తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tslprb Recruitment : పోలీసు అభ్యర్థుల్లో ఎందుకీ ఆందోళన.. అసలేంటీ వివాదం ?

TSLPRB Recruitment : పోలీసు అభ్యర్థుల్లో ఎందుకీ ఆందోళన.. అసలేంటీ వివాదం ?

Thiru Chilukuri HT Telugu

06 January 2023, 23:23 IST

    • TSLPRB Recruitment : తెలంగాణ పోలీసు నియామకాల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. తుది పరీక్షకు ఎంపికైన వారి వివరాలను  తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వెల్లడించింది. అయితే.. అనేక మంది అభ్యర్థులు నియామక ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇంతకీ అభ్యర్థుల్లో ఎందుకీ ఆందోళన… అసలేంటీ వివాదం ? 
పోలీసు ఉద్యోగ నియామకలపై వివాదం
పోలీసు ఉద్యోగ నియామకలపై వివాదం

పోలీసు ఉద్యోగ నియామకలపై వివాదం

TSLPRB Recruitment : తెలంగాణ పోలీస్ నియామక ప్రక్రియ వివాదం.. రోజు రోజుకీ ముదురుతోంది. ప్రాథమిక పరీక్షల ఫలితాల వెల్లడి తర్వాత అభ్యర్థుల్లో మొదలైన అలజడి.. దేహదారుఢ్య పరీక్షలతో తీవ్ర రూపం దాల్చింది. ఆశావాహుల పోరాటానికి రాజకీయ పార్టీల నేతలు తోడవటంతో.. ఈ సమస్య ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వివాదాలకు తావు లేకుండా పలుమార్లు నియామకాలు పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB).. ఈ సారి నియామక ప్రక్రియలో చేసిన కొన్ని మార్పులే.. మొత్తం వివాదానికి దారి తీశాయి. అయితే.. దేహదారుఢ్య పరీక్షలు కూడా పూర్తయి.. తుది రాత పరీక్షల తేదీలు కూడా వెల్లడైన నేపథ్యంలో... ఆశావాహులు చేస్తున్న పోరాటం ఎక్కడి వరుకు వెళుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

554 ఎస్సై.. 15,644 కానిస్టేబుల్... 614 ఆబ్కారీ కానిస్టేబుళ్ల పోస్టులకి గతేడాది TSLPRB నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్ లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. అయితే.. ఫలితాల వెల్లడి తర్వాత అసలు వివాదం మొదలైంది. ఈ పరీక్షల్లో 22 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని.. వాటికి సంబంధించిన మార్కులు కలపాలని అనేక మంది అభ్యర్థులు డిమాండ్ చేశారు. కటాఫ్ మార్కుల నిర్ణయంపైనా విమర్శలు వచ్చాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు మాత్రమే కటాఫ్ మినహాయింపు ఇచ్చారని.. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకూ ప్రిలిమనరీ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. ఈ వివాదాల మధ్యే .. TSLPRB .. దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. డిసెంబర్ 8 నుంచి జనవరి 5 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

దేహదారుఢ్య పరీక్షలు మొదలయ్యాక.. మరో వివాదం తెరపైకి వచ్చింది. 2014, 2018 లో ఇచ్చిన నోటిఫికేషన్లకు భిన్నంగా ఈ సారి ఇచ్చిన ప్రకటనలో.. ఫిజికల్ ఈవెంట్స్ లో TSLPRB కొన్ని మార్పులు చేసింది. గతంలో 5 ఈవెంట్స్ ఉండగా.. ఈ సారి కేవలం 3 ఈవెంట్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. గతంలో.. 100 మీటర్స్, లాంగ్ జంప్, షాట్ పుట్, హై జంప్, 800 మీటర్స్ లో పరీక్షలు నిర్వహించే వారు. సివిల్, ఏఆర్ పోస్టుకి అన్ని ఈవెంట్లలో క్యాలిఫై కావాలనే నిబంధన ఉండేది. మిగతా పోస్టులకి... ఏవైనా 3 ఈవెంట్లలో (800 మీటర్స్ తప్పనిసరి) క్యాలిఫై అయినా అర్హులయ్యేవారు. అయితే... 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ లో మాత్రం.. కేవలం 3 ఈవెంట్లలో (1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్) దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన బోర్డు.... తుది రాత పరీక్షకు ఎంపిక కావాలంటే... ఈ మూడింట్లో అర్హత సాధించాలనే నిబంధన పెట్టింది. దీంతో.... ఏ ఒక్క ఈవెంట్లో తప్పినా... ఏ పోస్టుకి పోటీ పడే అవకాశం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక.. ఈ మూడు ఈవెంట్లలోనూ.. లాంగ్ జంప్ విభాగంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో లాంగ్ జంప్ అర్హత 3.80 మీటర్లకు పేర్కొన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే నిబంధన అమల్లో ఉంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల్లో కూడా ఇంతే దూరం ఉంటుందని అభ్యర్థులు చెబుతున్నారు. అయితే... ఈ సారి ఇచ్చిన నోటిఫికేషన్ లో TSLPRB లాంగ్ జంప్ అర్హతని 4 మీటర్లుగా పేర్కొంది. నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో అభ్యర్థులు ఈ విషయంపై అంతగా దృష్టి సారించలేదు. అయితే... దేహదారుఢ్య పరీక్షల్లో ఎక్కువ మంది అభ్యర్థులు లాంగ్ జంప్ లోనే డిస్ క్వాలిఫై కావడంతో... ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. ఇక.. గత నోటిఫికేషన్ల సమయంలో అభ్యర్థుల ఎత్తుని మాన్యువల్ గా కొలిచారు. ఈ సారి పారదర్శకత కోసం అంటూ.. డిజిటల్ మీటర్లను ఉపయోగించారు. ఇదే తమ పాలిట శాపంగా మారిందని ఇప్పుడు అనేక మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నోటిఫికేషన్లకు ఎత్తు అంశంలో అర్హత సాధించిన తాము.. ఈ సారి మాత్రం డిజిటల్ మీటర్ల కారణంగా క్వాలిఫై కాకుండా పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ మీటర్ల కొలతల్లో... 1 సెంటీమీటర్ ఎక్కువ లేదా తక్కువ పాయింట్ ఆఫ్ ఎర్రర్ ఉంటుందని పేర్కొన్నారని.. కానీ ఫిజికల్ ఈవెంట్స్ సమయంలో ఈ విషయాన్ని అధికారులు విస్మరించారనే ఆరోపణలు వస్తున్నాయి.

TSLPRB చర్యల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామనే ఆవేదన అనేక మంది అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతోంది. కొంత మంది హైదరాబాద్ వరకు వచ్చి.. ఆందోళనలు సైతం నిర్వహించారు. విపక్ష పార్టీల నేతలు అభ్యర్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్... బీజేపీ నేత ఈటల రాజేందర్ ... పోలీసు నియామకాల్లో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పు పట్టారు. కఠిన నిబంధనలను సడలించి.. అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోలీసు అభ్యర్థుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా.. ప్రెస్ క్లబ్ లోనే బైఠాయించిన అభ్యర్థులు ... జనవరి 9న చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు.

ఈ విమర్శలన్నింటినీ తోసిపుచ్చిన బోర్డు... నియమ నిబంధనల మేరకే ప్రక్రియ కొనసాగుతోందని అంటోంది. ప్రాథమిక పరీక్షలో తప్పులంటూ అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. వివాదాలు, ఆరోపణలు, ఆందోళనలు పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతోంది. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు తుది పరీక్షలు ఉంటాయని TSLPRB ప్రకటించింది. మరోవైపు... దేహదారుఢ్య పరీక్షల నిబంధనలు, డిజిటల్ మీటర్ల అంశంపై ఇప్పటికే కొంత మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... పోలీసు నియామక ప్రక్రియపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ? నియామక ప్రక్రియ నిర్ణీత సమయానికి పూర్తవుతుందా ? అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తోన్న అభ్యర్థులకు ఏదైనా ఊరట లభిస్తుందా ? లేక ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా ?

తదుపరి వ్యాసం