తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tammineni Lost Deposits: డిపాజిట్ కోల్పోయిన తమ్మినేని వీరభద్రం

Tammineni lost Deposits: డిపాజిట్ కోల్పోయిన తమ్మినేని వీరభద్రం

HT Telugu Desk HT Telugu

04 December 2023, 11:42 IST

    • Tammineni lost Deposits:  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. పాలేరులో ఆయనకు 5,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Tammineni lost Deposits: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 57,231 ఓట్ల భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పై ఘన విజయం సాధించారు.

పాలేరులో తమ్మినేనికి కేవలం 5,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయనకు డిపాజిట్ ఓట్లు కూడా దక్కలేదు. తొలుత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పావులు కదిపిన సీపీఎం ఆ పార్టీలో అభ్యర్థుల నియామకంలో జాప్యం నెలకొన్న నేపధ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు.

దీంతో నిర్దేశించిన సమయానికి కాంగ్రెస్ లో అభ్యర్థుల సర్దుబాటు ఇంకా పూర్తి కాకపోయేసరికి తమ్మినేని ఒక అడుగు ముందుకేసి సొంతంగా బరిలోకి దిగాలనే ఆలోచన చేశారు. దీంతో ఖమ్మంలోని పాలేరు, భద్రాచలం, అశ్వారావుపేట, మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, ఖమ్మం స్థానాలతో పాటు రాష్ట్రంలో మొత్తం 19 చోట్ల అభ్యర్థులను పోటీకి నిలిపారు.

ఈ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో పాటు సీపీఎం తరపున పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థికి కూడా గౌరవప్రదమైన ఓట్లు లభించకపోవడం గమనార్హం.

సొంత ఊరిలోనూ ఘోర పరాభవం..

సాంకేతిక లోపం కారణంగా స్వగ్రామమైన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వీరభద్రం ఆ ఊరిలో ఓట్ల వేటలోనూ ఘోర పరాభావాన్ని చవిచూశారు.

ఆ గ్రామంలో మొత్తం 3,325 ఓట్లు ఉండగా 3,150 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2,030 ఓట్లను దక్కించుకుని గ్రామంలో మేజర్ ఓట్లను సాధించగలిగారు. సీపీఎం తరపున పోటీకి నిలిచిన తమ్మినేనికి 665 ఓట్లు మాత్రమే దక్కాయి.

ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి 246 ఓట్లు పడ్డాయి. కాగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడంతో పాటు సొంత ఊరిలోనూ పరాభావాన్ని చవిచూడటం చర్చనీయాంశంగా మారింది.

సీపీఎంకు 19 స్థానాల్లో వచ్చిన ఓట్లు..

1.పాలేరు - 5308

2. భద్రాచలం - 5860

3. అశ్వారావుపేట - 2488

4. మధిర - 6575

6. మిర్యాలగూడ - 3234

7. నకిరేకల్ - 3238

8. నల్గొండ - 1439

9. సత్తుపల్లి - 1210

10. వైరా - 4439

11.ఇల్లందు -2137

12. బోనగిరి - 1315

13.హుజూర్ నగర్ - 1914

14. జనగాం - 1765

15. ఇబ్రహీంపట్నం - 3948

16.పటాన్ చెర్వు - 1158

17. మునుగోడు - 2351

18. కోదాడ - 1195

19. ఖమ్మం - 1940

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం