తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarkaru Vaari Paata Review | స‌ర్కారువారి పాట రివ్యూ - మ‌హేష్ వ‌న్ మ్యాన్ షో

sarkaru vaari paata review | స‌ర్కారువారి పాట రివ్యూ - మ‌హేష్ వ‌న్ మ్యాన్ షో

HT Telugu Desk HT Telugu

12 May 2022, 11:24 IST

  • స‌ర్కారువారి పాట (sarkaru vaari paata).. ఈ ఏడాది తెలుగులో విడుద‌ల‌వుతోన్న భారీ చిత్రాల్లో ఒక‌టి. మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందంటే...

మ‌హేష్‌బాబు, కీర్తిసురేష్‌
మ‌హేష్‌బాబు, కీర్తిసురేష్‌ (twitter)

మ‌హేష్‌బాబు, కీర్తిసురేష్‌

సర్కారు వారి పాట మూవీ రివ్యూ: టాలీవుడ్‌ అగ్ర‌హీరోల్లో మ‌హేష్ బాబు స్టార్‌డ‌మ్ విల‌క్ష‌ణీయ‌మైన‌ది. మాస్‌, క్లాస్ ఇమేజ్ కు ప‌రిమితం కాకుండా యువ‌త‌రంతో పాటు ఫ్యామిలీ ఆడియోన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడ‌త‌డు. 

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

యూత్ కంటే ఎక్కువ‌గా కుటుంబ ప్రేక్ష‌కులు మ‌హేష్ బాబు సినిమాల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. వెండితెర‌పై విభిన్న‌మైన పాత్ర‌ల్లో మెస్మ‌రైజింగ్ యాక్టింగ్‌తో అభిమానుల్నిఅల‌రిస్తుంటాడు మ‌హేష్‌బాబు. 

2019లో సంక్రాంతికి విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్ నుంచి సినిమా రాలేదు. అభిమానుల సుదీర్ఘ‌ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ రెండేళ్ల విరామం త‌ర్వాత స‌ర్కారువారి పాట సినిమాతో ఆయ‌న‌ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. 

గీతగోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వం వ‌హించిన సినిమా ఇది. మహేష్ బాబుతో సినిమాచేసేందుకు అగ్ర దర్శకులు ఎదురుచూస్తుండగా అతడు మాత్రం మిడ్ రేంజ్ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. సర్కారువారి పాటలోని ఓ సాంగ్ లో మ‌హేష్ బాబు త‌న‌య సితార తొలిసారి క‌నిపించ‌డం, క‌ళావ‌తి పాట‌కు వంద మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ రావ‌డంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. 

స‌ర్కారువారి పాట‌తో మ‌హేష్ బాబు అభిమానుల‌ను అల‌రించారా? అత‌డి న‌మ్మ‌కాన్ని ప‌ర‌శురామ్ నిల‌బెట్టాడా? టాలీవుడ్ విజ‌య‌పరంప‌ర‌ను ఈ సినిమా కొన‌సాగించిందా లేదా అన్న‌ది చూద్దాం...

మహేష్ మనీ మైండెడ్

మహేష్ అలియాస్ మహి(మహేష్ బాబు) అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. డబ్బు కి ఎక్కువ విలువ ఇస్తాడు. త‌న ద‌గ్గ‌ర నుంచి ప్రేమ, అభిమానాన్ని దొంగిలించిన బాధ‌ప‌డ‌డు కానీ డ‌బ్బు దొంగిలిస్తే సహించలేడు. అప్పు తీసుకున్న‌వాడు ఎంత దూరంలో ఉన్నా తిరిగి వ‌సూలు చేసుకుంటాడు. 

ఇండియా నుంచి అమెరికాకు చ‌దువు కోసం వ‌చ్చిన క‌ళావ‌తికి(కీర్తిసురేష్) క్యాసినో పిచ్చి. మ‌హేష్‌కు అబ‌ద్దాలు చెప్పి అత‌డి ద‌గ్గ‌ర అప్పు తీసుకొని జూదం ఆడుతుంది. తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ అప్పు వ‌సూలు చేసుకోవ‌డానికి మ‌హేష్ వైజాగ్‌లోని క‌ళావతి తండ్రి రాజేంద్ర‌నాథ్(సముద్రఖని) ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. 

రాజేంద్ర‌నాథ్ త‌న‌కు ప‌దివేల కోట్లు బాకీ ఉన్నాడ‌ని మీడియా ముందు ప్ర‌క‌టిస్తాడు మ‌హేష్‌. అత‌డు అలా ఎందుకు అన్నాడు?  రాజేంద్ర‌నాథ్‌తో మ‌హేష్ కు ఉన్న వైరం ఏమిటి? ఆ ప‌దివేల కోట్లు ఎక్క‌డివి? మ‌హేష్ వైజాగ్ రావ‌డానికి కార‌ణ‌మేమిటి? అత‌డి మంచిత‌నాన్ని క‌ళావ‌తి అర్థం చేసుకుందా?  లేదా అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం. 

రుణాల ఎగవేత..

మ‌ధ్య‌, దిగువ త‌ర‌గ‌తి వ‌ర్గాలు  అప్పులు స‌క్ర‌మంగా చెల్లిస్తున్నా.. ప్ర‌తి ఏటా బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరుగుతూనే ఉన్నాయి. త‌మ పలుకుబ‌డి, ప‌ర‌ప‌తితో బ్యాంకుల ద‌గ్గర వేల కోట్లు అప్పులు తీసుకుంటున్న‌ ఉన్న‌త వ‌ర్గాలు రుణాల ఎగ‌వేత‌కు పాల్ప‌డుతుండ‌టమే బ్యాంకుల న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. 

మ‌ధ్య త‌ర‌గ‌తి వారిపైన అధికంగా వ‌డ్డీల భారాన్ని వేస్తూ ప్ర‌తి రూపాయిని బ‌ల‌వంతంగా వ‌సూలు చేసే బ్యాంకులు ఉన్న‌త వ‌ర్గాల విష‌యంలో మాత్రం ఎందుకు ఎలా ప్ర‌వ‌ర్తించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడిస్తూ సినిమాను తెర‌కెక్కించారు. ఈ పాయింట్‌ను సందేశంతో సీరియ‌స్ గా కాకుండా మ‌హేష్ బాబు స్టారడమ్, ఇమేజ్‌తో ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ప‌ర‌శురామ్‌.

కామెడీ టైమింగ్ బలం

ప్ర‌థ‌మార్థం పూర్తిగా మ‌హేష్‌బాబు కామెడీ టైమింగ్‌ను న‌మ్ముకొనే సినిమా సాగుతుంది.  ప్రతి డైలాగ్ లో వ్యంగ్యం ఉండేలా దర్శకుడు రాసుకున్నారు. థియేట‌ర్స్‌లో మ‌హేష్ బాబు చెప్పిన ఆ డైలాగ్స్ అన్నీ నవ్వించాయి. నేను ఉన్నాను నేను విన్నాను.. అంద‌రూ న‌న్ను ఇంకా చిన్న పిల్లాడినే అంటుకుంటున్నారు.. కానీ ఈ ఫిజిక్‌ను మెయింటేన్ చేయ‌లేక‌ చ‌చ్చిపోతున్నా.. అంటూ రియ‌ల్‌లైఫ్‌లో ప్ర‌చారంలో ఉన్న డైలాగ్‌ల‌ను సినిమాలో వాడుకున్నారు.  

డ‌బ్బుకు మ‌హేష్‌బాబు ఇచ్చే ప్రాధాన్య‌త‌ను సింపుల్‌గా ఒక్క యాక్ష‌న్ ఎపిసోడ్‌లోనే చూపిస్తూ ఆయన క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేసిన విధానం బాగుంది. అబ‌ద్దాలు చెప్పి మ‌హేష్‌బాబును కీర్తిసురేష్ మోసం చేయ‌డం... ఆమె ప్రేమ‌ మైకంలో మ‌హేష్ మునిగిపోయే ట్రాక్‌తో ఫ‌స్ట్‌హాఫ్ స‌ర‌దాగా సాగిపోతుంది. 

సెకండ్ హాఫ్‌లోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. రాజేంద్ర‌నాథ్‌ను మ‌హేష్ టార్గెట్ చేసిన విధానాన్ని కామెడీతో మొద‌లుపెట్టి ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ అస‌లు పాయింట్‌ను ద‌ర్శ‌కుడు చెప్పాడు. మ‌హేష్‌బాబులోని హీరోయిజాన్ని చాటుతూ యాక్ష‌న్ అంశాల‌తో ద్వితీయార్థంగా ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను గ‌త సినిమాల‌కు భిన్నంగా ప‌వ‌ర్‌ఫుల్‌గా డిజైన్ చేసుకున్నారు. 

లాజిక్స్ మిస్సింగ్..

ధ‌నిక వ‌ర్గాల రుణాల ఎగ‌వేత అనే చిన్న‌పాయింట్ ను తీసుకొని దానిచుట్టూ క‌మ‌ర్షియ‌ల్ హంగులు అల్లుకొని ప‌ర‌శురామ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. కానీ ఈ అంశాన్ని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించలేకపోయారు.  రాజేంద్ర‌నాథ్‌ను మ‌హేష్ టార్గెట్ చేయ‌డానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం క‌న్వీన్సింగ్‌గా లేదు. మ‌హేష్, స‌ముద్ర‌ఖ‌ని ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు వ‌ర్క‌వుట్ కాలేదు. విల‌న్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను స‌రిగా రాసుకోలేదు. ప్ర‌థ‌మార్థం మొత్తం టైమ్‌పాస్ వ్య‌వ‌హారంగానే సాగుతుంది త‌ప్పితే క‌థ‌తో ఎలాంటి సంబంధం ఉండ‌దు.

రుణాల ఎగ‌వేత అనేది సర్కారువారి పాట మూవీకి మెయిన్ పాయింట్. కానీ అది ఈ సినిమాలో చిన్న ఉప‌క‌థ‌గానే క‌నిపిస్తుంది. అస‌లు క‌థ‌ను ప‌క్క‌న‌పెట్టి అనవసర కామెడీ ట్రాక్ లకే దర్శకుడు ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిచ్చారు. మ‌హేష్‌బాబు, కీర్తిసురేష్‌, సుబ్బ‌రాజు ఎపిసోడ్ అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. సీరియ‌స్‌గా సినిమా సాగుతున్న త‌రుణంలో వ‌చ్చే ఈ ఎపిసోడ్ న‌వ్వించ‌క‌పోగా చిరాకును తెప్పిస్తుంది. చాలా చోట్ల లాజిక్స్ మిస్సయ్యాయి. 

స్టైలిష్ లుక్‌లో మహేష్ బాబు

మ‌హేష్ బాబు  వ‌న్ మ్యాన్ షో ఇది. సినిమా మొత్తం క్లాస్ లుక్ తో స్టైలిష్ గా క‌నిపించారు. త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించారు.  మ‌హేష్ బాబులోని రొమాంటిక్‌, యాక్ష‌న్‌, కామెడీ అన్ని యాంగిల్స్‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా వాడుకున్నారు. 

కీర్తిసురేష్ పాత్ర ప్ర‌ధానంగానే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ప్ర‌థ‌మార్థంలో మాత్ర‌మే ఆమె క‌నిపిస్తుంది. ద్వితీయార్థంలో గెస్ట్‌గా మారిపోయింది. స‌ముద్ర‌ఖ‌ని విల‌నిజం రొటీన్‌గా మారిపోయింది.  అల వైకుంఠ‌పుర‌ంలో తో పాటు మ‌రికొన్ని సినిమాల ఛాయ‌లు క‌నిపిస్తాయి. వెన్నెల కిషోర్, సుబ్బ‌రాజు అక్క‌డ‌క్క‌డ న‌వ్వించారు. 

త‌మ‌న్ బాణీల్లో క‌ళావ‌తి పాట బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్  అద‌ర‌గొట్టాడు. స‌ర్కారువారి పాట థీమ్ మ్యూజిక్ బాగుంది. 

ప‌ర‌శురామ్ కెరీర్‌లో ఇదే పెద్ద సినిమా.  త‌న‌కు దొరికిన అవ‌కాశాన్ని పూర్తిస్థాయిలో స‌ద్వినియోగం చేయ‌లేక‌పోయారు. మ‌హేష్ బాబు స్థాయికి త‌గ్గ ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌ను రాసుకోలేదు. నిర్మాణ విలువ‌లు మాత్రం రిచ్‌గా ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి.  అప్పు కూడా అమ్మాయి లాంటిదే.. బాధ్యత తో వ్యవహరించాల్సిందే అంటూ రాసిన డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి. 

అభిమానులను మెప్పిస్తుంది..

స‌ర్కారువారి పాట మ‌హేష్ అభిమానుల‌ను మెప్పిస్తుంది. మ‌హేష్ బాబు కామెడీ టైమింగ్‌ను ఇష్ట‌ప‌డేవారు ఎంజాయ్ చేస్తారు. మిగ‌తా వారికి అంత‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

మూవీ రేటింగ్‌-2.5/5

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం