తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vadhuvu Web Series Review: అవికా గోర్ ఫ్యామిలీ మిస్టరీ సిరీస్ ‘వధువు’ ఎలా ఉందంటే!: రివ్యూ

Vadhuvu Web Series Review: అవికా గోర్ ఫ్యామిలీ మిస్టరీ సిరీస్ ‘వధువు’ ఎలా ఉందంటే!: రివ్యూ

08 December 2023, 14:06 IST

    • Vadhuvu Web Series Review: అవికా గోర్ ప్రధాన పాత్ర పోషించిన వధువు వెబ్ సిరీస్ సీజన్ 1 స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ ఉత్కంఠకరంగా సాగిందా.. అంచనాలను అందుకుందా అన్నది ఈ రివ్యూలో తెలుసుకోండి.
వధువు వెబ్ సిరీస్ రివ్యూ
వధువు వెబ్ సిరీస్ రివ్యూ

వధువు వెబ్ సిరీస్ రివ్యూ

Vadhuvu Web Series Review: వెబ్ సిరీస్: వధువు - సీజన్ 1 (7 ఎపిసోడ్లు); స్ట్రీమింగ్ వివరాలు: డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్, డిసెంబర్ 8 నుంచి..

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రధాన నటీనటులు: అవికా గోర్, అలీ రెజా, నందు, వీఎస్ రూప లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, అమ్మ రమేశ్, కాంచన్ బమ్నే

సంగీతం: మద్దూరి శ్రీరామ్; సినిమాటోగ్రఫీ: రామ్‍ కే మహేశ్; ఎడిటర్: అనిల్ కుమార్; కథ: సహనా దత్తా (బెంగాలీ సిరీస్ ఇందు ఆధారంగా వధువు రూపొందింది);

నిర్మాతలు: శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోనీ (ఎస్‍వీఎఫ్ బ్యానర్); రచన, దర్శకత్వం: పోలూరు కృష్ణ

బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‍తో బాలనటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్‍గా మారారు. మూవీస్ చేస్తున్నారు. ఇటీవల వరుసగా వెబ్ సిరీస్‍లు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ఫ్యామిలీ మిస్టరీ థ్రిల్లర్ ‘వధువు’ వెబ్ సిరీస్ తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

మిస్టరీ ఫ్యామిలీ.. కథ ఇలా..

అంజూరి ఇందూ (అవికా గోర్) పెళ్లి తన చెల్లి వల్ల ఆగిపోతుంది. ఆ తర్వాత ఆనంద్ (నందూ)తో ఇందూకు వివాహం నిశ్చయమవుతుంది. అయితే, ఈ పెళ్లికి ముందు కూడా చాలా విచిత్ర ఘటనలు జరుగుతాయి. దీన్ని కూడా ఆపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారనేలా కొన్ని విషయాలు జరుగుతాయి. మొత్తంగా ఇందూ, ఆనంద్ పెళ్లి జరుగుతుంది. ఇందూను సంతోషంగా ఉండనివ్వనని ఆమె చెల్లి కూడా సవాలు చేస్తుంది.

ఆ తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టిన ఇందూకు.. మొదటి రోజు నుంచే ఆ ఇంట్లో ఏవో రహస్యాలు ఉన్నట్టు అర్థమవుతుంది. అనుమానించేలా చాలా ఘటనలు ఆమెకు ఎదురవుతాయి. ఆనంద్ పెద్దమ్మ కూతురిని ఇందూతో మాట్లాడకుండా దాచేస్తారు. ఇంట్లోని ప్రతీ ఒక్కరు అర్థం కాని వ్యక్తుల్లా.. అనుమానించే విధంగానే ఉంటారు.

తానే అనుకొని ఇందూ ఆడపడుచుపై ఇందు గదిలోనే హత్యాయత్నం జరుగుతుంది. తన మరిది ఆర్య (అలీ రెజా) భార్య వైష్ణవిని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఇందుకు తెలుస్తుంది. ఇలా ఆ ఇంట్లోని ప్రతీ విషయం, ప్రతీ వ్యక్తి ఓ రహస్యంలా ఇందుకు అనిపిస్తుంది. వైష్ణవి గురించి ఏదో దాచి పెట్టాలని అందరూ ప్రయత్నిస్తుంటారు. దీంతో ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఇందూ నిర్ణయించుకుంటుంది. ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఇందూపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించింది ఎవరు? ఆర్య, వైష్ణవి మధ్య ఏం జరిగింది? వారిద్దరూ ఎందుకు విడిపోయారు? వైష్ణవి ఏమైపోయింది? అనేదే వధువు మొదటి సిరీస్ ప్రధాన కథాంశంగా ఉంది.

సస్పెన్స్ కొనసాగుతూ..

వధువు వెబ్ సిరీస్ ఆరంభం నుంచే సస్పెన్స్ రేకెత్తిస్తుంది. ఇందూ (అవికా గోర్) పెళ్లి తంతే ఆసక్తిని కలిగిస్తుంది. మొదటి పెళ్లి చెడిపోవటంతో ఆనంద్ (నందు)తో నైనా ఇందు పెళ్లి సవ్యంగా జరుగుతుందా అని కుటుంబ సభ్యులు కంగారు పడుతుంటారు. ఆనంద్ కుటుంబంలోని పరిస్థితులు, వారి వ్యవహార శైలి కూడా మొదటి నుంచే మిస్టరీగా చూపించాడు దర్శకుడు. దీంతో సస్పెన్స్ బిల్డ్ చేశాడు. ప్రధాన కథలోకి అడుగుపెట్టేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఇందూ అత్తారింట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మిస్టరీలా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. తర్వాత ఏం జరగబోతోందని ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేలా సీన్లను తెరకెక్కించారు డైరెక్టర్. ముఖ్యంగా ఇందూ అత్తారింట్లోని ప్రతీ వారిని గ్రేషేడ్ ఉన్న వారిలా చూపిస్తూ.. అందరిపై అనుమానాలు కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. వైష్ణవి పేరు ఎత్తిన ప్రతీసారి ఇంట్లోని అందరూ ఏవో విధంగా కంగారు పడడం మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తుంది. మొత్తంగా వధువు వెబ్ సిరీస్ తొలి సీజన్ మొత్తం సస్సెన్స్ తోనే సాగుతుంది.

ప్రశ్నలే..

సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటూ.. చాలా ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ఎపిసోడ్లు అయిపోయే కొద్దీ క్వశ్చన్స్ పెరుగుతుంటాయి. అయితే, వైష్ణవి విషయంలో తప్పెదవరిదనే విషయం సహా చాలా విషయాలను ఈ డైరెక్టర్ రివీల్ చేయలేదు. పోలీసుల దర్యాప్తు కూడా అంత ఆసక్తికరంగా సాగదు. అవికాకు ఒకరిపై అనుమానం వచ్చినా.. అసలు దోషి ఎవరు అనే విషయాన్ని మాత్రం దర్శకుడు తేల్చలేదు. తర్వాతి సీజన్ కోసం దాచి పెట్టారు. ఇక, ఈ సిరీస్‍లో అక్కడక్కడా సీరియల్ తరహా డ్రామా కనిపిస్తుంది. అలాగే, ఈ సీజన్ మొత్తం సుమారు రెండున్నర గంటలే ఉంటుంది. దీంతో క్యారెక్టర్లను లోతుగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు డైరెక్టర్. అయినా, సస్పెన్స్ మాత్రం కొనసాగించగలిగారు. వధువు మొదటి సీజన్ చూసిన వారు.. రెండో సీజన్ కోసం తప్పక ఎదురుచూస్తారనేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు.

సాంకేతిక విషయాలు ఇలా..

బెంగాలీ సిరీస్ 'ఇందూ'కు రీమేక్‍గా వధువు సిరీస్‍ను దర్శకుడు పోలూరు కృష్ణ అదే సస్పెన్స్‌తో రూపొందించారు. కథనాన్ని వేగంగా, ఆసక్తికరంగా ముందుకు నడిపారు. మద్దూరి శ్రీరామ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ సిరీస్‍కు పెద్ద బలం. ప్రేక్షకులు సస్పెన్స్ ఫీలవడంలో సంగీతానిది కూడా ముఖ్యపాత్ర. కెమెరా యాంగిల్స్, గ్రే కలరింగ్ కూడా థ్రిల్లర్‌కు తగ్గట్టే ఉన్నాయి. నిడివి ఎక్కువ ఉండకూడనే ఉద్దేశంతో ఎడిటింగ్ కూడా పకడ్బందీగా చేసినట్టు అర్థమవుతోంది.

అవికా.. అలవోకగా..

ఇందూ పాత్రలో అవికా గోర్ నటన మెప్పిస్తుంది. భయం, తెగువ, అనుమానం, బాధ.. ఇలా అన్ని భావాలను విజయంతంగా పలికించారు. తన యాక్టింగ్‍ను మరోసారి నిరూపించుకున్నారు. ఇందూ పాత్రను అలవోకగా చేశారు. అలీ రెజా కూడా మెప్పించారు. ఎమోషనల్ సీన్లలోనూ బాగా చేశారు. నందూ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు అంతా ఓకే.

చూసేయవచ్చు!

థ్రిల్లర్ సిరీస్‍లు ఇష్టపడే వారికి వధువు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా సుమారు రెండున్నర గంటల పాటే ఈ సిరీస్ ఉండడం కూడా ప్లస్ పాయింట్. సస్పెన్స్ కూడా ఉండటంతో విసుగు ఏ దశలోనూ రాదు. అయితే, తప్పెవరు చేశారో రివీల్ కాకపోవటంతో చివర్లో కాస్త నిరుత్సాహం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే, దాన్ని తదుపరి సీజన్ కోసం మేకర్స్ దాచిపెట్టేశారు. కొన్ని రొటీన్ సీన్లు, కొన్ని చోట్ల లాజిక్‍లు మిస్ అయ్యాయి. ఇవి మినహా వధువు సీజన్ 1 మెప్పిస్తుంది. ఎక్కడా బోరు కొట్టించదు. అందుకే.. వధువు వెబ్ సిరీస్‍ను నిరభ్యంతరంగా చూసేవచ్చు.

రేటింగ్: 3/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం