తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation: చుట్టుపక్కల వారికి సాయం చేయడం అలవాటు చేసుకోండి, అది మీకు భవిష్యత్తులో మేలే చేస్తుంది

Wednesday Motivation: చుట్టుపక్కల వారికి సాయం చేయడం అలవాటు చేసుకోండి, అది మీకు భవిష్యత్తులో మేలే చేస్తుంది

Haritha Chappa HT Telugu

10 April 2024, 5:00 IST

    • Wednesday Motivation: సాయం చేయడం మానవత్వానికి గుర్తు. మనిషికి కచ్చితంగా ఉండవలసిందే మానవత్వం. మీరు చేసే చిన్న సాయం ఎదుటివారి జీవితాన్ని నిలబెట్టవచ్చు. అలాగే మీకు కూడా భవిష్యత్తులో ఎంతో సాయం అందేలా చేయవచ్చు.
మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (pixabay)

మోటివేషనల్ స్టోరీ

Wednesday Motivation: రాజు అనే వ్యక్తి ఒక చిన్న దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చే జీతం చాలా తక్కువ. అయినా కూడా ఆ జీతంలోనే అవసరమైన వారికి సాయం చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఒకరోజు దుకాణం యజమాని రాజుతో ‘రేపటి నుంచి మన దుకాణం మూసి వేస్తున్నాం. రోడ్డు వెడల్పు చేసేందుకు మన దుకాణాన్ని కూల్చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు తెరుస్తామో తెలియదు. ఇదిగో నీ చివరి జీతం’ అని చెప్పి కొంత డబ్బును రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆ డబ్బును చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆ డబ్బు తనకు సరిపోదు అని తెలుసు, అయినా కూడా ఆ కాస్త డబ్బే కొన్నాళ్లు తనకి ఆహారాన్ని పెడుతుందన్న సంతృప్తితో ముందుకు నడిచాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

దారిలో ఆగి ఆ రాత్రి తినేందుకు బ్రెడ్ ను కొనుక్కున్నాడు. అలా ఇంటికి వెళుతూ ఉంటే మధ్యలో ఒక బక్క పలుచని ముసలి వ్యక్తి కనిపించాడు. రాజుని ఆపి ‘బాబూ... నేను వారం రోజుల నుండి ఏమీ తినడం లేదు. మాకు ఏమైనా సాయం చేయవా’ అని అడిగాడు. అతని ముఖం చూసి రాజుకు చాలా బాధనిపించింది. తన దగ్గర ఉన్న బ్రెడ్ ను ఆ ముసలివానికి ఇచ్చేశాడు. అలాగే తన జీతంలో సగం డబ్బును అతనికి ఇచ్చి ముందుకు నడిచాడు. ఇంతలో ఆ ముసలి వ్యక్తి పిలిచి తన జేబులోంచి ఒక పాత నాణాన్ని తీసి రాజు చేతిలో పెట్టాడు.

‘ఈ నాణెం ఇప్పుడు చెల్లదు. కానీ కచ్చితంగా నీకు ఏదో ఒక రోజు పెద్ద సాయమే చేస్తుంది. ఇదే నువ్వు నాకు చేసిన సాయానికి నేను ఇచ్చే ప్రతిఫలం’ అని వెళ్ళిపోయాడు ఆ ముసలి వ్యక్తి.

రాజు మరుసటి రోజు పేపర్ చదువుతుండగా పేపర్లో ఒక నాణెం బొమ్మ కనబడింది. పురాతన నాణేలకు తగిన డబ్బులు ఇస్తామన్న ప్రకటన అది. వెంటనే ఆ చిరునామా పట్టుకుని ఆ దుకాణానికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న ముసలి వ్యక్తి ఇచ్చిన పాత నాణెన్ని చూపించాడు. వెంటనే ఆ దుకాణాదారుడు ఆనందంతో గెంతులు వేశాడు. మీ నాణెం కోసం ఎన్నో రోజుల నుండి వేచి ఉన్నానని చెప్పాడు. ఈ నాణెం చాలా ప్రాచీనమైనదని, విక్రమాదించుల కాలం నాటిదని చెప్పాడు. ఆ నాణేనికి విలువ కట్టి మూడు లక్షల రూపాయలు రాజు చేతిలో పెట్టాడు.

రాజుకి అంతా కలలాగా అనిపించింది. ఆ పాత నాణాన్ని ఇచ్చింది ఆ ముసలి వ్యక్తి. కాబట్టి ఈ డబ్బు అతనికే చెందుతుందని ఆ ముసలి వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ముసలి వ్యక్తి రాత్రి ఎక్కడ కనిపించాడో ఆ చోటకి వెళితే అక్కడ ఉన్న ఓ షాపు యజమాని రాజుని పిలిచి ఒక ఉత్తరం ఇచ్చాడు. ‘నిన్న నువ్వు బ్రెడ్ ఇచ్చిన ముసలి తాత ఈ ఉత్తరం నీకు ఇవ్వమని చెప్పాడు’ అని వివరించాడు. దానిలో ‘రాజూ... నీ దగ్గర ఉన్నదంతా మాకు ఇచ్చావు. ఈ కాలంలో ఇలా సాయం చేసే వ్యక్తులు చాలా తక్కువ. అందుకే నా దగ్గర ఉన్న దాంట్లో కాస్త నీకు ఇచ్చాను. వాటిని జాగ్రత్తగా వాడుకొని సంతోషంగా జీవించు’ అని ఉంది. అది చదివి రాజుకు ఆశ్చర్యం వేసింది. తనను ఆదుకోవడానికి ఆ ముసలి వ్యక్తిని దేవుడే పంపించాడని భావించాడు.

రాజు చేసిన చిన్న సాయం రిటర్న్ లో భారీగా వచ్చింది. అలాగే అవసరమైనప్పుడు ఎవరికైనా మీరూ సాయం చేయండి. ఎప్పుడు ఏ సాయం మీకు భారీ ప్రతిఫలాన్ని ఇస్తుందో చెప్పలేము. మీరు చేసే చిన్న చిన్న సాయాలు ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు. ఒకరి ఆకలి తీర్చవచ్చు. సాయం చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావించండి.

తదుపరి వ్యాసం