తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Extramarital Affair: వివాహేతర సంబంధం నిషేధం.. పార్లమెంటు ఆమోదం

Extramarital affair: వివాహేతర సంబంధం నిషేధం.. పార్లమెంటు ఆమోదం

HT Telugu Desk HT Telugu

06 December 2022, 17:14 IST

    • వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ ఇండోనేషియా పార్లమెంటు కొత్త చట్టానికి ఆమోద ముద్ర వేసింది.
వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు తెచ్చిన చట్టానికి నిరసనగా పౌరుల ప్రదర్శన
వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు తెచ్చిన చట్టానికి నిరసనగా పౌరుల ప్రదర్శన (AP)

వివాహేతర లైంగిక సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు తెచ్చిన చట్టానికి నిరసనగా పౌరుల ప్రదర్శన

జకార్తా: వివాహేతర లైంగిక సంబంధాలను, గర్భ నిరోధకాలను ప్రోత్సహించడాన్ని నిషేధిస్తూ తెచ్చిన బిల్లును ఇండోనేషియా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు మంగళవారం మోక్షం లభించింది. అలాగే అధ్యక్షుడు, ప్రభుత్వ సంస్థలకు పరువు నష్టం కలిగించడాన్ని కూడా నిషేధించింది.

సవరించిన బిల్లు దైవదూషణ చట్టాన్ని కూడా నిర్వచిస్తుంది. ఇండోనేషియాలో గుర్తింపు పొందిన ఆరు మతాల విశ్వాసాలకు భంగం వాటిల్లితే ఐదేళ్ల శిక్ష పడుతుంది. పౌరులు మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతాలతో ముడివడి ఉన్న సంస్థలతో పనిచేస్తే 10 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కమ్యూనిజం వ్యాపింపజేస్తే 4 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

ఇంతకుముందు ఉన్న కోడ్ ప్రకారం అబార్షన్‌ను నేరంగా పరిగణించేవారు. అయితే మహిళ జీవితానికి ముప్పు ఉన్న అనారోగ్య పరిస్థితి ఉంటే వారిని, అలాగే అత్యాచారానికి గురైన వారిని దీని నుంచి మినహాయించారు. అలాగే పిండం 12 వారాల వయస్సులోపు ఉండాలని షరతు విధించారు.

అయితే హక్కుల సంఘాలు ఈ సవరణలను తీవ్రంగా తప్పుపట్టాయి. సాధారణ చర్యలను, భావ ప్రకటనా స్వేచ్ఛను, గోప్యతా హక్కులను ఇది కాలరాస్తోందని విమర్శించాయి.

అయితే ఈ సవరించిన కోడ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ విజయమని కొందరు న్యాయవాదులు అభివర్ణించారు. గే సెక్స్ అక్రమమంటూ ఇస్లామిక్ గ్రూపులు ప్రతిపాదించిన నిబంధనను తొలగించడానికి చట్టసభ అంగీకరించిన మీదట న్యాయవాదులు దీనిని ఎల్జీబీటీక్యూ విజయంగా అభివర్ణించారు.

సవరించిన కోడ్ ప్రకారం వివాహేతర లైంగిక సంబంధం శిక్షార్హమైనది. దీనికి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అలాగే సహజీవనానికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. లైంగిక సంబంధాలు పోలీసు నివేదికల ప్రాతిపదికగా ఉండాలి. ఫిర్యాదు భాగస్వామి గానీ, పిల్లలు గానీ చేయొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం