తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hypothyroidism Symptoms : ఆహారంలో అయొడిన్ లోపిస్తే హైపోథైరాయిడ్.. చికిత్స ఎలా?

Hypothyroidism Symptoms : ఆహారంలో అయొడిన్ లోపిస్తే హైపోథైరాయిడ్.. చికిత్స ఎలా?

Anand Sai HT Telugu

13 January 2024, 19:00 IST

    • Hypothyroidism Symptoms In Telugu : హైపోథైరాయిడ్‌తో అనేక సమస్యలు వస్తాయి. దీని నుంచి బయటపడేందుకు వైద్యులు చెప్పిన సూచనలను పాటించాలి.
హైపోథైరాయిడ్ సమస్యలు
హైపోథైరాయిడ్ సమస్యలు (Unsplash)

హైపోథైరాయిడ్ సమస్యలు

శరీరానికి అవసరమైన మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ అందుబాటులో లేని స్థితిని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్ ప్రధాన బాధ్యత జీవ క్రియలను నియంత్రించటం. అది తగినంతగా అందుబాటులో లేకపోవటం సహజంగానే మొత్తం శరీరం పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మనదేశంలో దాదాపు పదిహేను కోట్ల మందిలో హైపోథైరాయిడిజం ఉన్నట్లు అంచనా. వీరిలో అత్యధికులకు తమకు ఈ వ్యాధి ఉన్న విషయం కూడా తెలియదు. సముద్రతీర ప్రాంతాల(విశాఖ, చెన్నై, మంగుళూరు వంటివి)లో నివసిస్తున్న వారికంటే సాగరాలకు దూరంగా మైదాన, కొండ ప్రాంతాల(హైదరాబాద్, వరంగల్,బెంగళూరు లాంటి) లో నివసిస్తున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడించింది. సాధారణంగా ప్రచారంలో ఉన్న దానికంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు దీనితో బాధపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

థైరాయిడ్ గ్రంధి మన మెడలో ముందువైపు, దిగువభాగాన ఉంటుంది. దీనికి ఎటువంటి నాళాలు ఉండవు(వినాళ గ్రంధి). అందువల్ల ఇది ఉత్పత్తి చేసిన హార్మోన్ నేరుగా రక్తప్రవాహంలో విడుదలయి గుండె నుంచి మెదడు దాకా, జీర్ణవ్యవస్థ నుంచి చర్మం వరకూ శరీర భాగాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. శరీరభాగాలు తమకు అందిన ఆహారంలోని శక్తిని ఉపయోగించుకొనే విధానాన్ని ఈ హార్మోన్ నియత్రిస్తుంది. ఈ ప్రక్రియనే మెటాబాలిజం(జీవక్రియ)అంటారు. జీవక్రియనే మన శరీరపు ఉష్ణోగ్రతను, గుండె కొట్టుకోవటాన్ని, ఆహారం ద్వారా శరీరానికి అందిన కాలరీలను ఏవిధంగా ఖర్చుచేస్తున్నదీ నిర్ణయిస్తుంది. థైరాయిడ్ గ్రంధి సరైనంత హార్మోనును ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల హైపోథైరాయిడ్ ఏర్పడుతుంది. దీనిలో జీవక్రియల వేగం తగ్గుతుంది. అంటే, పోషకాహారం తీసుకున్నా మన శరీరం తగినంత శక్తిని పొందలేదు. వ్యక్తి చాలా బలహీనపడతారు.

హైపోథైరాయిడిజం వ్యాధి లక్షణాలు

స్త్రీ, పురుషులు అన్ని వయస్సుల వారిలో ఇది కనిపిస్తుంది. అయితే పురుషులకంటే స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు అధికం. కొన్ని సాధారణ లక్షణాల ఆధారంగా దీనిని గుర్తించవచ్చు. అవి: థైరాయిడ్ గ్రంధి వాపు, తీరని అలసట, గుండె వేగం తగ్గిపోవటం, అనూహ్యంగా శరీరం బరువు పెరగటం, మానసిక కృంగుబాటు, చర్మం ఎండిపోయినట్లు కావటం, తలవెంట్రుకలు ఎక్కువగా రాలిపోవటం, మలబద్దకం వంటివి కనిపిస్తాయి. అయితే పిల్లల్లో హైపోథైరాయిడ్ ఏర్పడినపుడు లక్షణాలు ఇందుకు కొంత భిన్నంగా ఉంటాయి.

కాళ్లు-చేతులు చల్లబడతాయి. చాలా ఎక్కువగా నిద్రపోతుంటారు. పెరుగుదల కనిపించదు. పొట్టపొంగిపోతుంది. ముఖం ఉబ్బి ఉంటుంది. మలబద్దకం. ఈ లక్షణాలు కనిపించినపుడు డాక్టరును కలిస్తే కొన్ని పరీక్షుల చేయించటం ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఇందుకోసం డాక్టర్లు టి.ఎస్.హెచ్.(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), టి4(థైరోగ్జిన్) పరీక్షలు సిఫార్సు చేస్తారు. ఈ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయితే థైరాయిడ్ గ్రంధి వాపు ఏమైనా ఉందా చూసేందుకు అల్ట్రా సౌండ్ లేదా థైరాయిడ్ స్కాన్ కూడా చేయించవచ్చు.

థైరాయిడ్ గ్రంధి పనితీరు ఎందుకు దెబ్బదింటుంది?

చాలా సందర్భాలలో హష్మితోస్ థైరాయిడిస్ వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి హైపోథైరాయిడిజం ఏర్పడుతున్నది. ‘థైరాయిడిస్’ ఓ ఆటోఇమ్యూన్ (వ్యక్తి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆ శరీరంలోని అంతర్గత అవయవాలపైన దాడిచేసే) వ్యాధి. దీనికారణంగా శరీరం ఆంటీబాడీలను ఉత్పత్తిచేస్తూ థైరాయిడ్ గ్రంధిపైన దాడికి దిగి ఆ గ్రంధిని నాశనం చేయటానికి పూనుకుంటుంది. కొన్ని కేసులలో వైరసుల వల్ల కూడా థైరాయిడిస్ వ్యాధిసోకుతుంది. ఇవి కాకుండా మరికొన్ని కారణాల వల్ల కూడా థైరాయిడ్ తన హార్మోన్ ఉత్పాదకశక్తిని కోల్పోయి హైపోథైరాయిడిజం ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయొడిన్ అవసరం అవుతుంది. మన శరీరం తనంత తాను అయోడిన్ ను తయారుచేసుకోలేదు కనుక ఉప్పు, పాలు, కోడిగుడ్లు, చేపల వంటి ఆహారం పదార్థాల ద్వారా అందిచాల్సి ఉంటుంది. ఆహారంలో అయొడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంధి హార్మోన్ ను ఉత్పత్తిచేయలేదు. హైపోథైరాయిడ్ ఏర్పడుతుంది. గుండె సంబంధిత సమస్యలు, మనోవ్యాధులు, కాన్సర్ చికిత్సలలో ఉపయోగించే కొన్ని మందులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవటానికి కారణం అవుతుంటాయి. లింఫోమా వంటి కొన్నిరకాల కాన్సర్ల చికిత్సకు మెడ భాగానికి రేడియేషన్ ఇస్తారు. దీంతో థైరాయిడ్ గ్రంధిలోని కణాలు దెబ్బదిని థైరాయిడ్ హార్మోన్ తయారీ తగ్గిపోతుంది.

కొన్ని ఆరోగ్య కారణాల దృష్ట్యా థైరాయిడ్ గ్రంధిని తొలగించినపుడు సహజంగానే హార్మోన్ ఉత్పిత్తి ఉండదు. అయితే ఆ గ్రంధిలోని కొంత భాగాన్ని మాత్రమే తొలగించినపుడు తక్కిన గ్రంధి భాగం శరీరానికి అవసరమైన మొత్తంలో హార్మోనును తయారుచేస్తుంది. ఎందువల్లనో కొందరు స్త్రీలు గర్భం దాల్చిన సమయంలో థైరాయిడ్ గ్రంధి వాచుతుంది (పో స్ట్ పార్టమ్ థైరాయిడిస్). దీనిలో మొదట అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మన్ ఉత్పత్తి అవుతుంది. ఆపైన ఒక్కసారిగా అది తగ్గిపోయి హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. చాలా మంది మహిళలు తరువాత మళ్లీ సాధారణ పరిస్థితికి చేరుకుంటారు. కొంతమంది పిల్లలు థైరాయిడ్ గ్రంధి లోపంతో జన్మిస్తారు. గర్భస్థ శిశువుగా ఎదిగే సమయంలో వారిలో ఈ గ్రంధి సరిగా అభివృద్ధిచెందక పసిపాపలుగానే హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది.

చికిత్స

చాలా మందిలో హైపోథైరాయిడిజం చికిత్స సూటిగా, సులభంగా ఉంటుంది. వారికి డాక్టర్లు థైరాయిడ్ హార్మోన్ మాత్రలను సిఫార్సుచేస్తారు. ప్రతీరోజు, చాలా వరకు ఉదయాన్నే ఈ మాత్రవేసుకోమనటం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెస్తారు. మన శరీరంలో థైరాయడ్ తయారు చేసే టి4కు సరిగ్గా ప్రత్యామ్నాయం కాగల టి4ను కృత్రిమంగా ఉత్పత్తిచేసి ఈ మందులను తయారుచేస్తారు. క్రమం తప్పకుండా రక్తపరీక్షలు చేయటం ద్వారా రక్తంలో థైరాయిడ్ హార్మోన్ తగినంత ఉన్నది నిర్ధారించుకుంటూంటారు. దీని ఆధారంగా టి4 మాత్రల డోసును కూడా నిర్ణయించి సరిచేయటానికి డాక్టర్లకు వీలు కలుగుతుంది.

హైపోథైరాయిడిజంను గుర్తించి చికిత్సచేయని పక్షంలో అది గుండె, కీళ్లు, వ్యంధ్యత్వం, ఊబకాయం వంటి తీవ్రమైన ఇతర వ్యాధులకు దారితీస్తుందని కామినేని హాస్పిటల్స్ లోని సీనియర్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎస్ ఆర్ ఎస్ వర్ధన్ తెలిపారు. గర్భవతుల్లో హైపోథైరాయిడిజం గర్భస్థశిశువు అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గర్బంలో మొదటి మూడు నెలల శిశువు థైరాయిడ్ హార్మోనును తల్లి నుంచే పొందుతుంది. తల్లి హైపో థైరాయిడిజంతో బాధపడుతుంటే గర్భంలో మెదడు అభివృద్ధిని, ఆపైన బిడ్డ మానసిక అభివృద్ధిని సరిదిద్దలేని విధంగా దెబ్బదీస్తుంది.

రక్తంలో థైరాయిడ్ హార్మోన్ శాతం పూర్తిగా తగ్గిపోయినపుడు వ్యక్తి స్పృహతప్పి ప్రాణాలు కోల్పోతారు. థైరాయిడ్ హార్మోన్, అది లోపించటం వల్ల కలిగిన ఫలితాలని దృష్టిలో ఉంచుకుని సమగ్ర పక్షలు జరిపి ఖచ్చిమైన నిర్ధాణ అనంతరం హైపోథైరాయిడిజం చికిత్సను పారంభించాల్సి ఉంటుంది. ఇందుకుగాను థైరాయిడ్ పనితీరును సమగ్రంగా పరిశీలించి ఖచ్చితంగా అంచనా వేయగల అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అనుభవజ్ఞలైన వైద్యనిపుణులు అవసరం. తమ వద్ద అత్యాధునిక రోగనిర్ధారణ వైప్య నిర్వహించే పరికరాలు, నిపుణులతో ప్రత్యేక ఎండోక్రైనాజీ విభాగం పనిచేస్తోందని కామినేని హాస్పిటల్స్ కు చెందిన వైద్యనిపుణులు చెప్పారు. దీన్లో హార్మోన్ రిప్లేస్ థెరపీ, గ్రోత్ హార్మోన్ టెస్ట్ తో థైరాయడ్ సహా వినాళ గ్రంధుల చికిత్సకు ఎండోక్రైనాలజీ విభాగంలో సౌకర్యాలు అబివృద్ధిచేశారు.

డాక్టర్ ఎస్ఆర్ఎస్ వర్ధన్
తదుపరి వ్యాసం