Morning Snacks : బరువు తగ్గాలంటే ఉదయం ఇవి తినకపోవడమే మంచిది
Weight Loss : ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు పెరిగే కొద్దీ అనేక వ్యాధులు చుట్టుముడతాయి. వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి బరువు తగ్గాలని వైద్యులు సలహా ఇస్తారు. బరువు తగ్గడం కోసం మీరు ఏం తింటారు? ఎప్పుడు తింటారు? అనేది చాలా ముఖ్యం.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు కొవ్వును కోల్పోవాలంటే అల్పాహారం అత్యంత భారీగా ఉండాలి. బరువు తగ్గడానికి మీకు సహాయపడే కొన్ని ఆహారాలతో మీ రోజును ప్రారంభించండి. కానీ చాలా మంది అల్పాహారం కోసం కొంత ఆహారం తీసుకుంటారు, తర్వాత ఏదేదో తింటారు. దీని వల్ల బరువు నియంత్రణకు బదులుగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. వెంటనే ఈ ఆహారాలను తొలగించడం చాలా ముఖ్యం.
బిస్కెట్లు లేదా కుకీలు వంటి బేకరీ వస్తువులు తినడానికి చాలా బాగుంటాయి. కానీ ఈ ఆహారాలన్నీ అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, చక్కెరను కలిగి ఉంటాయి. ఇది తింటే బరువు పెరగడానికి దారితీస్తుంది. మొత్తం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
చాలా మంది ఉదయం పూట ఒక కప్పు టీ లేదా కాఫీతో బిస్కెట్లు లేదా కుకీలు తింటారు. కుకీలు, మిఠాయిలు, చక్కెర తృణధాన్యాలు కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగడంతోపాటు బరువు పెరుగుతారు.
పరోటాలను చాలా ఇళ్లలో అల్పాహారంగా తింటారు. కూరగాయలు, గోధుమ పిండితో చేసిన పరోటా ఆరోగ్యానికి మంచిది. కానీ పరోటాను వెన్న, పచ్చళ్లతో కలిపి తినడం చాలా అనారోగ్యకరం. ఇది శరీరంలో బరువు పెరగడానికి కారణం అవుతుంది.
ప్రతిరోజూ చిప్స్, వేయించిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతారు. ఈ ఆహారాలన్నీ అధిక కేలరీలను కలిగి ఉంటాయి. అంతే కాకుండా నూనెలో వేయించిన ఆహారాన్ని ఉదయం పూట తినకపోవడమే మంచిది. ఇది కొవ్వు పేరుకుపోతుంది. పండ్లు, కూరగాయలు, పెరుగు, గింజలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం ఉత్తమం. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం సాల్టెడ్ నట్స్, వెన్న, సాల్టెడ్ పాప్‌కార్న్ వంటి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో నీరు నిలుపుదలకి కారణమవుతాయి. ఫలితంగా కడుపు ఉబ్బరంగా మారుతుంది. శరీరంలో మంట ఏర్పడుతుంది.
ఉదయం పూట చాలా ఇళ్లలో బ్రెడ్ తింటారు. బ్రెడ్‌పై ఎక్కువ జామ్ లేదా వెన్నను వేసి అల్పాహారంగా లాగించేస్తారు. తినడానికి టేస్టీగా ఉంటుంది. అయితే బరువు తగ్గాలంటే బ్రెడ్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే బ్రెడ్‌లో చాలా చక్కెర ఉంటుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతుంది.
బరువు తగ్గడానికి పండ్లు అవసరం. పండ్లు బరువు తగ్గడమే కాకుండా వివిధ వ్యాధుల నుండి మనలను కాపాడతాయి. కానీ మార్కెట్లో దొరికే పండ్ల రసం తీసుకోకుడదు. ఇటువంటి పానీయాలలో అదనపు చక్కెర ఉంటుంది. దీంతో మీరు పండ్ల రసం తీసుకున్నా.. కొవ్వును కోల్పోలేరు. ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇంట్లో తయారుచేసే పండ్ల రసంలో చక్కెరను ఎక్కువగా వాడకపోవడం ఆరోగ్యానికి మంచిది.
ఉదయం పూట మాత్రమే కాదు, బరువు తగ్గే సమయంలో మార్కెట్లో దొరికే డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. ఇందులో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. పైన పేర్కొన్న స్నాక్స్‌లో కేలరీలు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.