తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anantham Review |అనంతం వెబ్ సిరీస్ రివ్యూ…ఇల్లు చెప్పిన క‌థ‌లు

anantham review |అనంతం వెబ్ సిరీస్ రివ్యూ…ఇల్లు చెప్పిన క‌థ‌లు

HT Telugu Desk HT Telugu

24 April 2022, 8:02 IST

  • ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ వెబ్ సిరీస్ అనంతం. కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలను చర్చిస్తూ ప్రియ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇటీవల జీ5 ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యింది. 
అనంతం వెబ్ సిరీస్
అనంతం వెబ్ సిరీస్ (twitter)

అనంతం వెబ్ సిరీస్

ప్ర‌స్తుతం సినిమాల‌తో స‌మానంగా వెబ్‌సిరీస్‌లు ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంటున్నాయి. వెండితెర‌పై చెప్ప‌లేని కొన్ని క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు చూపించ‌డానికి సిరీస్‌లు చ‌క్క‌టి మార్గంగా మారిపోయాయి. రోజురోజుకు వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతుండటంతో వీటిలో నటించడానికి స్టార్స్ తో పాటు సీనియర్ నటీనటులు ఆసక్తిని చూపుతున్నారు. దక్షిణాది చిత్రసీమలో విలక్షణ పాత్రలతో ప్రతిభావంతులైన నటులుగా పేరుతెచ్చుకున్న ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ అనంతం. మణిరత్నం శిష్యురాలు ప్రియ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5 ఓటీటీ ద్వారా ఇటీవల విడుదలైంది. తమిళంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో అనువదించారు. ఈ సిరీస్ ఎలా ఉందంటే.. 

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ఓ ఇంటి కథ

అనంతం అనే ఓ ఇంటి నేప‌థ్యంలో సాగే వెబ్‌సిరీస్ ఇది. కోపం, బాధ‌, సంతోషం, విజ‌యం, ప్రేమ, భ‌యం, దుఃఖం లాంటి భావోద్వేగాల‌కు ఓ ఇల్లు ఎలా సాక్షిగా నిలిచిందో ఇందులో చూపించారు. ఇంటిలోని ప్రతి వస్తువు ఓ కథను చెబుతుందనే పాయింట్ తో తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు చైల్డ్ అబ్యూసింగ్‌, హోమో సెక్సువ‌ల్, లింగ వివ‌క్ష‌ వంటి సామాజిక స‌మ‌స్య‌ల్ని ట‌చ్ చేస్తూ ద‌ర్శ‌కురాలు ప్రియ ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించింది. ఎనిమిది ఎపిసోడ్‌లుగా తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో క‌థ‌ను చెప్పారు. 1960 నుంచి 2015 వ‌ర‌కు ఓ ఇంటిలో నివ‌సించిన వారి జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు వినోదం, ఉద్వేగాలు మేళ‌వించి సిరీస్ నడుస్తుంది.

వెంక‌టేషం(ప్ర‌కాష్ రాజ్‌) ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. నా అనే వాళ్లు ఎవ‌రూ లేని అత‌డికి ఇల్లే ప్ర‌పంచం. అనంతం పేరుతో ఆ ఇంటిని పిలుచుకుంటాడు. ముప్పై ఏళ్ల క్రితం ఇళ్లు వ‌దిలి వెళ్లిన‌ త‌న కొడుకు అనంత్ ఫొటోను వెంక‌టేషం పేప‌ర్‌లో చూస్తాడు. అది చూడ‌గానే అత‌డికి హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఆసుప‌త్రిలో చేర‌తాడు. తండ్రిని అనంత్ చాలా ద్వేషిస్తుంటాడు. త‌న‌కు ఇష్టం లేక‌పోయినా క‌జిన్ బ‌ల‌వంతం మేర‌కు తండ్రిని చూడ‌టానికి వ‌స్తాడు. స్వ‌త‌హాగా రైట‌ర్ అయిన అనంత్ తండ్రి నివ‌సించే ఇంటితో త‌న‌కు ఉన్న జ్ఞాప‌కాల‌తో పాటు అందులో అద్దెకు ఉన్న‌ వారి క‌థ‌ల్ని రాయాల‌ని అనుకుంటాడు అనంత్‌. ఆ ఇంటిలో ఎవ‌రెవ‌రూ నివ‌సించారు. వారి జీవితాలు ఏ మ‌లుపులు తిరిగాయ‌న్న‌దే ఎనిమిది ఛాప్ట‌ర్స్ ద్వారా చెప్పారు ద‌ర్శ‌కురాలు.

ఫ‌స్ట్ ఛాప్ట‌ర్‌- మ‌ర‌గదం

ప్ర‌కాష్‌రాజ్‌, సంప‌త్‌రాజ్ పాత్ర‌ల ప‌రిచ‌యంతో తొలి ఎపిసోడ్‌ మొద‌ల‌వుతుంది. పురాత‌న భ‌వంతిని వెంక‌టేషం కొనుగోలు చేయ‌డం, అత‌డి కుటుంబానికి ఆ ఇంటితో ఏర్ప‌డిన అనుబంధంతో ఎమోష‌న‌ల్ గా ఫ‌స్ట్ ఛాప్ట‌ర్ సాగుతుంది. అర‌వింద్ సుంద‌ర్‌, సంయుక్త కార్తిక్‌, న‌మితా కృష్ణ‌మూర్తి ఈ ఎపిసోడ్‌లో న‌టించారు.

సెకండ్ ఛాప్ట‌ర్- సీత‌

 సీత ఓ అంధురాలు. ఆత్మ‌స్థైర్యంతో త‌న‌కున్న‌ స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తూ జీవితంలో ముందుకు సాగుతుంటుంది. డ‌బ్బు కోసం సుంద‌ర్ ఆమెను పెళ్లిచేసుకుంటాడు. సీత‌ను అనుక్షణం ద్వేషిస్తుంటాడు. వారి జీవితంలోకి ల‌లిత వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగింది? సీత జీవితం ఏమైంద‌నేది హృద్యంగా ఈ ఎపిసోడ్‌లో తెరకెక్కించారు. వైక‌ల్యంతో బాధ‌ప‌డే వారిని చుల‌క‌న‌గా చూడొద్ద‌ని, వారిలో అస‌మాన ప్ర‌తిభ దాగి ఉంటుంద‌ని చెబుతూనే ఓ అంధురాలికి ఎదురైన క‌ష్టాల్ని, వేద‌న‌ను సీత పాత్ర ద్వారా ద‌ర్శ‌కురాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఎపిసోడ్ లో అమృతా శ్రీనివాస‌న్‌, అనంత్ నాగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఛాప్ట‌ర్ 3- రేఖ

 జీవితంలో ముంద‌డుగు వేయ‌డానికి ఉన్న‌త విద్య‌, అస‌మాన ప్ర‌తిభా పాట‌వాలు స‌రిపోవ‌ని ఆత్మ‌స్థైర్యం ఉండాల‌నే సందేశంతో ఈ ఎపిసోడ్‌ను రాసుకున్నారు. ఆనందానికి డ‌బ్బుతో సంబంధం ఉండ‌ద‌ని, మంచి మ‌న‌సుంటే స‌రిపోతుంద‌ని చెప్పారు. ఐఐటీలో చ‌దివిన సందీప్ స‌రైన ఉద్యోగం దొర‌క్క‌ప‌డే ఇబ్బందుల‌ను ఎమోష‌న‌ల్ గా దృశ్య‌మానం చేశారు. ప్రాణంగా ప్రేమించిన భార్య రేఖ అండ‌తో సందీప్ జీవితంలో ఎలా ఎదిగాడో చూపించారు. వివేక్ ప్ర‌స‌న్న‌, మేఘ‌రాజ‌న్ ఇందులో న‌టించారు.

నాలుగో ఛాప్ట‌ర్- అనంత్‌

హోమో సెక్సువ‌ల్స్ కు కుటుంబం, స‌మాజ‌ప‌రంగా ఎదుర‌య్యే వివ‌క్ష‌ను చూపిస్తూ నాలుగో ఎపిసోడ్ సాగుతుంది. పిల్ల‌ల స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకునే క్ర‌మంలో త‌ల్లిదండ్రులు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను చూపించారు. ప్ర‌కాష్ రాజ్‌, ఇంద్ర‌జ‌, మ్యాథ్యూ వ‌ర్గీస్‌, వినోద్ కిష‌న్‌, వివేక్ రాజ‌గోపాల్ ఈ ఎపిసోడ్‌లో న‌టించారు.

ఐదో ఛాప్ట‌ర్- కృష్ణ‌న్ మీన‌న్‌

అనంతం సిరీస్ లో ఫుల్ ఫ‌న్ తో సాగే ఎపిసోడ్ ఇది. 32 ఏళ్ల యువ‌కుడికి, న‌ల‌భై ఏళ్ల మ‌హిళ‌కు మ‌ధ్య మొద‌లైన ప్రేమ‌క‌థ‌తో ఆద్యంతం న‌వ్వుల‌ను పంచుతుంది. వినోదంతో పాటు ఒంట‌రి మ‌హిళ‌ల‌కు స‌మాజంలో ఎదుర‌య్యే అవ‌రోధాలు, అడ్డంకుల‌ను ఆలోచనాత్మకంగా దర్శకురాలు స్ర్కీన్ పై ప్రజెంట్ చేశారు. స‌రోజ‌, శైల‌జ, సుజాత జీవితాల్లోకి కృష్ణ‌మీన‌న్ ఎలా వ‌చ్చాడు? అత‌డు ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌న్న‌ది ఆక‌ట్టుకుంటుంది. ఆలోచ‌న‌ల‌కు అంద‌కుండా జ‌రిగే కొన్ని అంశాలు లైఫ్ ను ఎలా మార్చేస్తాయో ఈ ఎపిసోడ్ ద్వారా ద‌ర్శ‌కురాలు చెప్పారు. ల‌క్ష్మీ గోపాల‌స్వామి, జార్జ్ కోరా, వినోదిని ఇందులో ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు.

