తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : భూమిపైకి అరువుగా వచ్చాం.. కొన్నాళ్లకు ఎరువుగా మారిపోతాం

Sunday Motivation : భూమిపైకి అరువుగా వచ్చాం.. కొన్నాళ్లకు ఎరువుగా మారిపోతాం

HT Telugu Desk HT Telugu

23 April 2023, 4:30 IST

    • Sunday Motivation : చాలా మంది ప్రతీ విషయంలో నేనే.., నేను మాత్రమే అనే భావనతో ఉంటారు. కానీ మనం ఉండేది కొన్నాళ్లే.. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. అందరికీ సంతోషాన్ని పంచాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచమంతా.. కాలం మీదనే నడుస్తుంది. మనం అనుకున్నట్టుగా జరిగేది కాదు.. ఏది జరగాలో అదే జరుగుతుంది. అంతమాత్రం దానికే ప్రతీ ఒక్కరితో గొడవలు, స్వార్థం అంటూ వెళితే.. ఉన్నన్ని రోజులైనా సంతోషంగా ఉండలేరు. ఈ సృష్టి అంతా కాలంతోనే నడుస్తుంది. అన్నీ కాలమే. మనల్ని ఈ భూమి మీదకు తీసుకువచ్చేది కాలమే. మనల్ని ఈ భూమి మీద నుంచి తీసుకు వెళ్ళి పోయేది కాలమే.

ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు. అలాంటిది.. చిన్న చిన్న విషయాలకే గొడవలు, స్వార్థం అంటూ ఉండి సాధించేది ఏముంది. నేనే అంతా.. నేను మాత్రమే.. అని అహంకారంతో విర్రవీగాల్సిన అవసరం లేదు. నేను మాత్రమే అనుకుంటాం.. కానీ మనమంతా ఈ భూమి మీదకు అరువుగా వచ్చాం.. కొన్నాళ్లైతే ఎరువుగా మారిపోతాం. ఈ మధ్యలో కొన్ని రోజులు హాయిగా బతికేద్దాం.

ఎవరు, ఎప్పుడు, ఎందుకు ఎలా మారుతారో తెలియదు. మార్పు అనేది సహజం. కాలమే మారిపోయేలా చేస్తుంది. అందరితోనూ మనం సంతోషంగా ఉంటే సరిపోతుంది. మనల్ని చూసైనా వారు మారే అవకాశం ఉంటుంది. అందరితోనూ ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్లు మనల్ని మోసం చేసినా.. వారి మీద రివేంజ్ లాంటిది ప్లాన్ చేసి టైమ్ వేస్ట్ చేయకండి. వాళ్ల గురించి ఆలోచించే సమయాన్ని మీ భవిష్యత్ గురించి ఆలోచించండి. మీకు సంతోషాన్నిచ్చేది భవిష్యత్ గురించి ఆలోచనే. అనుకున్నది జరిగితే.. ఇంకా హ్యాపీగా ఉంటారు.

జీవితంలో ఏది జరిగినా.. ఒకటి మాత్రం మన కోసం సిద్ధంగా ఉంటుంది. దాని పేరే భవిష్యత్. మనిషి జీవితం మేడిపండు లాంటిది.. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. ఎవరి జీవితంలో ఏం దాగి ఉందో చెప్పలేం. పక్కవారి జీవితంలోకి ఎక్కువగా తొంగిచూడకూడదు. అవసరం ఉంటే సాయం చేయండి అంతే. ఎవరినీ నొప్పించకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

మనం మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం.. బతికి ఉండటం ఒక అదృష్టం.. అలాంటిది ఏవోవో కారణాలతో మనసును పాడుచేసుకోవద్దు. ముడి పడుతున్న బంధాలన్ని మనకు వరాలు.., ఎదురు పడుతున్న అడ్డంకులన్ని మనకు విలువైన పాఠాలు.., కష్టం గురించి చింతించకుండా ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేద్దాం. అహంకారాన్ని దాటేద్దాం.. అందరితో సంతోషంగా ఉందాం..!

తదుపరి వ్యాసం