తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dc Vs Pbks | దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లు.. చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్

DC vs PBKS | దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లు.. చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్

Hari Prasad S HT Telugu

20 April 2022, 22:17 IST

    • ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ షోతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సులువుగా గెలిచింది.
హాఫ్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్
హాఫ్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్ (PTI)

హాఫ్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్

ముంబై: మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇద్దరు కీలక ప్లేయర్స్‌కు కరోనా సోకింది. అసలు మ్యాచ్‌ జరగుతుందో లేదో అన్న సందిగ్ధత. ఇలాంటి పరిస్థితుల్లోనూ కళ్లు చెదిరే ఆటతో అదరగొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్‌. బౌలింగ్‌, బ్యాటింగ్‌లలో పూర్తి ఆధిపత్యం కనబరచిన ఆ టీమ్‌.. పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌కు అనుకూలించే బ్రాబౌర్న్‌ పిచ్‌పై చేతులెత్తేసిన పంజాబ్‌ బ్యాటర్లు.. బౌలింగ్‌లో మరీ దారుణంగా తేలిపోయారు. దీంతో 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ 10.3 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఆ టీమ్‌ ఓపెనర్లు పృథ్వి షా, డేవిడ్‌ వార్నర్‌.. పంజాబ్‌ బౌలర్లను చితకబాదారు. ఇన్నింగ్స్‌ తొలి బంతి నుంచే దాడి మొదలుపెట్టిన వాళ్లు.. పవర్‌ ప్లే ముగిసే సమయానికే 81 పరుగులు జోడించి మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చారు. పృథ్వి షా 20 బంతుల్లోనే 41 రన్స్‌ చేసి ఔటైనా.. మిగిలిన పనిని మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ముగించారు. పృథ్వి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. డేవిడ్‌ వార్నర్‌ 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో అతనికిది 53వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. చివరికి వార్నర్ 30 బంతుల్లో 60 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మరో బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 12 రన్స్ తో అజేయంగా ఉన్నాడు. ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి చేరింది. ఢిల్లీకి ఆరు మ్యాచ్ లలో ఇది మూడో విజయం.

ఒక్కరూ నిలబడలేదు

అంతకుముందు పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో భారీ స్కోర్లకు వేదికైన బ్రాబౌర్న్‌ స్టేడియంలో.. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరే 194 పరుగులుగా ఉన్న ఆ పిచ్‌పై పంజాబ్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్‌లో.. ఒక్క ప్లేయర్‌ కూడా క్రీజులో నిలదొక్కుకోకపోవడంతో తక్కువ స్కోరుకే సరిపెట్టుకుంది. 20 ఓవర్లలో ఆ టీమ్‌ 115 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. ఈ సీజన్ ఐపీఎల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

ఖలీల్‌ అహ్మద్‌, లలిత్‌ యాదవ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఒక దశలో 14.3 ఓవర్లలోనే 92 రన్స్‌కు 8 వికెట్లు కోల్పోయిన ఆ టీమ్‌.. మొత్తం ఓవర్లయినా ఆడుతుందా అన్న సందేహం కలిగింది. అయితే టెయిలెండర్లు ఎలాగోలా చివరి వరకూ క్రీజులో ఉండి.. ఆ మాత్రం స్కోరైనా సాధించిపెట్టారు.

గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ తిరిగొచ్చాడు. పైగా కరోనా దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ మానసికంగా బలహీనమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పంజాబ్‌ పైచేయి సాధించలేకపోయింది. వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే పెవిలియన్‌కు చేరాడు. చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. 

ఓపెనర్లు మయాంక్‌, శిఖర్‌ ధావన్‌ 3.4 ఓవర్లలోనే 33 రన్స్‌ జోడించి మంచి ఆరంభాన్నే ఇచ్చినా.. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది పంజాబ్‌ కింగ్స్‌. శిఖర్‌ ధావన్‌ (9) తొలి వికెట్‌గా వెనుదిరగగా.. ఆ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ (24), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (2), జానీ బెయిర్‌స్టో (9)లాంటి స్టార్‌ బ్యాటర్లు వరుసగా ఔటయ్యారు. ఇక ఏ దశలోనూ ఆ టీమ్‌ కోలుకోలేకపోయింది. ఒక్క జితేష్‌ శర్మ మాత్రమే 32 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. షారుక్‌ ఖాన్‌ (12), రబాడా (2) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

టాపిక్

తదుపరి వ్యాసం