తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Car Mileage | ఈ టిప్స్‌ పాటించి.. మీ కారు మైలేజ్‌ పెంచుకోండి!

Car Mileage | ఈ టిప్స్‌ పాటించి.. మీ కారు మైలేజ్‌ పెంచుకోండి!

Hari Prasad S HT Telugu

28 February 2022, 16:01 IST

    • ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే కార్లను కొన్నామని మీరు భావించినా.. కొన్ని కీలకమైన విషయాల్లో చేసే తప్పిదాలతో కారు మైలేజ్‌ దారుణంగా దెబ్బతింటుంది. అది కాస్తా మీ జేబుకు చిల్లు పెడుతుంది. ఈ నేపథ్యంలో కారు మైలేజీని దెబ్బతీసే అంశాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఒకే వేగంతో వెళ్లడం కూడా కారు మైలేజీని కాపాడుతుంది
ఒకే వేగంతో వెళ్లడం కూడా కారు మైలేజీని కాపాడుతుంది (Pixabay)

ఒకే వేగంతో వెళ్లడం కూడా కారు మైలేజీని కాపాడుతుంది

Car Mileage.. కారు కొనాలని అందరికీ ఉంటుంది. అందులోనూ ఈ కాలంలో కొత్త కారైనా, సెకండ్‌ హ్యాండ్‌ కారైనా ఈజీగా లోన్లు కూడా దొరుకుతుండటంతో చాలా మంది కార్ల వైపు చూస్తున్నారు. అయితే కారు కొన్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మెయింటెనెన్స్‌ ఖర్చుతోపాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా ఇంధనం నింపుకోవాలంటే తలకు మించిన భారమవుతోంది. 

టైమ్‌కు సర్వీసింగ్‌ చేయిస్తున్నారా?

కారు ఇంజిన్‌ బాగుంటేనే.. మైలేజీ బాగుంటుంది. మరి ఆ ఇంజిన్‌ బాగుండాలంటే కారును రెగ్యులర్‌గా సమయానికి సర్వీస్‌ చేయిస్తుండాల్సిందే. కారు కొనే ముందే కంపెనీ ఈ సర్వీస్‌ గురించి ప్రత్యేకంగా చెబుతుంది. ఎన్ని రోజులకు, ఎన్ని కిలోమీటర్లకు సర్వీస్‌ చేయించాలో స్పష్టంగా చెబుతుంది. కానీ చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కొన్ని రోజులు ఆలస్యమైతే ఏమవుతుందిలే అనుకుంటారు. 

ఇది కాస్తా ఇంజిన్‌ను దెబ్బతీసి.. కారు మైలేజీని తగ్గిస్తుంది. అందువల్ల సమయానికి కారు సర్వీసింగ్‌ చేయించడంతోపాటు.. అదే సమయంలో ఇంజిన్‌ ఆయిల్‌, స్పార్క్‌ ప్లగ్స్‌, ఎయిర్‌ అండ్‌ ఫ్యుయెల్‌ ఫిల్టర్‌ వంటివి చెక్‌ చేసుకోండి. మీరు కారును మరీ ఎక్కువగా వాడుతున్నారంటే ప్రతి 60 వేల కిలోమీటర్లకు ఒకసారి ఆక్సిజన్‌ సెన్సర్లను కూడా మార్చుకోండి. ఇక నాణ్యమైన ఇంజిన్‌ ఆయిల్‌నే వాడేలా చూడండి. ఇంజిన్‌ ఆయిల్‌ విషయంలో రాజీ పడితే అది ఇంజిన్‌ను దెబ్బతీయడంతోపాటు కారు మైలేజీపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

డ్రైవింగ్‌ ఎలా చేస్తున్నారు?

కంపెనీలు తమ కార్లు చాలా ఎక్కువ మైలేజీ ఇస్తాయని ఎంత చెప్పినా.. చివరికి దానిని నడుపుతున్నవారిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. మీరు డ్రైవింగ్‌ ఎలా చేస్తున్నారనేదే మీ కారు మైలేజీని నిర్ధారిస్తుంది. కారును ఎలా నడిపిస్తే మంచి మైలేజీ ఇస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.

గేర్లు సరిగ్గా వేయాలి: కారు నడిపే సమయంలో ఎక్కువ ఇంధనం వృథా అయ్యేది గేర్లు మార్చే సమయంలోనే అనే విషయం మీకు తెలుసా? ఒకటి, రెండు గేర్లలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఆక్సెలరేట్‌ చేస్తే ఎక్కువ ఫ్యుయెల్‌ ఖర్చవుతుంది. అలాగే గేర్లను ఎక్కువ నుంచి తక్కువకు మార్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మైలేజీ పెరుగుతుంది. తక్కువ గేరు ఉన్నప్పుడు వేగంగా వెళ్లడం వల్ల ఆర్పీఎం పెరిగి అది ఇంజిన్‌పై భారం మోపుతుంది. ఫలితంగా మైలేజ్‌ తగ్గుతుంది.

ఆక్సెలరేటర్‌ జాగ్రత్తగా..: కొంతమంది ఆక్సెలరేటర్‌ను మరీ ఎక్కువగా వాడుతుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా.. దానిని తొక్కుతూనే ఉంటారు. దీనివల్ల ఇంజిన్‌కు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అది కాస్తా ఎక్కువ ఇంధనాన్ని వాడుతుంది. దీంతో మైలేజీ తగ్గిపోతుంది. అందువల్ల ఆక్సెలరేటర్‌ను జాగ్రత్తగా వాడండి. ఒకేసారి కాకుండా మెల్లగా వేగం పెంచండి. అంతేకాకుండా సాధ్యమైనంత వరకూ ఒకే వేగంలో వెళ్లడానికి ప్రయత్నించండి. ఇది కూడా మీ కారు మైలేజీని పెంచడంలో తోడ్పడుతుంది. ఇక కారు వేగంగా ఉన్న సమయంలో క్లచ్‌ను నొక్కకండి. ఇది కూడా ఇంధనం వృథా కావడానికి ప్రధాన కారణం.

ఇంజిన్‌ ఆపేయండి: ముఖ్యంగా నగరాల్లో ఉండే వాళ్లు ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గర మరీ ఎక్కువసేపు ఉండాల్సి వస్తుందని భావించినా, లేదంటే ఎవరి కోసమైనా వేచి చూస్తున్నా.. వెంటనే కారు ఇంజిన్‌ను ఆపేయండి. నిల్చున్న కారు ఇంజిన్‌ నడుస్తూనే ఉండటం వల్ల ఇంధనం వృథా తప్ప వచ్చే ప్రయోజమేమీ లేదు.

టైర్లలో గాలి చెక్‌ చేస్తున్నారా?

చాలా మంది కారు ఓనర్లు పెద్దగా పట్టించుకోని విషయం ఇది. టైర్లలో గాలి నిండుగా ఉంటేనే అది సాఫీగా సాగిపోతుంది. గాలి తక్కువగా ఉండటం వల్ల టైర్లకు, రోడ్డుకు మధ్య ఘర్షణ పెరిగి.. ఇంజిన్‌కు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఇది మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. అన్ని టైర్లలో గాలి అవసరం మేరకు ఉన్నప్పుడు కారు సాఫీగా సాగిపోతుంది. మైలేజీ కూడా అందుకు తగినట్లు ఇస్తుంది.

కారు అద్దాలు మూయండి

మనలో చాలా మందికి ఓ తప్పుడు భావన ఉంది. హైవేలో కారు వేగంగా వెళ్లే సమయంలో అద్దాలు మూసి, ఏసీ వేయడం వల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మైలేజీ తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. ఇలాంటి వాళ్లు కారు అద్దాలు తెరిచి వేగంగా వెళ్తుంటారు. కానీ ఇలా వేగంగా ఉన్న సమయంలో కారు అద్దాలు దించడం వల్ల బలమైన గాలి కారులోకి చొరబడుతుంది. 

ఈ సమయంలో వేగాన్ని పెంచడానికి ఇంజిన్‌ అదనపు శక్తిని వినియోగించాల్సి వస్తుంది. ఫలితంగా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అలా కాకుండా కారు అద్దాలు మూసి, అవసరమైతే ఏసీ వేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మైలేజీ ఎక్కువగా వస్తుంది.

ఈ జాగ్రత్తలూ పాటించండి

కారు సర్వీస్‌, టైర్లు, మీ డ్రైవింగ్‌ విధానం వంటివాటితోపాటు మైలేజీని పెంచడానికి, మీ ఇంధన ఖర్చును తగ్గించుకోవడానికి మరికొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది.

- సాధ్యమైనంత వరకూ కారులో ఎక్కువ బరువు లేకుండా చూసుకోండి. అవనసం అనుకున్న వస్తువులను వెంటనే కారులో నుంచి తీసేయండి. కారులో ఎంత ఎక్కువ బరువు ఉంటే ఇంజిన్‌ అంత ఎక్కువ శక్తిని, ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తుంచుకోండి.

- కారు ఉంది కదా అని ప్రతి చిన్నాచితకా పనికి, తక్కువ దూరాలకు కూడా ఉపయోగించకండి. నడిచే దూరం లేదంటే సైకిల్‌పై వెళ్లగలిగే దూరం ఉంటే కారును బయటకు తీయొద్దు.

- ఇక ఒకసారి ఒక పని మీద బయటకు వెళ్లినప్పుడు మరేవైనా పనులు ఉన్నాయేమో చూసుకోండి. సాధ్యమైనంత వరకూ ఒకసారి కారులో ఒక పని మీద వెళ్తే.. అన్ని పనులూ పూర్తి చేసుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. ఒక్కో పనికి ఒక్కోసారి కారును తీయడం వల్ల ఇంధనం వృథా అవుతుంది.

- నగరాల్లో ఉండేవాళ్లు తాము వెళ్లే దారిలో ట్రాఫిక్‌ను ముందుగానే అంచనా వేసి.. తక్కువ ట్రాఫిక్‌ ఉన్న రూట్లో వెళ్లే ప్రయత్నం చేయండి. ట్రాఫిక్‌ సమాచారాన్ని ఇచ్చే టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో.. దానిని తెలివిగా ఉపయోగించుకొని మీరు ఇంధన ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చిన్నచిన్న విషయాలలాగే కనిపిస్తున్నా.. ఒక్కసారి వీటిని పాటించి చూస్తే.. మీ ఫ్యుయెల్‌ బిల్లు ఎంతలా తగ్గుతుందో మీకే తెలుస్తుంది.

తదుపరి వ్యాసం