ఛాప్ట‌ర్ 6- ల‌లిత‌

 సీత ఛాప్ట‌ర్ కు కొన‌సాగింపుగా హార‌ర్ క‌థాంశంతో ల‌లిత ఎపిసోడ్ సాగుతుంది. త‌న మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ల‌లిత‌పై సీత ఎలా ప్ర‌తీకారం తీర్చుకుందో ఉత్కంఠ‌భ‌రితంగా ఈ ఎపిసోడ్‌లో చూపించారు. భ‌యం మ‌నిషి జీవితాన్ని ఎలా నాశ‌నం చేస్తుందో అర్థ‌వంతంగా చెప్పారు. అంజ‌లి రావ్‌, అభిషేక్ జార్జ్ ఇందులో న‌టించారు.

ఛాప్ట‌ర్ 7- పార్వ‌తి

 చైల్డ్ అబ్యూసింగ్ పాయింట్ తో ఈ ఎపిసోడ్ సాగుతుంది. ఆడ‌పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల్ని సందేశాత్మకంగా ప్రజెంట్ చేశారు. అన్న‌య్య ఫ్రెండ్‌ చేసిన ఓ ప‌ని కార‌ణంగా చిన్న‌త‌నం నుంచి పార్వ‌తి ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను మ‌న‌సుల్ని క‌ద‌లించేలా చెప్పారు ద‌ర్శ‌కురాలు. ఈ ఛాప్ట‌ర్ లో మిర్నామీన‌న్‌, క‌నిష్క‌, గోపాల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 

 ఛాప్ట‌ర్ 8- వెంక‌టేషం

త‌న కొడుకు అనంత్‌ను అపార్థం చేసుకున్న వెంక‌టేష్ లో ఎలా ప‌రివ‌ర్త‌న వ‌చ్చింద‌నే క‌థాంశంతో చివ‌రి ఎపిసోడ్ సాగుతుంది. మ‌నిషిలోని అంత‌రంగాన్ని, తాము న‌మ్మిన సిద్ధాంతాల్ని అమ‌లుచేసే క్ర‌మంలో మ‌నుషులు ప‌డే సంఘర్ష‌ణ‌ను ఈ ఎపిసోడ్ లో ఆలోచనాత్మకంగా ద‌ర్శ‌కురాలు తెరకెక్కించారు. 

ఎనిమిది ఎపిసోడ్స్ లో మూడు త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ అనాస‌క్తిగా సాగుతాయి. ఏ స‌మ‌స్య‌ను లోతుగా చెప్ప‌కుండా పైపైన ట‌చ్ చేస్తూ వెళ్లారు ద‌ర్శ‌కురాలు. చాలా చోట్ల ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ మిస్స‌యింది. సిరీస్ లోని ప్ర‌తి ఎపిసోడ్ ను నెమ్మ‌దిగా సాగ‌తీస్తూ న‌డిపించారు. నిడివి చాలా ఎక్కువైంది. రెండు మినహా మిగిలిన అన్ని ఎపిసోడ్స్ లో ప్ర‌కాష్‌రాజ్‌, సంప‌త్‌రాజ్ అతిథులుగానే కనిపిస్తారు. 

ప్ర‌కాష్‌రాజ్, సంప‌త్‌రాజ్ మిన‌హా తెలుగు వారికి సుప‌రిచితులైన న‌టీన‌టులు ఇందులో ఎవ‌రూ లేరు. ఈ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు వేరే వాళ్ల‌తో డ‌బ్బింగ్ చెప్పించారు. అది స‌రిగా కుద‌ర‌లేదు. మిగిలిన పాత్ర‌ధారుల డ‌బ్బింగ్ కూడా అలాగే ఉంది.

ఇప్ప‌టికే ఎన్నో సిరీస్‌లు, సినిమాల్లో చూసిన అంశాల‌ను ఇందులో చర్చించారు. కథలో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. ఓపిక‌, స‌హ‌నానికి ప‌రీక్ష‌గా ఈ సిరీస్ నిలుస్తుంది.

రేటింగ్- 2.75/5

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం