తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas Santa Claus: క్రిస్మస్ తాత ఎవరో తెలుసా? జింగిల్ బెల్స్ పాట క్రిస్మస్ పాట కాదా?

Christmas santa claus: క్రిస్మస్ తాత ఎవరో తెలుసా? జింగిల్ బెల్స్ పాట క్రిస్మస్ పాట కాదా?

Gunti Soundarya HT Telugu

14 December 2023, 9:00 IST

  • Santa claus: క్రిస్మస్ అనగానే క్రిస్మస్ తాత తమకి ఇష్టమైన బహుమతులు ఇస్తాడని చాలా మంది పిల్లలు నమ్ముతారు. అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరో తెలుసా?

క్రిస్మస్ తాత
క్రిస్మస్ తాత (pixabay)

క్రిస్మస్ తాత

Santa claus: క్రిస్మస్ పండుగ వస్తుంది అనగానే పిల్లలందరూ భలే సంతోషిస్తారు. అందుకు కారణం క్రిస్మస్ తాత. అర్థరాత్రి క్రిస్మస్ తాత తమకి ఇవ్వడానికి బహుమతులు తీసుకొస్తారని ఎంతగానో ఎదురుచూస్తారు. తమ పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని నచ్చిన బహుమతి తల్లిదండ్రులే వారికి ఇచ్చి క్రిస్మస్ తాత ఇచ్చాడని చెప్తారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళే శాంతా క్లాజ్ మాదిరిగా డ్రెస్ వేసుకుని తమ పిల్లలకు బహుమతులు ఇస్తారు. అవి తీసుకుని పిల్లలు చాలా సంబరపడిపోతారు.

క్రిస్మస్ తాత రూపం కూడా చాలా ముద్దుగా ఉంటుంది. తెల్లటి గడ్డం, పెద్ద పొట్ట, ఎరుపు.. తెలుపు కలగలిపి ఉన్న దుస్తులు ధరించి చేతిలో కర్ర పట్టుకుని ఉంటాడు. క్రిస్మస్ చెట్ల అలంకరణలో క్రిస్మస్ తాత చేతిలో ఉన్న కర్ర లాంటిది కూడా డెకరేట్ చేస్తారు. ఇంతకీ అసలు ఎవరు ఈ క్రిస్మస్ తాత. పిల్లలందరికీ ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం.

క్రిస్మస్ తాత ఇలా పుట్టాడు

శాంతా క్లాజ్ గా కనిపించిన వ్యక్తి ఓ బిషప్. ఆయన పేరు సెయింట్ నికోలస్. ఆయన క్రీ. శ. 280 వ సంవత్సరానికి చెందినవారు. తండ్రి నుంచి వచ్చిన ఆస్తి పేదవారికి, అవసరంలో ఉన్న వారికి దానం చేసేవారు నికోలస్. క్రిస్మస్ వేళ నిరుపేదల ఇంటికి వెళ్ళి బహుమతులు ఇస్తూ ఉండేవారు. ఒకనాడు ఓ పేద తండ్రి తన ముగ్గురు కూతుళ్లకి పెళ్లి చేయలేక వారిని ఇబ్బందులు పడుతున్నాడని నికోలస్ కి తెలుస్తుంది. వారి ఇంటికి అర్థరాత్రి వెళ్ళి బంగారు నాణేలు ఉన్న మూడు సంచులని ఆ పేద వ్యక్తి ఇంట్లోకి విసిరాడు.

నికోలస్ చేస్తున్న పని గురించి అందరికీ తెలిసింది. అమెరికా, యూరప్ దేశాలలో నికోలస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ధనికులు కూడా పేదవారికి క్రిస్మస్ రోజు బహుమతులు ఇవ్వడం చేశారు. క్రిస్మస్ రోజు తమకి కూడా శాంతా క్లాజ్ బహుమతులు ఇస్తాడని పిల్లలు నమ్మడం మొదలుపెట్టారు. నికోలస్ ఆ విధంగా శాంతా క్లాజ్ గా మారిపోయారు.

19 వ శతాబ్దం నుంచి క్రిస్మస్ నాడు బహుమతులు ఇవ్వడం ఆచారంగా మారిపోయింది. షాపింగ్ మాల్స్, స్టోర్స్ లో కొంతమంది శాంతా క్లాజ్ మాదిరిగా డ్రెస్ చేసుకుని పిల్లల్ని ఆనందపరుస్తున్నారు.

శాంతా క్లాజ్ రూపం ఎలా ఉంటుంది?

1822 లో క్లేమెంట్ క్లార్క్ మూర్ అనే కవి యాన్ అకౌంట్ ఆఫ్ ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ అనే కవిత రాశారు. ఇది ఇట్ వాజ్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. 8 రెయిన్ డీర్లు లాగుతున్న స్లే మీద ఎక్కి కూర్చుని ఒక ఇంటి మీద నుంచి మరొక ఇంటి మీదకు ఎగురుతూ పిల్లలకు బహుమతులు ఇస్తాడని చెప్తూ ఆ పోయేమ్ వర్ణించింది. 1881లో ఓ కార్టూనిస్ట్ గీసిన కార్టూన్ శాంతా క్లాజ్ రూపంగా బాగా పాపులర్ అయ్యింది.

జింగిల్ బెల్స్ పాట క్రిస్మస్ పాట కాదా?

క్రిస్మస్ పాటల్లో జింగిల్ బెల్స్ పాట బాగా ప్రాచుర్యం పొందింది.ఈ పాట వస్తున్నప్పుడు శాంతా క్లాజ్ అందరికీ బహుమతులు ఇచ్చినట్టు అనేక వీడియోలు చూసే ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది గాంచిన ఈ పాట నిజానికి క్రిస్మస్ పాట కాదు. ఈ పాటని జేమ్స్ లార్డ్ బెల్ రచించారు. థాంక్స్ గివింగ్ డే కోసం ఈ పాట రాశారు. కానీ ఇది క్రిస్మస్ పాటగా బాగా ఫేమస్ అయ్యింది.

తదుపరి వ్యాసం