తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Tweet | `ఇది మోసం కాదు.. మ‌హా మోసం`

Rahul Gandhi tweet | `ఇది మోసం కాదు.. మ‌హా మోసం`

HT Telugu Desk HT Telugu

14 June 2022, 21:02 IST

  • ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 10 ల‌క్ష‌ల ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ఉద్యోగాల పేరుతో ప్ర‌ధాని మోదీ చేస్తున్న మోసాల్లో ఇది మ‌హా మోస‌మ‌ని వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

వ‌చ్చే 18 నెల‌ల్లో 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని మిష‌న్‌మోడ్‌లో ముగించాల‌ని ప్ర‌ధాని మోదీ మంగ‌ళ‌వారం అన్ని విభాగాల‌ను ఆదేశించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స‌టైరిక‌ల్‌గా స్పందించారు. ఉద్యోగాల క‌ల్ప‌న పేరుతో ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ చాలా హామీలు ఇచ్చార‌ని, కానీ వేటినీ అమ‌లు చేయ‌లేద‌ని గుర్తు చేస్తూ.. ఇది అలాంటి హామీయేన‌ని ఎద్దేవా చేశారు.

ఇది మ‌హా జుమ్లా..

`నేష‌న‌ల్ హెరాల్డ్‌` మ‌నీ లాండ‌రింగ్ కేసులో రెండు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ రాహుల్ గాంధీని ప్ర‌శ్నిస్తోంది. ఈ విచార‌ణ మ‌ధ్య‌లో, మంగ‌ళ‌వారంలంచ్ బ్రేక్ స‌మ‌యంలో ప్ర‌ధాని ఉద్యోగ హామీపై రాహుల్ గాంధీ ట్విట‌ర్‌లో స్పందించారు. `గ‌త 8 ఏళ్ల క్రితం, ప్ర‌తీ ఏడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చి యువ‌త‌ను మ‌భ్య‌పెట్టారు. ఆ హామీని అలాగే మ‌ర్చిపోయారు. ఇప్ప‌డు కూడా అలాగే, 18 నెల‌ల్లో 10 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ని హామీ ఇస్తున్నారు. గ‌తంలో ఇచ్చిన హామీలు మోస‌మైతే.. ఇది మ‌హా మోసం. ఈ ప్ర‌భుత్వం త‌ప్పుడు, అస‌త్య హామీల ప్ర‌భుత్వం. ఇది మోసాల ప్ర‌భుత్వం కాదు.. మ‌హా మోసాల ప్ర‌భుత్వం. ప్ర‌ధాన మంత్రి ఉద్యోగ క‌ల్ప‌న చేయ‌డంలో నిపుణుడు కాదు. ఉద్యోగాల పేరుతో వార్త‌లు సృష్టించ‌డంలో నిపుణుడు` అని రాహుల్ గాంధీ వ్యంగ్య విమ‌ర్శ‌ల‌తో ట్వీట్ చేశారు. ఈడీ

ప్ర‌ధాని రివ్యూ..

`అన్ని మంత్రిత్వ శాఖ‌ల్లోని మాన‌వ వ‌న‌రులపై ప్ర‌ధాని మోదీ మంగ‌ళ‌వారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఆ త‌రువాత మిష‌న్ మోడ్‌లో ఉద్యోగుల రిక్రూట్ మెంట్ ప్రారంభించాల‌ని ఆయా శాఖ‌ల‌కు ఆదేశించారు. రానున్న సంవ‌త్సరన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ఉద్యోగుల‌ను నియ‌మించాల‌ని ఆదేశించారు` అని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం వెల్ల‌డించింది.

అగ్నిప‌థ్ ప‌థ‌కం

ప్ర‌ధాని ఆదేశాల మేర‌కు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉద్యోగ క‌ల్ప‌న కార్య‌క్ర‌మం ప్రారంభించింది. మ‌రోవైపు, ప‌దిహేడున్న‌ర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సున్న 45 వేల మందిని సాయుధ ద‌ళాల్లోకి తీసుకునే `అగ్నిప‌థ్‌` ప‌థ‌కాన్ని ర‌క్ష‌ణ శాఖ ప్రారంభించింది. మ‌రో మూడు నెల‌ల్లో ఈ రిక్రూట్‌మెంట్ ప్రారంభ‌మ‌వుతుంది. శిక్ష‌ణ అనంత‌రం ఫ‌స్ట్ బ్యాచ్ జులై 2023 నాటికి సిద్ధ‌మ‌వుతుంది.

తదుపరి వ్యాసం