తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /   Jammu And Kashmir : విద్వేష ప్రసంగాలతో ఉద్రిక్తత.. జమ్ముకశ్మీర్​లో కర్ఫ్యూ

Jammu and Kashmir : విద్వేష ప్రసంగాలతో ఉద్రిక్తత.. జమ్ముకశ్మీర్​లో కర్ఫ్యూ

HT Telugu Desk HT Telugu

10 June 2022, 6:26 IST

  • Jammu and Kashmir curfew : జమ్ముకశ్మీర్​ దోడా జిల్లాలోని భదేర్వ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మసీదులో నుంచి విద్వేష ప్రసంగాలు వెలువడటం ఇందుకు కారణం.

జమ్ముకశ్మీర్​ భదేర్వలో కర్ఫ్యూ.. రంగంలోకి సైన్యం
జమ్ముకశ్మీర్​ భదేర్వలో కర్ఫ్యూ.. రంగంలోకి సైన్యం (HT_PRINT/file)

జమ్ముకశ్మీర్​ భదేర్వలో కర్ఫ్యూ.. రంగంలోకి సైన్యం

Jammu and Kashmir curfew : మసీదు నుంచి విద్వేష ప్రసంగాలు వెలువడటంతో జమ్ముకశ్మీర్​ దోడా జిల్లాలోని భదేర్వ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితులను శాంతింపజేసేందుకు స్థానిక అధికారులు.. సైనికులను రంగంలోకి దింపారు. వారి చేత గురువారం సాయంత్రం ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు.

విద్వేష ప్రసంగాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

"మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. కర్ఫ్యూ విధించాము. సంబంధిత ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు భద్రతను ఏర్పాటు చేశాము," అని ఓ అధికారి వివరించారు.

అధికారుల ప్రకారం.. మహమ్మద్​ ప్రవక్తపై.. ప్రస్తుతం సస్పెన్షన్​లో ఉన్న బీజేపీ ప్రతినిధి నుపుర్​ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మసీదులో ఓ కార్యక్రమం జరిగింది. అక్కడే.. విద్వేష ప్రసంగాలు బయటకొచ్చాయి. విద్వేష ప్రసంగాలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

"విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాము. ఐపీసీ సెక్షన్​ 295-ఏ, 506 కింద భదేర్వ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు," అని ఓ అధికారి వెల్లడించారు.

నూపూర్​ శర్మ వ్యాఖ్యలతో..

Nupur Sharma BJP : గత శుక్రావారం.. ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీదులో శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాగా.. దేశంలో మతపరమైన ఘర్షణలు ఇటీవల ఆందోళనకర రీతిలో పెరిగిపోయాయి. ఇండియాలో పరిస్థితులు, మైనారటీల సమస్యలపై ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఈ సమయంలోనే.. బీజేపీకి చెందిన నేత ముస్లింలపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. గత ఆదివారం ఓ టీవీ డిబేట్​లో పాల్గొన్న బీజేపీ నేత నూపూర్​ శర్మ.. మహమ్మద్​ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఉన్నాయి.

నూపూర్​ శర్మ వ్యాఖ్యలపై నిరసనలు భగ్గుమన్నాయి. దేశంలోని విపక్షాలతో పాటు గల్ఫ్​ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేసి.. బీజేపీ నేతల వ్యవహారాన్ని తప్పుబట్టాయి. నూపూర్​ శర్మ వ్యాఖ్యలు.. కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించిన సౌదీ అరేబియా.. అన్ని మతాలను, నమ్మకాలను గౌరవించాలని హితవు పలికింది. ఖతార్​, కువైట్​, ఇరాన్​ దేశాలు.. భారత రాయబారులకు సమన్లు జారీ చేసి.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించాయి. అంతేకాకుండా.. గల్ఫ్​ దేశాల్లో భారత వస్తువులపై నిషేధం విధించాలని డిమాండ్లు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.

తదుపరి వ్యాసం