Oscars Crisis Team: విల్ స్మిత్ చెంప దెబ్బ ఎఫెక్ట్ - క్రైసిస్ టీమ్ ఏర్పాటు చేసిన ఆస్కార్ కమిటీ
24 February 2023, 14:05 IST
Oscars Crisis Team: 2022లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌ను హీరో విల్‌స్మిత్ చెంపదెబ్బ కొట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సారి అలాంటి ఘటనలు జరుగకుండా ఆస్కార్ కమిటీ క్రైసిస్ టీమ్‌ను ఏర్పాటుచేయబోతున్నది.
విల్ స్మిత్, క్రిస్ రాక్
Oscars Crisis Team: గత ఏడాది జరిగిన 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విల్ స్మిత్ చెంప దెబ్బ ఘటన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సారి అలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ఆస్కార్ కమిటీ క్రైసిస్ టీమ్‌ను ఏర్పాటుచేసింది. గత ఏడాది అవార్డులు ప్రదానం చేస్తోన్న సమయంలో విల్ స్మిత్ భార్యను ఉద్దేశించి కమెడియన్ క్రిస్ రాక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. వాటిని సీరియస్‌గా తీసుకున్న విల్ స్మిత్ స్టేజ్‌పైనే క్రిస్‌రాక్ చెంపపై గట్టిగా కొట్టాడు.
ఈ చెంప దెబ్బ కారణంగా ఆస్కార్ కమిటీకి విల్ స్మిత్ రాజీనామా చేయాల్సివచ్చింది. లైవ్‌లోనే ఈ సంఘటన జరగడంతో ఆస్కార్ నిర్వహకులపై విమర్శలొచ్చాయి. ఈ చెంపదెబ్బ వల్ల గత ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేడుకల రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఎలాంటి అవాంఛిత పరిణామాలు చోటుచేసుకోకుండా ఆస్కార్ కమిటీ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రత్యేకంగా క్రైసిస్ టీమ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్లు ఆస్కార్ సీఈవో బిల్ కర్మార్ ప్రకటించాడు. అనివార్య ఘటనలు జరగకుండా చూడటమే కాకుండా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తక్షణమే స్పందించేలా ఈ క్రైసిస్ టీమ్ పనిచేస్తోందని బిల్ కర్మార్ పేర్కొన్నాడు.
వేడుకలోనే క్రైసిస్ టీమ్ భాగం అవుతూ సక్రమంగా అవార్డుల నిర్వహణ జరిగేలా పనిచేస్తోందని బిల్ కర్మార్ అన్నాడు.ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల వేడుక మార్చి 12న జరుగనుంది. ఇండియా నుంచి ఆస్కార్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయ్యింది.
టాపిక్