తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cpm : ఆ ఏడు స్థానాల్లోనే సీపీఎం పోటీ ఎందుకంటే?

CPM : ఆ ఏడు స్థానాల్లోనే సీపీఎం పోటీ ఎందుకంటే?

HT Telugu Desk HT Telugu

08 November 2023, 20:17 IST

    • CPM : కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి నల్గొండ సీపీఎం 7 స్థానాల్లో పోటీ చేస్తుంది. అయితే ఈ స్థానాల్లో పోటీ వ్యూహాత్మమే అంటున్నారు విశ్లేషకులు.
సీపీఎం
సీపీఎం

సీపీఎం

CPM : తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు సగం మాత్రమే కొలిక్కి వచ్చినట్లు లెక్క. వామపక్ష పార్టీల్లోని సీపీఐ పొత్తులో భాగంగా ఒక్క సీటుతో రాజీపడి కాంగ్రెస్ తో కలిసి నడవనుంది. మరో వామపక్షం సీపీఎం మాత్రం ఒటరిగానే బరిలోకి దిగుతోంది. అత్యధికంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఖమ్మం జిల్లా వైరా, నల్గొండ జిల్లా మిర్యాలగూడెం సీట్లను పొత్తులో భాగంగా సీపీఎం కోరినా కాంగ్రెస్ ఎటూ తేల్చలేదు. చివరకు ఒక్క సీటు కూడా ఇస్తారా? ఇచ్చినా సహకరించి కాంగ్రెస్ ఓటు సీపీఎంకు ట్రాన్స్ఫర్ అయ్యేలా చూస్తారా? అన్న విశ్వాసం లేకనే సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధమైందని చెబుతున్నారు. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలను సీపీఎం 7 చోట్ల పోటీ చేస్తోంది.

ఏడు చోట్లనే ఎందుకు?

నల్గొండ జిల్లాలో సీపీఎం పోటీ చేయనున్న ఏడు నియోజకవర్గాలను వ్యూహాత్మకంగానే ఎంచుకుందని ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. భువనగిరి, మునుగోడు, మిర్యాలగూడెం, నల్గొండ, నకిరేకల్, హుజూర్ నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు కుదరకుండా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా బహిరంగంగా స్టేట్ మెంట్స్ ఇచ్చిన నాయకులు, పొత్తుల చర్చల్లో సైతం వామపక్షాలతో పొత్తు కుదిరితే, వారికి కేటాయించే సీట్లలో ఓడిపోతామని, పొత్తు అవసరం లేదని పట్టుపట్టిన నాయకులు నల్గొండ జిల్లా నుంచే ఉన్నారని సీపీఎం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే ఇలాంటి స్థానాల్లో పోటీ చేయడంతో పాటు తాము గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో తమకు ఎంత బలం ఉందో తేల్చుకోవడంలో భాగంగానే ఆయా స్థానాల్లో పోటీలో ఉన్నట్లు చెబుతున్నారు.

భువనగిరి

భువనగిరిలో ఉమ్మడి కమ్యూనిస్టులుగా ఉన్నప్పుడే రెండు సార్లు పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. సీపీఎం గతంలోనూ భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో నియోజకవర్గాల్లో మెరుగైన ఓట్లను సాధించింది. జిల్లా కేంద్రం కావడం కూడా పోటీ చేయడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

మునుగోడు

మునుగోడు నియోజకవర్గంలో సీపీఎం గతంలో పోటీ చేసి పదివేల పైచిలుకు ఓట్లను సాధించింది. వాస్తవానికి ఇక్కడి నుంచి అయిదు సార్లు సీపీఐ ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా, ఆ పార్టీని ఓడించే లక్ష్యంతో బీఆర్ఎస్ తో జతకట్టాయి. కానీ, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తుల అంశం తేల్చకుండానే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఒక వేళ ఇక్కడ సీపీఐ పోటీ చేసి ఉంటే సహ వామపక్షంగా వారికి సహకరించే వారమని, కానీ, కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో మునుగోడులో పోటీలో ఉన్నట్లు చెబుతున్నారు.

నల్గొండ

నల్గొండ నియోజకవర్గంలో సీపీఎం గతంలో ఓ సారి ప్రాతినిధ్యం వహించింది. నంద్యాల నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సీపీఎంకు పట్టుంది. దీంతో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పోటీకి దిగింది. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆ పార్టీ తరుపున పోటీలో ఉన్నారు.

మిర్యాలగూడెం

మిర్యాలగూడెం నియోజకవర్గం నుంచి సీపీఎం పలు మార్లు ఎమ్మెల్యే పదవులు నిర్వహించింది. అరిబండి లక్ష్మీనారాయణ రెండు సార్లు, జూలకంటి రంగారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తంగా 5 పర్యాయాలు సీపీఎం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో సీపీఎం బలం కలిగి ఉంది. ఈ కారణంగానే కాంగ్రెస్ తో జరిగిన పొత్తు చర్చల్లో సీపీఎం ఈ సీటు కోసం పట్టుబట్టింది. ఈ సీటు దగ్గరే పొత్తు కూడా ఎత్తిపోయింది. ఈ కారణంగానే మిర్యాలగూడెంలో తమ పట్టు ఏ పాటితో చూపెట్టే కసితో సీపీఎం ఉంది.

హుజూర్ నగర్

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఇపుడున్న మండలాల్లో మేళ్ల చెరువు మినహా మఠంపల్లి, హుజూర్ నగర్, గరిడేపల్లి, నేరెడుచర్ల గతంలో మిర్యాలగూడెం నియోజకవర్గం పరిధిలో ఉన్నవే. ఇక్కడ సీపీఎం బలం కలగి ఉంది. మరో వైపు పొత్తుకు వ్యతిరేకంగా ఉన్న టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. దీంతో తమ బలం ఏంటో చూపించాల్సేందనన్న పట్టుదలతో సీపీఎం ఉంది. ఆ పార్టీ నుంచి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ పోటీకి దిగుతున్నారు.

కోదాడ

కోదాడ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసి గౌరవ ప్రదమైన స్థాయిలో ఓట్లు సాధించిన సీపీఎం ఈ సారి కూడా పోటీ చేయాలని బరిలోకి దిగుతోంది. పోటీ విషయంలో మొదట కొంత ఊగిసలాట కనిపించినా..చివరకు తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఇక్కడ టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులకు షాకివ్వడం, తమ బలాన్ని నిరూపించుకునే ఉద్దేశంతో పోటీ చేస్తున్న స్థానాల్లో కోదాడ కూడా ఒకటి.

నకిరేకల్

నకిరేకల్ నియోజకవర్గం సీపీఎంకు ఒక విధంగా పెట్టని కోట. ఇక్కడి నుంచి నర్రా రాఘవరెడ్డి ఆరు సార్లు, నోముల నర్సింహయ్య రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. 2009 లో జరిగిన పునర్విభజనలో నకిరేకల్ ఎస్సీలకు రిజర్వు కావడంతో అప్పటి నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తమకు కంచుకోటలాంటి నకిరేకల్ లో ఇపుడు తమ బలాన్ని అంచనా వేసుకునే పనిలో సీపీఎం ఉంది. ఈ అంశాలన్నింటి కారణంగానే సీపీఎం జిల్లాలో ఏడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా భావించి ఎంచుకుని మరీ ఎన్నికల గోదాలోకి దిగుతోందని అభిప్రాయం పడుతున్నారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

తదుపరి వ్యాసం