తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Assembly Elections : సొంతూరులో చుక్కెదురు.. ఓటు వేయలేకపోయిన తమ్మినేని

Telangana Assembly Elections : సొంతూరులో చుక్కెదురు.. ఓటు వేయలేకపోయిన తమ్మినేని

HT Telugu Desk HT Telugu

30 November 2023, 21:26 IST

    • Telangana Assembly Elections 2023: పాలేరు సీపీయం ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని వీరభద్రానికి చుక్కెదురైంది. తన సొంతూరు తెల్దారుపల్లిలో ఓటు వేయలేకపోయారు.
సీపీయం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సీపీయం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సీపీయం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Telangana Assembly Elections 2023: రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కు సొంత ఊరిలోనే చుక్కెదురైంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా పోటీలో నిలిచిన తమ్మినేని తన సొంతూరు తెల్దారుపల్లిలో ఓటు వేయలేకపోయారు.

గతంలో హైదరాబాద్‌ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకునేవారు. కాగా తమ్మినేని ఇటీవల తన ఓటును సొంతూరు అయిన ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి మార్చుకున్నారు. అయితే ఓటు బదిలీ అయినట్లు భావించిన ఆయన గురువారం పోలింగ్ రోజున ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఓటరు జాబితాలో పేరు పరిశీలించిన అధికారులు ఓటు వినియోగానికి ఇబ్బందికర పరిస్థితిని గమనించారు. హైదరాబాద్ నుంచి తమ్మినేని ఓటు మార్చుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఓటు బదిలీ కానట్లు తెలుస్తోంది. గుర్తింపు కార్డులో అడ్రస్‌ మారినప్పటికీ నియోజకవర్గం మారకపోవడంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకపోయింది. ఈ పరిణామంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా, పాలేరు నియోజకవర్గ సీపీఎం అభ్యర్థిగా ఉన్న తమ్మినేని వీరభద్రం నిర్ఘాంతపోయారు. దీంతో చేసేదేమీ లేక ఆయన ఓటేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీకి నిలిచారు. కాంగ్రెస్ తో సీపీఎంకు పొత్తు కుదరని పక్షంలో సీపీఎం రాష్ట్రంలోని 19 స్థానాల్లో పోటీకి దిగింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన తమ్మినేని పాలేరు బరిలో పోటీ చేశారు. అయితే పోటీలో ఉన్న ఆయనే ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి చర్చకు దారితీసింది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం