తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women's Reservation Bill: ‘నాకు దేవుడిచ్చిన అవకాశం ఇది’- ప్రధాని మోదీ; ‘నారి శక్తి వందన్ అధినియం’గా నామకరణం

Women's Reservation Bill: ‘నాకు దేవుడిచ్చిన అవకాశం ఇది’- ప్రధాని మోదీ; ‘నారి శక్తి వందన్ అధినియం’గా నామకరణం

HT Telugu Desk HT Telugu

19 September 2023, 14:47 IST

  • Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిర్ణయం తీసుకునే అవకాశం లభించడం తనకు దేవుడిచ్చిన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ‘నారి శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam)గా ఈ బిల్లుకు నామకరణం చేశారు.

లోక్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
లోక్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ (PTI)

లోక్ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

Women's Reservation Bill: సెప్టెంబర్ 19, మధ్యాహ్నం 3 గంటలకు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం సోమవారం లభించింది. ‘నారి శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam)గా ఈ బిల్లుకు నామకరణం చేశారు.

నారి శక్తి వందన్ అధినియం

ఈ బిల్లు ప్రకారం.. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ లభించనుంది. కొత్త పార్లమెంటు భవనంలో ఈ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లభించడం తనకు దేవుడిచ్చిన అదృష్టమని భావిస్తున్నానన్నారు. మహిళా శక్తికి ద్వారాలు తెరిచే అవకాశం ఈ కొత్త భవనంలో లభించిందన్నారు. మహిళల నాయకత్వంలో అభివృద్ధి జరగాలనే తమ భావనకు తొలి అడుగుగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తున్నామన్నారు. ఈ బిల్లు ద్వారా లోక్ సభ, రాజ్యసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. ‘నారి శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam)గా ఈ బిల్లుకు నామకరణం చేశారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందన్నారు.

గతంలో కూడా..

మహిళా రిజర్వేషన్ బిల్లుకు చాలా చరిత్ర ఉంది. గతంలో చివరి వరకు వచ్చి, పార్టీల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా, ఈ బిల్లు ఆమోదం పొందలేకపోయింది. వాజ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా పలు మార్లు మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందేంత మెజారిటీ లేకపోయిన కారణంగా, మహిళా రిజర్వేషన్ బిల్లుకు నాడు మోక్షం లభించలేదన్నారు. ‘ఈ రోజు ఈ బిల్లును ముందుకు తీసుకువెళ్లే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు’ అన్నారు. ఈ 128వ రాజ్యాంగ సవరణ ‘నారి శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు చట్ట రూపం దాలిస్తే, లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు 33% కచ్చితమైన ప్రాతినిధ్యం లభిస్తుంది.

తదుపరి వ్యాసం