తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kitchen Plants: వంటింట్లోనూ చక్కగా పెరిగిపోయే ఇంటి మొక్కలివే.. మీరూ ఒకటి తెచ్చేసుకోండి..

Kitchen plants: వంటింట్లోనూ చక్కగా పెరిగిపోయే ఇంటి మొక్కలివే.. మీరూ ఒకటి తెచ్చేసుకోండి..

30 October 2023, 16:15 IST

  • Kitchen plants: కొన్ని రకాల మొక్కలు కిచెన్ వాతావరణంలో కూడా సులువుగా పెరిగిపోతాయి. ఎక్కువ వెలుతురు అవసరం లేకుండా పెరిగే మొక్కలేంటో తెలుసుకొని మీరూ ఒకటి తెచ్చేసుకోండి.

జడ్ జడ్ ప్లాంట్
జడ్ జడ్ ప్లాంట్ (pexels)

జడ్ జడ్ ప్లాంట్

ఇంట్లో మొక్కలు ఉంటే వచ్చే అందం మరి దేనితోనూ రాదు. ఎన్ని డెకరేటివ్‌ పీసుల్ని బోలెడు రూపాయలు పోసి కొని తెచ్చి పెట్టినా ఆ ఆహ్లాదం చేకూరదు. అందుకనే ఇంట్లో వీలైనన్ని ఎక్కువ మొక్కల్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అటు పచ్చదనం, ఇటు గాలి శుభ్రం, మరోవైపు కళ్లకు ఆహ్లాదం.. ఇన్ని ప్రయోజనాలు ఒక్క మొక్కని పెంచుకోవడంతోనే వచ్చేస్తాయి. మరైతే ఇంట్లో ఆడవాళ్లంతా ఎక్కువగా గడిపేది వంట గదిలోనే. చాలా మంది ఇక్కడ మొక్కలేం పెట్టుకుంటాంలే అన్నట్లు ఉంటారు. కానీ ఇక్కడ కూడా చక్కగా బతికే మొక్కలు కొన్ని ఉన్నాయి.

స్పైడర్‌ ప్లాంట్‌ :

స్పైడర్‌ ప్లాంట్‌ని నేరుగా ఎండలో పెట్టకూడదు. అందుకనే వంట గదిలో కొద్ది సేపు ఎండ తగిలే కిటికీల్లాంటివి చూసుకుని స్పైడర్‌ ప్లాంట్‌ని ఏర్పాటు చేసుకోండి. అందువల్ల ఆకులు ఎండినట్లుగా అవుతాయి. దీన్ని హ్యాంగింగ్‌ మొక్కలాగానూ వేసుకోవచ్చు. ఇది మంచి ఎయిర్‌ ప్యూరిఫయర్‌.

స్నేక్‌ ప్లాంట్‌ :

దీనికి మదర్‌ ఇన్‌లా టంగ్‌ ప్లాంట్‌ అనే మరో విచిత్రమైన పేరూ ఉంది. దీనిలో రకరకాల ప్యాట్రన్లు, రంగులు, సైజులు ఉంటాయి. చాలా తక్కువ మెయింటనెన్స్‌ అవసరమయ్యే మొక్క. ఇది మంచి కాంతి ఉన్న దగ్గర నుంచి పెద్దగా కాంతి రాని చోట్ల వరకు అన్ని దగ్గర కూడా బాగా పెరుగుతుంది. రోజూ నీరు పోయక పోయినా పరవాలేదు.

రబ్బర్‌ ప్లాంట్‌ :

రబ్బర్‌ ప్లాంట్‌ గురించి చాలా మందికి తెలుసు. దీన్ని ఫైకస్‌ ఎలాస్టికా అంటారు. ఇది నేల బలం దొరికితే పెద్ద చెట్టుగానూ ఎదిగిపోతుంది. అయితే ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు మాత్రం దీన్ని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఆకారాన్ని తీర్చి దిద్దుకుంటూ ఉంటే సరిపడ చిన్న మొక్కలా ఉంటుంది. వంటింట్లో ఏదైనా మూల ఖాళీగా ఉంది అనుకుంటే అక్కడ దీన్ని పెట్టి చూడండి. ఆ కార్నర్‌కే అందం వచ్చేస్తుంది. అలా పెంచుకోవడానికి ఇది మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

జడ్‌ జడ్‌ ప్లాంట్‌ :

తక్కువ మొయింటనెన్స్‌ ఉండే మొక్క గురించి చూస్తుంటే జడ్‌ జడ్‌ మొక్కను ఎంపిక చేసుకుని వంటింట్లో పెంచేసుకోవచ్చు. ఇది ఎలాంటి కఠిన వాతావరణంలో అయినా ఇంట్లో చక్కగా పెరుగుతుంది. ఎక్కువ నీరు లేకపోయినా, కాంతి లేకపోయినా కూడా పచ్చగా ఉండి ఆహ్లాదాన్ని పంచుతుంది.

మనీ ప్లాంట్‌ :

ఇంట్లో ఏ గదికైనా సరే బాగా సరిపోయే మొక్క మనీ ప్లాంట్‌ . ఇది నీడగా ఉండే చోట్ల చక్కగా పెరుగుతుంది. వంట గదిలో పెంచుకునేందుకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. కిచెన్‌ టాప్‌ మీద ఒకటి పెట్టుకున్నా మంచి డెకరేటివ్‌ లుక్‌ని ఇస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం