తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mlas Disqualification: ఎన్నికల వేళ ఏపీలో 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. స్పీకర్ కీలక నిర్ణయం

MLAs Disqualification: ఎన్నికల వేళ ఏపీలో 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. స్పీకర్ కీలక నిర్ణయం

Sarath chandra.B HT Telugu

27 February 2024, 5:48 IST

    • MLAs Disqualification: మరికొద్ది రోజుల్లో  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఏపీ స్పీకర్ Assembly speaker కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగున్నరేళ్లుగా సాగదీసి ఎట్టకేలకు నిర్ణయం వెలువరించారు. 
స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం
స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం

స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం

MLAs Disqualification: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు మారిన 8 మంది రెబల్‌ Rebel MLAs ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై విచారణ చేపట్టి, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ TDPనుంచి వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. మద్దాల గిరి, కరణం బలరామ్‌, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌‌లపై టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పలుమార్లు విచారణ జరపిన స్పీకర్ తమ్మినేని ఇటీవల విచారణ ముగించిన అనర్హత వేటు వేశారు.

ఎన్నికల షెడ్యూలు వెలువడుతున్న సమయంలో స్పీకర్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీ టికెట్‌‌పై గెలిచిన నలుగురు, వైసీపీ YCP తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురిపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు.

సోమవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. టీడీపీ ఫిర్యాదు మేరకు వాసుపల్లి గణేశ్‌, మద్దాలి గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీపై... వైసీపీ ఫిర్యాదు మేరకు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేలుగా అనర్హులని తెలిపారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించి ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధులకు ఓటేశారని, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వ్యవహరిస్తున్నారంటూ స్పీకర్‌కు తెలుగుదేశం విప్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఎం.ప్రసాదరాజు గతంలోనే ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులపై ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా స్పీకర్‌ సీతారాం నోటీసులు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామ నారాయణ రెడ్డి రెండుసార్లు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఒకసారి స్పీకర్‌ ముందు హాజరయ్యారు. నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

కరణం బలరాం ఒక సారి స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. టీడీపీ తరపున గెలిచిన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి స్పీకర్‌ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాలేదు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇరు పార్టీలు బలమైన సాక్ష్యాధారాలు సమర్పించాయని, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న అనంతరం తన నిర్ణయం వెలువరిస్తానని స్పీకర్‌ ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 8 మందిపై అనర్హత వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాజ్యసభ ఎన్నికలతో అనర్హతపై కదలిక…

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో కదలిక వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో స్పీకర్‌ పలుమార్లు విచారణ చేపట్టారు. ఎన్నికల్లో తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో టీడీపీఅభ్యర్ధి పోటీకి దిగకపోవడంతో మూడు స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఆ తర్వాత అనర్హత పిటిషన్ల వ్యవహారం సద్దుమణిగిందని భావించారు.

ఇరు పార్టీల నుంచి ఫిర్యాదులు అందినా చాలా రోజుల పాటు వీటిని పెండింగ్‌లో పెట్టారు. దాదాపు నాలుగున్నరేళ్లుగా ఇరు పార్టీల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదులు అందినా వాటిపై ఎలాంటి చర్యలు లేవు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన ఎనిమిది మందిపై అనర్హత వేటు వేశారు. దీని ప్రభావం ఎమ్మెల్యేలపై పెద్దగా ఉండదని, విచారణ జరిపి వదిలేశారనే అపవాదు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం