తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthikeya 2 Movie Review: కార్తికేయ 2 మూవీ రివ్యూ - సీక్వెల్ తో నిఖిల్ హిట్ కొట్టాడా

Karthikeya 2 movie review: కార్తికేయ 2 మూవీ రివ్యూ - సీక్వెల్ తో నిఖిల్ హిట్ కొట్టాడా

HT Telugu Desk HT Telugu

13 August 2022, 14:20 IST

google News
  • దాదాపు ఎనిమిదేళ్ల విరామం త‌ర్వాత హీరో నిఖిల్‌(Nikhil), ద‌ర్శ‌కుడు చందూ మొండేటి (Chandoo Mondeti) క‌లిసి చేసిన చిత్రం కార్తికేయ‌-2 (Karthikeya 2). అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా భారీ అంచ‌నాల న‌డుమ నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు మెప్పించిందంటే...
అనుపమ పరమేశ్వరన్, నిఖిల్
అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ (twitter)

అనుపమ పరమేశ్వరన్, నిఖిల్

Karthikeya 2 movie review: టాలీవుడ్ లో నిఖిల్‌ను హీరోగా నిల‌బెట్టిన సినిమాల్లో కార్తికేయ ఒక‌టి. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే చందూ మొండేటి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత కార్తికేయ‌-2 తో మ‌రోసారి నిఖిల్‌, చందూ మొండేటి కాంబినేష‌న్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది.

కార్తికేయ‌కు సీక్వెల్ అంటూ ఆరంభం నుండి యూనిట్ ప్ర‌చారం చేయ‌డంతో అంద‌రిలో కార్తికేయ‌-2పై ఆస‌క్తి ఏర్పడింది. ప్ర‌చార చిత్రాలు కూడా సినిమాపై హైప్‌ను తీసుకొచ్చాయి. కార్తికేయ స‌క్సెస్‌ను ఈ సీక్వెల్ పున‌రావృతం చేసిందా? నిఖిల్‌కు ద‌ర్శ‌కుడు చందూ మొండేటి మ‌రో హిట్ ఇచ్చాడా? భ‌క్తిని, ఉత్కంఠను బ్యాలెన్స్ చేస్తూ చందూ మొండేటి ఈ సినిమాను ఎలా తెర‌కెక్కించాడ‌న్న‌ది తెలియాలంటే కార్తికేయ - 2 క‌థ‌లోని వెళ్లాల్సిందే...

కార్తికేయ కథ

కార్తికేయ (నిఖిల్) ఓ డాక్ట‌ర్‌. త‌ల్లితో క‌లిసి శ్రీకృష్ణ ద‌ర్శ‌నం కోసం ద్వార‌క వ‌స్తాడు. కృష్ణుడి కంక‌ణం కోసం ప‌రిశోధ‌న చేస్తున్నఆర్కియాల‌జిస్ట్ రావు క‌నిపించ‌కుండా పోతాడు. అత‌డి అదృశ్యం వెనుక కార్తికేయ ప్రమేయం ఉంద‌ని అనుమానించిన పోలీసులు అత‌డిని అరెస్ట్ చేస్తారు. రావు మ‌న‌వ‌రాలు ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) స‌హాయంతో జైలు నుంచి త‌ప్పించుకున్న కార్తికేయ కృష్ణుడి కంక‌ణాన్ని సాధించ‌డం కోసం ప్ర‌యాణం మొద‌లుపెడ‌తాడు? ఆ బాధ్య‌త‌ను కార్తికేయ చేప‌ట్ట‌డానికి కార‌ణ‌మేమిటి? ఆ కంక‌ణాన్ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన శాంత‌ను (ఆదిత్య మీనన్) ఎవ‌రు? ఈ ప్ర‌యాణంలో కార్తికేయ‌, ముగ్ధ‌ల‌కు ఎలాంటి అవ‌రోధాలు ఎదుర‌య్యాయ‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌.

పౌరాణిక గాథతో...

కృష్ణుడి పౌరాణిక గాథ‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా మొద‌లవుతుంది. క‌లికాలంలో జ‌ర‌గ‌బోయే అన‌ర్థాల‌కు ప‌రిష్కార మార్గాల్ని కృష్ణుడు ముందుగానే సూచించ‌డం అనే పాయింట్ ఆక‌ట్టుకుంటుంది. భ‌క్తి, సైన్స్ రెండు అంశాల‌ను స‌మాంత‌రంగా చూపిస్తూ క‌థ ముందుకు సాగుతుంది. కృష్ణుడి ర‌హ‌స్యాల‌ను సేక‌రించ‌డానికి రావు కృషి చేస్తున్న‌ట్లుగా చూపిస్తూనే మ‌రోవైపు సృష్టిలోని ప్ర‌తి విష‌యం వెనుక సైన్స్ ఉంటుంద‌ని న‌మ్మే కార్తికేయ జ‌ర్నీని నడిపించడం ఆకట్టుకుంటుంది.

కంకణాన్ని సాధించాడా ?

కార్తికేయ ద్వార‌కాలో అడుగుపెట్ట‌డంతోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. పోలీస్ లు అరెస్ట్ చేయడం, త‌న బాధ్యత ఏమిటో ఎలా తెలుసుకోగలిగాడ‌నే అంశాలను గ్రిప్పింగ్‌గా చెప్పారు. ద్వితీయార్థంలో కృష్ణుడి కంక‌ణాన్ని ఎక్క‌డ దాగి ఉంద‌నేది కార్తికేయ ఎలా తెలుసుకున్నాడు? శాంత‌ను బారి నుంచి ఆ కంకాణాన్ని కాపాడటానికి అత‌డు సాగించిన పోరాటాన్ని ఉత్కంఠ‌, థ్రిల్ మేళ‌వింపుతో సెకండాఫ్‌లో చూపించారు.

నాస్తికుడి ప్రయాణం

కృష్ణ‌త‌త్వం గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తూ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ఈ సినిమాను తెర‌కెక్కించారు. లోకాన్ని న‌డిపించేది సైన్స్ మాత్ర‌మే అని న‌మ్మే ఓ యువ‌కుడు దేవుడు కూడా ఉన్నాడ‌ని త‌న ప్ర‌యాణంలో ఎలా తెలుసుకున్నాడ‌న్న‌ది కార్తికేయ 2 లో చూపించారు.

దేవుడు, సైన్స్ ఒక్కటే...

భ‌విష్య‌త్తును ఊహిస్తూ ఎన్నో విషయాల్ని వంద‌ల ఏళ్ల క్రిత‌మే పౌరాణిక గ్రంథాల్లో ఋషులు పొందుప‌రిచారు. ఆ గ్రంథాల్లోని సారాన్ని అర్థం చేసుకుంటే లోకానికి ఎంతో మేలు జరుగుతుందని చాటిచెప్పారు. సైన్స్‌, దేవుడు ఒక్క‌టేన‌ని చెప్పడమే కాకుండా సైన్స్ చెప్పింది నిజ‌మ‌ని న‌మ్మిన‌ప్పుడు దేవుడు కూడా ఉన్నాడ‌ని న‌మ్మాలి అంటూ దర్శకుడు చందూ మొండేటి సినిమాలో ఆవిష్కరించారు. మ‌నం ఒక్క శాతం జ్ఞానాన్ని ఉప‌యోగిస్తే జీవితం, ప‌దిశాతం ఉప‌యోగిస్తే స‌మాజ సేవ‌, అదే వంద‌శాతం ఉప‌యోగిస్తే దేవుడు అంటూ కృష్ణుడు, రాముడు లాంటి అవతార పురుషుల గొప్ప‌త‌నాన్ని డైలాగ్స్ ద్వారా చెబుతూ కార్తికేయ 2 ను తెరకెక్కించారు.

లాజిక్స్ మిస్...

కొన్ని చోట్ల లాజిక్స్‌కు దూరంగా క‌థ సాగుతుంది. కఠినమైన లక్ష్య సాధనలో హీరోకు ఎదురయ్యే ఛాలెంజెస్ కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. కథాగమనం నిదానంగా సాగడం మైనస్ గా అనిపిస్తుంది.

నిఖిల్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా...

కృష్ణుడి ర‌హ‌స్యాన్ని ఛేదించే వ్య‌క్తిగా నిఖిల్ త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. కార్తికేయ క్యారెక్ట‌ర్‌లో పూర్తిగా ఒదిగిపోయాడు. న‌టుడిగా అత‌డి కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఒక‌టిగా నిలుస్తుంది. కార్తికేయ ప్ర‌యాణానికి అండ‌గా నిలిచే యువ‌తిగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama parameswaran)క‌నిపించింది. అనుప‌మ్ ఖేర్ (Anupam kher) పాత్ర నిడివి త‌క్కువే అయినా కథకు కీల‌కంగా నిలిచింది. వైవా హ‌ర్ష‌, శ్రీనివాస‌రెడ్డి త‌మ కామెడీతో న‌వ్వించారు. విల‌న్‌గా ఆదిత్య మీన‌న్ యాక్టింగ్ ఒకే అనిపిస్తుంది.

కథకుడిగా మెప్పించాడు...

ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా చందూ మొండేటి ఈ సినిమాతో మెప్పించాడు. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా సినిమాను ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించాడు. కాళ‌భైర‌వ నేప‌థ్య సంగీతం, కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. పుర‌ణాలు, దేవుడి ఔన్న‌త్యాన్ని ఆవిష్క‌రిస్తూ వ‌చ్చే సంభాష‌ణ‌లు బాగున్నాయి.

థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్

ర‌హ‌స్య ఛేధ‌న‌లో ఓ యువ‌కుడు సాగించే ప్ర‌యాణానికి భ‌క్తి, సైన్స్ ను ముడిపెడుతూ సాగే కార్తికేయ 2 సినిమా ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌టి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ను పంచుతుంది. బింబిసార‌, సీతారామం త‌ర్వాత ఆ విజ‌య‌ప‌రంప‌ర‌ను ఈ సినిమా కొన‌సాగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

రేటింగ్ - 3/ 5

తదుపరి వ్యాసం