట్టి విజయం సాధించిన ఘనత...ఈటల రాజేందర్ సొంతం. ఈటల రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో సామాన్య కార్యకర్త నుంచి మంత్రి వరకూ ఎదిగారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవి పోగొట్టుకున్నా... ఆత్మగౌరవం నినాదంతో రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడు సార్లు ఎమ్మెల్యే(ఉపఎన్నికలతో సహా)గా గెలిచి.. ఓటమి అంటే తెలియని నేతగా ఈటల రాజేందర్ చరిత్ర సృష్టించారు. 14 ఏళ్లపాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటే ఉన్నారు ఈటల. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న ఈటల, ప్రజల కోసం అవసరమైతే పార్టీ అధినేతను కూడా ఎదిరించారు.

ట్రెండింగ్ వార్తలు

Operation Cheyutha: భద్రాద్రి జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు, సత్ఫలితాలిస్తున్న "ఆపరేషన్ చేయూత"

Genco Fire Accident: రామగుండం జెన్‌కో లో అగ్ని ప్రమాదం,తృటిలో తప్పిన ప్రాణ నష్టం

Sircilla News : రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్

ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

ఈటల రాజేందర్ 1964 మార్చి 20న హన్మకొండ జిల్లాలోని కమలాపురం ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌ నగరంలోనే జరిగింది. కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో పదో తరగతి, హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, 1984లో మసాబ్ ట్యాంక్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ముదిరాజు కులానికి చెందిన ఈటల రాజేందర్, రెడ్డి కులానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు. వీరు ఇరువురూ పీడీఎస్‌యూలో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు ప్రేమించుకుని, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు నితిన్ రెడ్డి, కూతురు నీతా రెడ్డి ఉన్నారు.

టీఆర్ఎస్‌లో ప్రస్థానం

ఈటల రాజేందర్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని టీఆర్ఎస్ తో మొదలుపెట్టారు. కేసీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన టీఆర్ఎస్ లో రెండో స్థానానికి ఎదిగారు. ఈటల తన కుడిభుజం అని కేసీఆరే స్వయంగా చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక కోళ్ల ఫారం, కోళ్ల హాచరీల రంగంలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఈటలపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టినవే. ఐదు కేసుల్లో ఈటలను కోర్టు దోషిగా తేల్చింది. కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన ఈటల... టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడిగా వ్యవహరించారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిగా ఆయనకు సముచిత స్థానం దక్కింది. 2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టినప్పుడు వైద్య ఆరోగ్య మంత్రిగా వ్యవహరించారు. 2002లో టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు ఈటల. 2004, 2008 ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఈటల. 2009, 2010, 2014, 2018, 2021 సంవత్సరాలలో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి విజయం సాధించారు. ప్రతీసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో చూపారు.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా

ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. 2002లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరారు. 2004 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూరం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్‌ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2008 ఉపఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఈటల పనిచేశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూరం హుజూరాబాద్‌ నియోజకవర్గంగా మారింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌ రావుపై, 2010 ఉపఎన్నికల్లో ముద్దసాని దామోదర రెడ్డిపై గెలిచి నాల్గోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై గెలిచి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి గెలిచి ఆరోసారి ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అనివార్య కారణాలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల 2021లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 2021 ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

వైఎస్ కు ధీటుగా

2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ 50 స్థానాల్లో పోటీ చేసి 40 చోట్ల ఓడిపోయింది. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... 'తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతోందా రాజేంద్రా నీకు' అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. టీఆర్ఎస్ సభాపక్షం నాయకుడిగా వ్యవహరిస్తూ...వైఎస్ఆర్ లాంటి ధీటైన నేతను సమర్థంగా ఎదుర్కొన్నారు ఈటల. సభలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేవారు. ఈటల సామర్థ్యం తెలిసిన వైఎస్... 2009 ఎన్నికల తర్వాత ఈటలను కాంగ్రెస్ లో ఆహ్వానించారని, కానీ అందుకు ఆయన నిరాకరించారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.

భూకబ్జా ఆరోపణలు, టీఆర్ఎస్ నుంచి బయటకు

టీఆర్ఎస్ లో రెండో స్థానం వరకూ ఎదిగిన ఈటల... అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. 2021లో ఈటల రాజేందర్ కు చెందిన జమునా హాచరీస్‌పై భూఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన కేసీఆర్... ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. తరువాత జూన్ 4న పార్టీకి, జూన్ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రాజేందర్. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి, జూన్ 14న బీజేపీలో చేరారు రాజేందర్. 2021 ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఈటల బీజేపీలో కీలకంగా మారారు. కేసీఆర్ లూప్ హోల్స్ తెలిసిన వ్యక్తిని తానంటూ రాజేందర్ ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు ఈటలను సమర్థంగా ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తుంది. తాజాగా బీజేపీ అధిష్ఠానం ఈటలకు బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.

హుజురాబాద్ ఉపఎన్నిక

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగింది హుజురాబాద్ ఉపఎన్నిక. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రాజేందర్ 2021 జూన్ 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉపఎన్నికను కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించాలనే లక్ష్యంగా కేసీఆర్...నిధులు వరద పారించారు. మంత్రులందరికీ రంగంలోకి దింపి మండలాల వారీగా ప్రచారం చేయించారు. అయినా ప్రజలు ఈటల రాజేందర్ కే పట్టం కట్టారు. దళిత బందు వంటి పథకాలతో ఓటర్లను ఆకట్టుకోవాలని చూసినా ప్రజలు ఈటల వైపే నిలబడ్డారు. ముదిరాజ్ వర్గంలో పట్టున్న ఈటల రాజేందర్.. సొంత బలంతో హుజురాబాద్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హుజురాబాద్ బై ఎలక్షన్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఈటల రాజేందర్... టీఆర్‌‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‎పై 23,855 ఓట్ల భారీ ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కేసీఆర్-ఈటల మధ్య దూరం

కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన ఈటల... టీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈటల తన కుడి భుజం అని అన్నారు. ఈటల నియోజకవర్గం నుంచే కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. కరోనా టైంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల సమర్థంగా పనిచేశారు. 2018 నుంచి కేసీఆర్‌, ఈటల రాజేందర్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈటల రాజేందర్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని అధిష్ఠానం భావించింది. టీఆర్ఎస్ జెండాలకు మేమూ ఓనర్లమే, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం వంటి వ్యాఖ్యలు ఈటలకు, కేసీఆర్ కు మధ్య మరింత దూరం పెంచాయి. రైతు బంధు పథకం విషయంలో... ధనవంతులకు ఇవ్వక్కర్లేదని, దానికి గరిష్ట పరిమితి ఉండాలని ఈటల వాదించారు. పలు సందర్భాల్లో ప్రభుత్వ విధానాలపై ఈటల బహిరంగంగా విమర్శలు చేశారు. దీంతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వడంతో క్రమంగా ఈటల ప్రాధాన్యత తగ్గించారని టాక్ నడిచింది. చివరకు భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడం, అనంతరం పార్టీ నుంచి బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. అధిష్ఠానంపై ధిక్కారస్వరం, ముక్కుసూటి వ్యాఖ్యలు, కేటీఆర్ కు పోటీ వస్తున్నారనే ఈటలను తప్పించారని కొందరు నేతల అభిప్రాయపడుతుంటారు. కేసీఆర్ తర్వాతి స్థానం వరకూ ఎదిగిన ఈటల.. అనూహ్యంగా పార్టీ నుంచి బయటకు రావడం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి నిదర్శనం.

తదుపరి వ్యాసం