Buttermilk Benefits: ఆయుర్వేద మజ్జిగతో ప్రయోజనాలెన్నో.. మీరు ప్రయత్నించండి..
15 April 2022, 12:44 IST
- Ayurveda Buttermilk: రానున్నది వేసవి కాలం. సమ్మర్ ఇంకా మొదలు కాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం చలి.. మధ్యాహ్నం ఎండతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పైగా ఈసారి ఎండలు కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయని వెల్లడించింది వాతావరణశాఖ. ఈ క్రమంలో వేసవిని తట్టుకోవడానికి ఇప్పటినుంచే కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదంటున్నారు నిపుణులు.
ఆయుర్వేద మజ్జిగ
వేసవిని తాపాన్ని తగ్గించే వాటిల్లో మజ్జిగ ఎప్పుడు ముందే ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారుతాయి. అంతే కాకుండా బరువుని నియంత్రణలో ఉంచుతుంది. పైగా ఇది కడుపును చల్లబరిచి.. వేసవి తాపం నుంచి కాపాడుతుంది. అంతేకాక జీర్ణ సమస్యలను దూరం చేసి.. తక్షణ శక్తి ఇస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచి.. కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది.
ఇండియన్స్ ప్రోబయోటిక్ డ్రింక్
భారతదేశంలో వేసవిలో ప్రోబయోటిక్ డ్రింక్‌గా పిలిచే మజ్జిగకు మంచి డిమాండ్ ఉంటుంది. మజ్జిగకు జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం ఉంది. ఇది కఫా, వాతాలను తగ్గింస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్సర్ తెలిపారు. అంతేకాకుండా ఆయుర్వేద చికిత్సలో మజ్జిగను ఉపయోగిస్తామని.. వాపు, జీర్ణ రుగ్మతలు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రుగ్మతలు, ఆకలి లేకపోవడం, ప్లీహము వంటి రుగ్మతల చికిత్సలో వియోగిస్తామని వెల్లడించారు. ఆయుర్వేద మజ్జిగను ఇంట్లోనే తయారు చేసుకోవాలని సూచిస్తూ.. దాని తయారీ విధానం వివరించారు.
ఆయుర్వేద మజ్జిగ తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు
1/4 కప్పు పెరుగు
1 గ్లాస్ వాటర్
ఉప్పు తగినంత
1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
పుదీనా ఆకులు
కొత్తిమీర
తరిగిన అల్లం(ఆప్షనల్)
తయారీ విధానం
ముందుగా పావు కప్పు పెరుగును ఒక పాత్రలోకి తీసుకుని ఒక గ్లాసు నీళ్లు కలపాలి. ఉప్పు, జీలకర్రపొడిని వేయాలి. అనంతరం బ్లెండర్తో ఆ మిశ్రమాన్ని పూర్తిగా కలపుతూ పలచగా చేసుకోవాలి. ఈ ఆయుర్వేద మజ్జిగను భోజనంతో పాటు లేదా.. భోజనం అనంతరం తాగేందుకు సరైన సమయమని డాక్టర్ భావ్సర్ సూచించారు.
జుట్టురాలే సమస్య కోసం..
అంతేకాదండోయ్.. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు కూడా మజ్జిగను తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుందని సింగర్ చిన్మయి శ్రీపాద తెలిపారు. రోజు ఉదయాన్నే మజ్జిగను తీసుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుందని ఆమె ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించారు.
కావాల్సిన పదార్థాలు
కరివేపాకు, పెరుగు, నిమ్మరసం ఒక స్పూన్, ఉప్పు తగినంత
తయారీ విధానం
ఇవన్నీ ఒక పాత్రలో తీసుకుని బాగా కలపాలని సూచించారు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి.. దంతాల సమస్యలు రాకుండా చూస్తాయని చిన్మయి తెలిపారు. ఇది పరగడుపునే తీసుకుంటే ఫలితాలు బాగా ఉంటాయని స్పష్టం చేశారు.