తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Mass Shooting: అమెరికాలో కాల్పుల మోత; 22 మంది మృత్యువాత

US mass shooting: అమెరికాలో కాల్పుల మోత; 22 మంది మృత్యువాత

HT Telugu Desk HT Telugu

26 October 2023, 10:27 IST

  • US mass shooting: అమెరికాలో మరోసారి మాస్ షూటింగ్ (US mass shooting) ఘటన చోటు చేసుకుంది. మెనే రాష్ట్రంలోని లీవిస్టన్ నగరంలో రెండు చోట్ల ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 22 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు.

అమెరికాలో కాల్పులకు పాల్పడిన రాబర్ట్ కార్డ్ (వీడియో గ్రాబ్)
అమెరికాలో కాల్పులకు పాల్పడిన రాబర్ట్ కార్డ్ (వీడియో గ్రాబ్) (Reuters)

అమెరికాలో కాల్పులకు పాల్పడిన రాబర్ట్ కార్డ్ (వీడియో గ్రాబ్)

US mass shooting: అమెరికాలోని లీవిస్టన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విచక్షణారహితంగా ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని 40 ఏళ్ల వయస్సున్న రాబర్ట్ కార్డ్ (Robert Card) గా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం పారిపోయిన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కారణం తెలియలేదు..

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రం మెనేలో ఈ లీవిస్టన్ నగరం ఉంది. ఈ నగరంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్ లో ఉన్న బౌలింగ్ అలీలో రాబర్ట్ కార్ట్ ఈ కాల్పులకు (US mass shooting) తెగబడ్డారు. అనంతరం, పక్కనే ఉన్న వాల్ మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. రాబర్ట్ కార్డ్ ఈ కాల్పులు జరపడానికి కారణం తెలియరాలేదు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, రాబర్ట్ కార్డ్ (Robert Card) తో ప్రమాదం పొంచి ఉందని, అతడి వద్ద ఆయుధం ఉందని, అందువల్ల పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు సూచించారు. వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేసి, షట్టర్స్ క్లోజ్ చేసుకోవాలని సూచించారు. ఆ కాల్పులకు పాల్పడిన రాబర్ట్ కార్డ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతడి వద్ద సెమీ ఆటోమేటిక్ గన్ ఉన్నట్లు తెలిపారు.

అధ్యక్షుడి స్పందన

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మెనే రాష్ట్ర గవర్నర్ జానెట్ మిల్స్ తో, ఇద్దరు సెనేటర్లతో మాట్లాడారు. ఫెడరల్ నుంచి అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. గత సంవత్సరం మే 22 న కూడా అమెరికాలో మాస్ షూటింగ్ (US mass shooting) ఘటన చోటు చేసుకుంది. అప్పుడు టెక్సస్ లోని ఉవాల్డేలో ఉన్న ఒక ఎలమెంటరీ పాఠశాలలో ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 19 మంది ప్రాణాలు తీశాడు. కొరోనా అనంతరం అమెరికాలో మాస్ షూటింగ్ ఘటనలు పెరిగాయి.

తదుపరి వ్యాసం