తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Atal Pension Yojana | అటల్‌ పెన్షన్‌ యోజన (Apy) తో నెలనెలా పెన్షన్‌ పొందండి

Atal Pension Yojana | అటల్‌ పెన్షన్‌ యోజన (APY) తో నెలనెలా పెన్షన్‌ పొందండి

03 January 2022, 19:57 IST

    • APY.. అటల్‌ పెన్షన్‌ యోజన మనం వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడకుండా నెలనెలా పెన్షన్‌ అందుకునేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. జూన్‌ 1, 2015న ప్రారంభమైన ఈ పథకం పరిధిలో పాలసీ తీసుకుంటే 60 ఏళ్ల వయస్సు వచ్చాక నెలనెలా రూ. 1000 నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్‌ పొందవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం: వృద్ధాప్యంలో భరోసాకు అటల్ పెన్షన్ యోజన
ప్రతీకాత్మక చిత్రం: వృద్ధాప్యంలో భరోసాకు అటల్ పెన్షన్ యోజన (pixabay)

ప్రతీకాత్మక చిత్రం: వృద్ధాప్యంలో భరోసాకు అటల్ పెన్షన్ యోజన

అటల్‌ పెన్షన్‌ యోజన మనం వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడకుండా నెలనెలా పెన్షన్‌ అందుకునేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం.

జూన్‌ 1, 2015న ప్రారంభమైన ఈ పథకం పరిధిలో పాలసీ తీసుకుంటే 60 ఏళ్ల వయస్సు వచ్చాక నెలనెలా రూ. 1000 నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్‌ పొందవచ్చు.

అయితే ఈ పథకంలో చేరాలంటే బ్యాంకు ఖాతా ఉండాలి. అలాగే 18 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరవచ్చు. ఇంతకుముందు ఎన్‌పీఎస్‌ లైట్‌ పథకంలో ఉన్న పాలసీదారులు కూడా ఈ అటల్‌ పెన్షన్‌ యోజనలో చేరవచ్చు.

అటల్‌ పెన్షన్‌ యోజన పథకంలో ఎలా చేరాలి?

బ్యాంకులో అధికారిని, లేదా బ్యాంకు మిత్రను కలిసి అటల్‌ పెన్షన్‌ యోజన దరఖాస్తు ఫారం ఇవ్వాలని కోరి, అందులో మీ అన్ని వివరాలు నమోదు చేయాలి. మొబైల్‌ నెంబర్, ఆధార్‌ నంబరుతో సహా అన్ని వివరాలు నింపాలి.

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా కూడా అటల్‌ పెన్షన్‌ యోజనలో చేరవచ్చు. ఇందుకు ఈఎన్‌పీఎస్‌ వెబ్‌సైట్‌లో వివరాలు సమర్పించాలి.

ఈ పథకంలో నెలనెలా పెన్షన్‌ వచ్చేందుకు మీ తరపున చందా ఎంత చెల్లించాలో సంబంధిత కిస్తీని బ్యాంకు నిర్ధారిస్తుంది. మీరు మీ చందా నెలవారీగా గానీ, మూడు నెలలకొకసారి గానీ, ఆరు నెలలకోసారి గానీ చెల్లించవచ్చు.

అలాగే మీ సేవింగ్స్‌ ఖాతా నుంచి ఈ చందా తీసుకునే అధికారాన్ని బ్యాంకుకు ఇవ్వాలి. ఒకవేళ సమయానికి మీ పొదుపు ఖాతాలో నగదు లేనట్లయితే ఆ తరువాత అపరాధ రుసుము కూడా చెల్లించాల్సి వస్తుంది.

ఖాతాలో చందా వసూలు చేయడానికి బ్యాంకు మనకు 24 నెలల టైమ్‌ ఇస్తుంది. గడువు ముగిసేలోపు ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేయలేకపోయినట్లయితే ఖాతాను బ్యాంకు మూసివేస్తుంది.

ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఫారంలో తప్పనిసరిగా నామినీ పేరును ప్రతిపాదించాలి. పాలసీదారుడు మరణిస్తే పెన్షన్‌ను జీవితభాగస్వామికి ఇస్తారు. ఇద్దరూ లేకపోయినట్లయితే పెన్షన్‌ నిధిని నామినీకి ఇస్తారు.

పెన్షన్‌ ఇలా వస్తుంది..

60 ఏళ్ల నుంచి మీరు నెలనెలా పెన్షన్‌ అందుకుంటారు. మీ మరణం తరువాత మీ జీవిత భాగస్వామి ప్రతి నెలా పెన్షన్‌ పొందుతారు. మీ జీవిత భాగస్వామి తరువాత మీ నామినీ రూ. 1,70,000ల నుంచి రూ. 8,50,000ల వరకు పొందుతారు.

– నెలవారీ చెల్లించవలసిన సొమ్ము లబ్దిదారుని వయస్సు, ఎంచుకున్న పెన్షన్‌ సొమ్ముపై ఆధారపడి ఉంటుంది.

– ఉదాహరణకు మీ వయస్సు 25 ఏళ్లనుకుంటే మీరు 35 ఏళ్ల పాటు ఈ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. మీకు వెయ్యి రూపాయల మేర పెన్షన్‌ రావాలనుకుంటే మీరు నెలనెలా రూ.  76 మీ కాంట్రిబ్యూషన్‌గా చెల్లించాలి.

– రూ.  2 వేలు రావాలనుకుంటే నెలకు రూ. 151, రూ.  3 వేలు రావాలనుకుంటే నెలకు రూ. 226, రూ. 4 వేలు పెన్షన్‌గా రావాలనుకుంటే రూ.  301, రూ.  5 వేలు పెన్షన్‌గా రావాలనుకుంటే నెలకు రూ.  376 కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది.

– కంట్రిబ్యూషన్‌ సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి ఆటో డెబిట్‌ రూపంలో కట్‌ అవుతుంది.

– మీ పెన్షన్‌ మొత్తాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

– APY And NPS Lite అని గూగుల్‌ ప్లే స్టోర్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా ఏపీవై యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం