తెలుగు న్యూస్  /  బిజినెస్  /  15 Rupees Per Litre Petrol: ‘ఇలా చేస్తే.. లీటర్ పెట్రోలు ధర 15 రూపాయలకు తగ్గుతుంది’: నితిన్ గడ్కరీ సూచన

15 rupees per litre Petrol: ‘ఇలా చేస్తే.. లీటర్ పెట్రోలు ధర 15 రూపాయలకు తగ్గుతుంది’: నితిన్ గడ్కరీ సూచన

HT Telugu Desk HT Telugu

05 July 2023, 12:58 IST

  • పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారుల జేబులకు చిల్లులు పెడుతున్న తరుణంలో.. పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపునకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక సూచన చేశారు. సగటున 60% వాహనాలు ఇథనాల్ పై, 40% వాహనాలు విద్యుత్ పై నడిచే పరిస్థితి వస్తే, పెట్రోలు ధర లీటరుకు రూ. 15 లకు పడిపోతుందని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశముందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇథనాల్ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని, అదే సమయంలో ఇథనాల్ వాహనాల సంఖ్య పెరిగి పెట్రోలు ధర కూడా తగ్గుతుందని వివరించారు.

60శాతం ఇథనాల్, 40% విద్యుత్

భవిష్యత్తులో సగటున 60% వాహనాలు ఇథనాల్ పై, 40% వాహనాలు విద్యుత్ పై నడిచే పరిస్థితి వస్తే, పెట్రోలు ధర లీటరుకు రూ. 15 లకు పడిపోతుందని గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇథనాల్ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు. అలాగే, దానివల్ల వాహనాలతో వచ్చే వాయు కాలుష్యం తగ్గుతుందని, దిగుమతుల భారం తగ్గుతుందని వివరించారు. రాజస్తాన్ లోని ప్రతాప్ గఢ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన దిగుమతుల కోసం భారత్ వెచ్చిస్తున్న సుమారు రూ. 16 లక్ష ల కోట్లు ఆదా అవుతాయని, అవి రైతన్నల ఆదాయంగా మారుతాయని విశ్లేషించారు.

అన్నదాత మాత్రమే కాదు విద్యుత్ దాత కూడా..

రైతులను అన్నదాతలుగానే కాకుండా, విద్యుత్ దాత (energy providers) లుగా కూడా మార్చాలన్నది కేంద్రంలోని తమ ప్రభుత్వ ఆలోచన అని వివరించారు. ప్రతాప్ గఢ్ లో రూ. 5600 కోట్ల విలువైన 11 జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణ పనులను బుధవారం గడ్కరీ ప్రారంభించారు. భవిష్యత్తులో పూర్తిగా ఇథనాల్ తో నడిచే వాహనాలు వస్తాయని, ఈ దిశగా వాహన ఉత్పత్తి సంస్థలు పని చేస్తున్నాయని గడ్కరీ వివరించారు. దీనిపై తాను గతంలో బెంజ్, హీరో మోటోకార్ప్, మారుతి, బజాజ్, టీవీఎస్ సంస్థలతో కూడా చర్చించానన్నారు. ఈ ఆగస్ట్ నెలలో టొయోటా సంస్థ ఉత్పత్తి చేయనున్న కామ్రి (camry) కారును తాను లాంచ్ చేయబోతున్నానని, ఆ కారు పూర్తిగా 100% ఇథనాల్ పై నడుస్తుందని, అంతేకాదు, ఆ కారు 40% విద్యుత్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తుందని గడ్కరీ వివరించారు. అలా, ఇథనాల్ ను ఉత్పత్తి చేసే రైతు విద్యుత్ దాతగా కూడా మారుతాడన్నారు.

తదుపరి వ్యాసం