తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breast Cancer Awareness: అద్దం ముందు నిలబడి రొమ్ములో గమనించాల్సిన మార్పులు ఇవే..

Breast cancer awareness: అద్దం ముందు నిలబడి రొమ్ములో గమనించాల్సిన మార్పులు ఇవే..

HT Telugu Desk HT Telugu

19 October 2023, 16:14 IST

  • Breast cancer awareness: రొమ్ము క్యాన్సర్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కానీ సరైన అవగాహనతో, తక్కువ సమయంలో గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అవేంటో తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

రొమ్ము క్యాన్సర్ అవగాహన
రొమ్ము క్యాన్సర్ అవగాహన (pexels)

రొమ్ము క్యాన్సర్ అవగాహన

రొమ్ము క్యాన్సర్ విషయంలో కొంత అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. చంకల్లో, రొమ్ము దగ్గర కొన్ని మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఆ మార్పులేంటనే అవగాహన అందరికీ ఉండాలి. రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ములో నొప్పి తగ్గకపోవడం, చర్మం కాస్త మందంగా అనిపించడం, ఉబ్బడం, రంగు మారడం, ఆకారంలో మార్పు రావడం, చనుమొన దగ్గర దురద, స్రావాలు కనిపించడం.. ఇవన్నీ ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Oats vegetables khichdi: ఓట్స్ వెజిటబుల్స్ కిచిడి... ఇలా చేస్తే బరువు తగ్గడం సులువు, రుచి కూడా అదిరిపోతుంది

Men Skin Care Drinks : మెరిసే చర్మం కావాలంటే రోజూ ఉదయం వీటిలో ఏదో ఒకటి తాగండి

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

HT లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డా. మాధురి రొమ్ము క్యాన్సర్ గురించి అనేక విషయాలు ప్రస్తావించారు. నలభై ఏళ్లకన్నా తక్కువ వయస్సున్న మహిళల్లో లేదా మోనోపాజ్ దగ్గరగా ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయి. వీళ్లలో చాలామంది డాక్టర్లు సూచించినట్లుగా మామోగ్రామ్ చేయించుకోకపోవడం ఒక కారణం. సరైన సమయానికి వైద్యం అందాలంటే మహిళలకు ఈ వ్యాధి గురించి అవగాహన అవసరం. కుటుంబంలో మరెవరికీ ఇదివరకు రొమ్ము క్యాన్సర్ లేకపోయినా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు డా. మాధురి.

రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెంచే కారకాలు:

వయసు పెరుగుతున్నా కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతో పాటే 12 ఏళ్ల కన్నా ముందే రజస్వల అవ్వడం, పిల్లల్ని కనకపోవడం, లేదా ఆలస్యంగా పిల్లల్ని కనడం, 55 ఏళ్ల తర్వాత మోనోపాజ్, హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ దీర్ఘకాలం చేయించుకోవడం, లేదా కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉండటం వంటివన్నీ రొమ్ముక్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలి?

అద్దం ముందు నిలబడి రొమ్ము పరిమాణం, ఆకారం, చర్మంలో ఏమైనా మార్పులున్నాయా అని చూసుకోవాలి. లోపలే కాకుండా చర్మం మీద కూడా ఏవైనా గడ్డల్లాగా, ఉబ్బుగా కనిపిస్తున్నాయా అని గమనించాలి. ఇప్పుడు మోచేతులు తలదాకా పైకెత్తాలి. ఇప్పుడు చనుమొనల్లో ఏమైనా మార్పులుంటే గుర్తించాలి. తర్వాత ఏదైనా ఉపరితలం మీద పడుకుని చేతి వేళ్ల సాయంతో రొమ్ముల చుట్టూ, చంకల దగ్గర మెల్లగా వలయాకారంలో మర్దనా చేస్తున్నట్లు బయటి వైపు నుంచి లోపలిదాకా రావాలి. ఏవైనా గడ్డలు, లేదా ఎక్కడైనా మిగతా చర్మం కన్నా గట్టిగా అనిపిస్తుందేమో చూడాలి. కొంచెం మార్పు కనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

రొమ్ము క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు:

అధిక బరువు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాద అవకాశాల్ని పెంచుతుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు వల్ల ఈస్ట్రోజెన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల కొన్ని అసాధారణ కణాల పెరుగుదల జరగొచ్చు. అందుకే నిరంతరం వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, పండ్లు కూరగాయలు తినడం వంటివన్నీ జీవితంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. వారానికి కనీసం అయిదు రోజులు వ్యాయామం చేయడం వల్ల వాపు లక్షణాలు తగ్గి రోగనిరోధక శక్తి పెరగుతుంది. ఇది క్యాన్సన్ నుంచి రక్షిస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

డయాగ్నసిస్:

రొమ్ము క్యాన్సర్ గుర్తించడానికి మామోగ్రఫీ ప్రైమరీ స్క్రీనింగ్ పద్ధతి. ఆధునిక వైద్య విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు ఇంకాస్త కచ్చితంగా వ్యాధిని నిర్ధరించే అవకాశాలు పెరిగాయి. వాటిలో ఒకటి మాలిక్యులర్ బ్రెస్ట్ ఇమేజింగ్ (MBI), ఇది రేడియో యాక్టివ్ ట్రేజర్లను ఉపయోగించి అసాధారణ కణాలను గుర్తిస్తుంది. మామోగ్రఫీ X- రే ఫొటోల మీద ఆధారపడి ఉంటుంది. MBI పద్ధతిలో వేరే పద్ధతుల్లో గుర్తించలేని చిన్నమార్పులను కూడా గుర్తించే ఆస్కారం ఉంటుంది. దీంతో పాటే లిక్విడ్ బయాప్సీ కూడా రొమ్ము క్యాన్సర్ గుర్తించడంలో సాయపడుతుంది. అలాగే నిరంతరం స్వీయ పరీక్ష చేసుకోవడం వల్ల చిన్న మార్పులను కూడా గుర్తించొచ్చు.

తదుపరి వ్యాసం