తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు భగ్గు.. పోయిన క్వార్టర్‌లో 9 శాతం పెరుగుదల

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు భగ్గు.. పోయిన క్వార్టర్‌లో 9 శాతం పెరుగుదల

HT Telugu Desk HT Telugu

24 May 2022, 15:31 IST

    •  జనవరి నుంచి మార్చి వరకు ఉన్న నాలుగో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 8 నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కూడా భగ్గుమన్నాయి. ముంబై తరువాత హైదరాబాద్‌లోనే చదరపు అడుగు ధర ఎక్కువగా ఉండడం గమనార్హం.
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు (HT_PRINT)

హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు

న్యూఢిల్లీ, మే 24: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హౌజింగ్ ధరలు 11 శాతం వరకు పెరిగాయని క్రెడాయ్, కొలియర్స్ అండ్ లియాసెస్ ఫోరాస్ సంయుక్తంగా ఇచ్చిన అధ్యయన నివేదికలో వెల్లడైంది. అంతకుముందు ఏడాదిలో ఇదే కాలంతో (జనవరి-మార్చి త్రైమాసికం)తో పోల్చితే ఈ పెరుగుదల నమోదైందని తెలిపింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌ కోసం పెరుగుతున్న డిమాండ్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెరుగుల వంటి అంశాలు ఇందుకు కారణమని తేల్చింది.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

హైదరాబాద్‌లో హౌజింగ్ ధరలు భగ్గుమన్నాయని, సుమారు 9 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ. 9,232 వరకూ పెరిగిందని చెప్పింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుదల 11 శాతమే ఉన్నప్పటికీ అక్కడ చదరపు అడుగు ధర రూ. 7,363 మాత్రమే ఉందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లియాసెస్ ఫోరాస్ ఉమ్మడి నివేదికలో తేలింది.

బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ (ఎంఎంఆర్) ప్రాంతాల్లో కేవలం 1 శాతం మాత్రమే పెరిగాయని వివరించింది. అక్కడ చదరపు అడుగుకు వరుసగా రూ. 7595, రూ. 7,107, రూ. 19.557గా ఉన్నాయని నివేదించింది.

పూణెలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ధరలు 3 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 7,485గా ఉన్నాయని వివరించింది.

‘హౌజింగ్ డిమాండ్ ఊపందుకోవడం, ముడి సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతుండడం ఇళ్ల ధరల పెరుగుదలకు కారణమైంది. ఇళ్ల ధరల విషయంలో కోవిడ్ కంటే ముందున్న స్థాయిని 8 మెట్రో నగరాలు దాటేశాయి..’ అని ఉమ్మడి నివేదిక వెల్లడించింది.

దేశంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ విలువ సగటున 4 శాతం పెరిగింది. రెసిడెన్షియల్ మార్కెట్ పుంజుకుందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

రానున్న 6 నుంచి 9 నెలల్లో ఇళ్ల ధరలు మరో 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని కొలియర్స్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ అన్నారు.

‘దేశంలో రెసిడెన్షియల్ మార్కెట్ అత్యుత్తమ పనితీరు కనబరచడం ఉత్తేజాన్ని ఇస్తోంది. చాలా ఏళ్ల తరువాత ఈ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకుంది. వినియోగదారులకు మార్కెట్‌పై విశ్వాసం ఉంది. విశ్వసనీయమైన డెవలపర్లు ఎక్కువ సేల్స్ చేస్తారని అంచనా వేస్తున్నాం. డెవలపర్ల విశ్వసనీయతను ముఖ్యమైన అంశంగా వినియోగదారులు చూస్తున్నారు..’ అని అన్నారు.

లియాసెస్ ఫోరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ ‘2022 జనవరి-మార్చి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కోవిడ్-పూర్వ స్థాయికి చేరుకున్నాయి. రాబోయే త్రైమాసికాల్లో కొత్త ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ప్రాజెక్టులు పెరుగుతుండడంతో అమ్మకాల పరిమాణం కూడా పెరుగుతుంది. అందువల్ల ఇటీవల వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి..’ అని అన్నారు.

క్రెడాయ్ ప్రెసిడెంట్ హర్ష్‌వర్ధన్ పటోడియా మాట్లాడుతూ ‘ధరల పెంపు కొనసాగుతున్న సమస్య. అయితే ముడిసరుకు ధరల పెరుగుదలను నియంత్రించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్థిక మంత్రి, ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సంతోషం. గత 18 నెలలుగా ముడిసరుకు ధర పెరుగుతున్నాయి..’ అని అన్నారు.

ఉక్కు ఉత్పత్తులు, ఇనుప ఖనిజం, ఉక్కు ఇంటర్మీడియరీలపై దిగుమతి సుంకాలను తగ్గించే చర్యలు ఉక్కు ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో సహాయపడతాయని, ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గడానికి దారితీస్తుందని ఆయన తెలిపారు.

బొగ్గు ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీలను తగ్గించడం వల్ల సిమెంట్ ఉత్పత్తికి మరింత సాయపడుతుందని, ఆకాశాన్నంటుతున్న సిమెంట్ ధరలను నియంత్రించడంలో సహాయపడుతుందని పటోడియా చెప్పారు.

‘ప్రస్తుత పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడం, ఈ రంగంలో ఆర్థిక పురోగతికి సహాయం చేయడం చాలా ముఖ్యం. ఇంధన పన్ను ధరలను కోవిడ్-పూర్వ స్థాయిలకు తగ్గించడం వలన అన్ని రంగాలకు మేలు చేస్తుంది. అంతిమంగా వినియోగదారుడికి మేలు చేస్తుంది..’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ చెప్పారు.

ఇంధనంపై సుంకాలను తగ్గించాలని పటోడియా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తయారీదారులు ధరల తగ్గింపును తుది వినియోగదారులకు అందజేయాలని క్రెడాయ్ హృదయపూర్వకంగా భావిస్తోందని అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం