తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Jodo Nyay Yatra: ‘మీ మన్ కీ బాత్ వినడానికే ఈ యాత్ర’; భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ

Bharat Jodo Nyay Yatra: ‘మీ మన్ కీ బాత్ వినడానికే ఈ యాత్ర’; భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ

HT Telugu Desk HT Telugu

14 January 2024, 18:48 IST

  • Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమైంది. మణిపూర్ లో ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ఈ యాత్ర ప్రారంభించారు. 

భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించడానికి ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ
భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించడానికి ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ

భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించడానికి ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ

Bharat Jodo Nyay Yatra: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ రెండో విడత యాత్రను ప్రారంభించారు. ముందే ప్రకటించిన విధంగా మణిపూర్ లోని తౌబాల్ జిల్లాలోని ఖోంగ్జోమ్ నుంచి జనవరి 14వ తేదీన భారత్ జోడో న్యాయ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

మణిపూర్ నుంచి..

దాదాపు గత సంవత్సర కాలంగా జాతుల మధ్య విద్వేష పూరిత హింసాత్మక ఘటనలతో అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ యాత్ర ప్రారంభించారు. బీజేపీ, ఆరెస్సెస్ వ్యాప్తి చేస్తున్న విద్వేష, భావజాల రాజకీయాలకు మణిపూర్ (Manipur) ఒక ఉదాహరణ అని, రాష్ట్రంలో సామరస్యం, శాంతిని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

12 నెలల తరువాత..

విజయవంతంగా సాగిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగిసిన 12 నెలల విరామం తర్వాత కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టింది. పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి చార్టర్డ్ విమానంలో రాహుల్ గాంధీ ఇంఫాల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా 1891 ఆంగ్లో-మణిపూర్ యుద్ధంలో మరణించిన వీరులకు ఖోంగ్జోమ్ వార్ మెమోరియల్ వద్ద కాంగ్రెస్ నేతలు పుష్పాంజలి ఘటించారు. భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) సుమారు 6,700 కిలోమీటర్లు, 15 రాష్ట్రాల గుండా ప్రయాణించి మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.

మణిపూర్ అల్లర్లు..

భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీ ఖోంగ్జోమ్లోని ఓ ప్రైవేటు మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తాను గత ఏడాది జూన్ 29న మణిపూర్ కు వచ్చానని, అప్పుడు తాను చూసినవి, విన్నవి ఎప్పుడూ వినలేదని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘నేను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఒక రాష్ట్రంలో పాలనా పతనాన్ని చూడటం అదే మొదటిసారి. మణిపూర్ ఇప్పుడు ప్రతి మూలలోనూ విద్వేషం వ్యాపించడంతో చీలిపోయింది’' అని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ప్రధానిపై విమర్శలు

మణిపూర్ అల్లర్లలో కుటుంబ సభ్యుల ముందే తమ వారిని హత్య చేశారన్నారు. ‘‘కానీ మీ కన్నీళ్లు తుడిచేందుకు, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికి ప్రధాని మోదీ మణిపూర్ కు రాలేదు. బహుశా ఆయన దృష్టిలో మణిపూర్ భారత్ లో భాగం కాదేమో. మీ బాధ తనది కాదేమో’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యాప్తి చేస్తున్న విద్వేష, భావజాల రాజకీయాలకు మణిపూర్ ఒక ఉదాహరణ అని రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ లో సామరస్యాన్ని, శాంతిని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

మీ మన్ కీ బాత్ వినడానికే..

దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాలను ఎత్తిచూపేందుకే ఈ యాత్రకు 'న్యాయ్' (న్యాయం) అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినడమే ఈ పర్యటన ఉద్దేశమని ఆయన చెప్పారు. 'మా 'మన్ కీ బాత్' గురించి మీకు చెప్పదలచుకోలేదు. మీ 'మన్ కీ బాత్ (Mann ki bath)' గురించి వినడానికే ఈ యాత్ర చేపట్టాము. మేము మీ బాధ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సౌభ్రాతృత్వం, సామరస్యం అనే దార్శనికతను పంచుకోవాలని కోరుకుంటున్నాం' అని రాహుల్ గాంధీ అన్నారు.

ఖర్గే సమక్షంలో..

ఈ భారత్ న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ తో సహా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ‘‘మాది సుదీర్ఘ ప్రయాణం. ఇలాంటి యాత్ర గతంలో ఎప్పుడూ జరగలేదని, భవిష్యత్తులో జరగబోదని అనుకుంటున్నాను. ఓట్లు అడిగేందుకు మాత్రం మోదీ మణిపూర్ కు వస్తారని, కానీ రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన బీచ్ లలో విహారయాత్రలు చేస్తూ రాముడి పేరుతో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నారు’’ అని ఖర్గే విమర్శించారు. రాహుల్ గాంధీ గత ఏడాది జూన్ లో మణిపూర్ లో రెండు రోజుల పాటు పర్యటించారు.

తదుపరి వ్యాసం