తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Play Store: భారత్ మాట్రిమొనీ సహా 10 ఫేమస్ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్; ఎందుకంటే..?

Google Play Store: భారత్ మాట్రిమొనీ సహా 10 ఫేమస్ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్; ఎందుకంటే..?

HT Telugu Desk HT Telugu

02 March 2024, 16:39 IST

  • భారత్ కు చెందిన 10 ప్రముఖ యాప్స్ ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇది వివాదానికి దారి తీసింది. పేమెంట్స్ నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలపై ఆ 10 యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. దీనిపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్స్ తొలగింపు
గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్స్ తొలగింపు (Pixabay)

గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్స్ తొలగింపు

Google removes Indian apps: భారత్ మ్యాట్రిమోనీ (Bharat Matrimony), ఇన్ఫో ఎడ్జ్ కు చెందిన 99 ఎకర్స్ (99acres), నౌకరీ. కామ్ (Naukri.com) వంటి పాపులర్ యాప్స్ సహా మొత్తం 10 భారతీయ మొబైల్ అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇన్-యాప్ లావాదేవీలపై తాము విధించిన సర్వీస్ ఫీజు చెల్లించే విషయంలో ఆ యాప్స్ నిబంధనలను ఉల్లంఘించాయని గూగుల్ ఆరోపిస్తోంది.

భారతీయ ప్లే స్టోర్

గూగుల్ తీసుకున్న నిర్ణయంపై ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్ చందానీ ఘాటుగా స్పందించారు. భారత్ కే ప్రత్యేకమైన ప్లే స్టోర్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడి మార్కెట్ పై ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్ ప్లే స్టోర్ కు పోటీగా 'డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ 'లో భాగంగా భారతీయ మొబైల్ అప్లికేషన్ స్టోర్ ను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మూడేళ్ల సమయం ఇచ్చినా..

ఈ చెల్లింపు నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో జీవన్ సాథీ, Matrimony.com వంటి కొన్ని ప్రముఖ సైట్ల యాజమాన్య సంస్థలకు గూగుల్ నోటీసులు జారీ చేసింది. ఇన్ యాప్ లావాదేవీలకు సంబంధించిన పేమెంట్ నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ గూగుల్ వారిపై చర్యలు ప్రారంభించింది. తమ ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుంటూ కూడా.. భారతదేశంలోని 10 ప్రముఖ కంపెనీలు అవసరమైన ఫీజులను చెల్లించలేదని, వారికి 3 సంవత్సరాల గడువు ఇచ్చినా, ఆ సంస్థలు సానుకూలంగా స్పందించలేదని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.

ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ లను గూగుల్ ఎందుకు తొలగిస్తోంది?

ఇన్-యాప్ చెల్లింపులపై గూగుల్ 11-26 శాతం సర్వీస్ ఫీజు విధిస్తోంది. దీనిపై భారతీయ స్టార్టప్ ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్-యాప్ చెల్లింపులపై 11-26 శాతం వసూలు చేసే వ్యవస్థను తొలగించాలని భారత్ లోని సంబంధిత అధికారులు గతంలో గూగుల్ ను ఆదేశించారు.కానీ గూగుల్ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పు సహా రెండు కోర్టు తీర్పులు గూగుల్ కు అనుకూలంగా వచ్చాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లోని ఈ కోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ సంస్థలపై గూగుల్ చర్యలు తీసుకుంది. ఫీజుల చెల్లింపు వ్యవహారాల్లో స్టార్టప్ లకు ఊరట కల్పించాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు తెలిపింది. ఈ కోర్టు తీర్పుల తర్వాత గూగుల్ ఫీజు వసూలు చేయడానికి లేదా యాప్స్ ను తొలగించడానికి అనుమతి పొందింది.

ఈ యాప్స్ డిలీట్

ప్లే స్టోర్ నుంచి గూగుల్ డిలీట్ చేసిన యాప్స్ లో భారత్ మ్యాట్రిమోనీ (Bharat Matrimony), ఇన్ఫో ఎడ్జ్ కు చెందిన 99 ఎకర్స్ (99acres), నౌకరీ. కామ్ (Naukri.com), Shaadi.com, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్ క్వాక్వాక్, స్టేజ్, ఆల్ట్ బై బాలాజీ టెలీఫిల్మ్స్, కుకు ఎఫ్ఎం మొదలైనవి ఉన్నాయి. గూగుల్ తీసుకున్న చర్యలపై Matrimony.com వ్యవస్థాపకుడు మురుగవేల్ మాట్లాడుతూ భారత ఇంటర్నెట్ కు ఇది చీకటి రోజు అన్నారు. 'మా యాప్స్ ఒక్కొక్కటిగా డిలీట్ అవుతున్నాయి. అంటే టాప్ మ్యాట్రిమోనీ సర్వీసులన్నీ డిలీట్ అవుతాయి’ అన్నారు.

తదుపరి వ్యాసం