తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Miryalaguda: మిర్యాలగూడ త్రిముఖ పోటీలో గట్టెక్కేది ఎవరు..?

Miryalaguda: మిర్యాలగూడ త్రిముఖ పోటీలో గట్టెక్కేది ఎవరు..?

HT Telugu Desk HT Telugu

27 November 2023, 9:59 IST

    • Miryalaguda: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. మిర్యాలగూడ ఎన్నికల్లో  ఈ దఫా ఎవరు గెలుపొందుతారనే ఉత్కంఠ అన్ని పార్టీల్లో నెలకొంది.
మిర్యాలగూడలో త్రిముఖ పోటీ
మిర్యాలగూడలో త్రిముఖ పోటీ

మిర్యాలగూడలో త్రిముఖ పోటీ

Miryalaguda: నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతంలో విస్తరించి ఉన్న మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ రికార్డు ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2018 ఎన్నికల వరకు ఆ పార్టీకి దక్కని కొన్ని అసెంబ్లీ సీట్లలో మిర్యాలగూడ కూడా ఒకటి.

అయితే కాంగ్రెస్, లేదంటే వామపక్షాలు అన్న తరహాలోనే ఇక్కడ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చివరకు అధికార బీఆర్ఎస్ కూడా పార్టీ పుట్టిన నాటి నుంచి మిర్యాలగూడలో ఒకే ఒక సారి 2018 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది.

2023 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్.భాస్కర్ రావు, సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నుంచి మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న బత్తుల లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. బరిలో బీజేపీ, బీఎస్సీ తదితర పార్టీలున్నా ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొనడంతో త్రిముఖ పోటీ కనిపిస్తోంది.

అయితే కాంగ్రెస్ .. లేదంటే సీపీఎం

1952 తొలి ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నిక సహా 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఎనిమిది విజయాలు సాధించగా దాదాపు సమ ఉజ్జీగా నిలిచిన సీపీఎం అయిదు సార్లు, పీడీఎఫ్ సాధించిన రెండు విజయాలను కలుపుకుంటే కమ్యూనిస్టులు ఏడు సార్లు ఇక్కడ గెలిచారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరింది. అంటే 1952 నుంచి 2014 ఎన్నికల వరకు అయితే కాంగ్రెస్ లేదంటే సీపీఎంలు మాత్రమే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇతర ఏ పార్టీకీ స్థానం దక్కలేదు. 1952 తొలి ఎన్నికల్లో పీడీఎఫ్ గెలిచింది. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఈ స్థానం కాంగ్రెస్ వశమైంది.

1957 ఎన్నికల్లో పీడీఎఫ్ మరో మారు ఈ సీటును దక్కించుకుంది. 1962, 1967, 1972 వరస ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తిప్పన చిన క్రిష్ణారెడ్డి వరస విజయాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. 1978లో తిరిగి సీపీఎం ఇక్కడ గెలిచింది. ఆ పార్టీ తరపున అరిబండి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ మరుసటి ఎన్నికల్లో సీపీఎం ఓటమి పాలు కాగా, కాంగ్రెస్ నుంచి చకిలం శ్రీనివాస రావు గెలిచారు. 1985 ఎన్నికల్లో సీపీఎం తన స్థానాన్ని మళ్లీ దక్కించుకుంది. అరిబండి లక్ష్మీనారాయణ రెండో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంది. ఆ ఎన్నికల్లో తిప్పన విజయ సింహారెడ్డి గెలిచారు.

1994 ఎన్నికల్లో మాత్రం సీపీఎం కాంగ్రెస్ నిరాశ ఎదురు కాగా, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి తొలి సారి ఎమ్మెల్యేగా విజయాన్ని నమోదు చేశారు. కానీ, ఆ మరుసటి 1999 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి రేపాల శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, 2004, 2009 వరస ఎన్నికల్లో సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి రెండు సార్లూ గెలిచి, మొత్తంగా మూడు విజయాలను తన పేరున నమోదు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మరో మారు గెలిచింది. ఆ పార్టీ తరపున ఎన్.భాస్కర్ రావు గెలిచారు. కానీ, కొన్నాళ్లకే ఆయన కాంగ్రెస్ ను వీడి గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో 2018లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ ఒక్క సారి మాత్రమే మిర్యాలగూడలో కాంగ్రెస్, సీపీఎంలు కాకుండా మూడో పార్టీ గెలవడం.

త్రిముఖ పోరుతో .. హోరా హోరీ

ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. బీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్ ఈ సారి విజయం సాధించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉన్న నాయకుడు. నియోజకవర్గంలో సీపీఎం అనుబంధ కార్మిక సంఘం సీఐటీయూ నాయకునిగా, సీపీఎం నేతగా, ఉద్యమకారునిగా, ఎమ్మెల్యేగా పేరున్న జూలకంటి ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఏ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగుతున్న సీపీఎం తన సంప్రదాయ ఓటు బ్యాంకును, యువత, కార్మికుల ఓట్లను నమ్ముకుంది. మరో వైపు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్.భాస్కర్ రావు ఒక సారి కాంగ్రెస్ నుంచి, మరో సారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన అనుభవం ఉన్న నాయకుడు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివ్రుద్ధి కార్యక్రమాలపై ఆశ పెట్టుకున్నారు.

నాగార్జున సాగర్ ఆయకట్టు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి ఓటర్లలో సింహభాగం రైతులదే. రైతు బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలు తను అనుకూలమన్న అంచనాలో ఉన్నారు. పెన్షనర్లు, ఇతరత్రా జరిగిన పనులపై ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించాలని పనిచేసుకుంటున్నారు.

ఏఐసీసీ నాయకత్వం చివరి నిమిషయం వరకు అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చకుండా పెండింగ్ లో పెట్టిన స్థానాల్లో మిర్యాలగూడ ఒకటి. చివరకు బత్తుల లక్ష్మారెడ్డికే టికెట్ దక్కినా.. పార్టీలోని ఒక వర్గం ఆయన వెనుక గోతులు తవ్వుతోందని, శల్య సారథ్యం చేస్తోందన్న అభిప్రాయం ఉంది.ః

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు, కరోనా సమయం నుంచి వ్యక్తిగతంగా నియోజకవర్గ వ్యాప్తంగా తాను చేపట్టిన వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో వచ్చిన గుర్తింపు సానుభూతి ఓటుగా తనకు కలిసి వస్తుందన్న నమ్మకంతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. ఇక, బీజేపీ, బీఎస్సీలు పోటీలో ఉన్నా అవి నామమాత్రపు పోటీకే పరిమితం కానున్నాయి. మొత్తంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో జరుగుతున్న త్రిముఖ పోటీపై ఆసక్తి కనిపిస్తోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

తదుపరి వ్యాసం