తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pg Medical Seats Issue: ఏపీలో పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సందిగ్ధం, నకిలీ అనుమతులపై దర్యాప్తు

PG Medical Seats Issue: ఏపీలో పీజీ మెడికల్ సీట్ల భర్తీపై సందిగ్ధం, నకిలీ అనుమతులపై దర్యాప్తు

HT Telugu Desk HT Telugu

07 September 2023, 11:57 IST

    • PG Medical Seats Issue: పీజీ మెడికల్ సీట్ల భర్తీలో నకిలీ అనుమతుల వ్యవహారం వెలుగు చూడటంతో సీట్ల భర్తీపై ప్రతిష్టంభన నెలకొంది. హెల్త్ యూనివర్శిటీ తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయొద్దని విద్యార్ధులకు సూచించింది. 
పీజీ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంలో ప్రతిష్టంభన
పీజీ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంలో ప్రతిష్టంభన

పీజీ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంలో ప్రతిష్టంభన

PG Medical Seats Issue: ఏపీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ పేరిట నకిలీ అనుమతులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా సీట్లను పెంచుకునేలా నకిలీ ఉత్తర్వులు వెలుగు చూడటంతో యూనివర్శిటీ మొత్తం ప్రక్రియ రద్దు చేయాలని యోచిస్తోంది. మరోవైపు మేనేజ్‌మెంట్‌ కోటాలో అడ్మిషన్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేయొద్దని హెల్త్ యూనివర్శిటీ సూచించింది. వరుసగా పలు కాలేజీల్లో నకిలీ అనుమతులు వెలుగు చూడటంతో మొత్తం అడ్మిషన్ల ప్రక్రియను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో రివైజ్డ్‌ ఫేజ్‌ -1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు అయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయవద్దని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది.

రాజమండ్రిలోని జీఎస్‌ఎల్‌ కళాశాలలో ఎండీ- రేడియో డయగ్నోసిస్‌ కోర్సులో 14 సీట్లకు నకిలీ అనుమతులు జారీ అయినట్లు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ప్రకటించింది. మేనేజ్మెంట్‌ కోటా అడ్మిషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. విశ్వవిద్యాలయం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసే వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయొద్దని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి సూచించారు. ఇప్పటికే కళాశాలల్లో రిపోర్ట్‌ చేసిన వారు , చేయని విద్యార్థులు యూనివర్శిటీ నుంచి జారీ చేసే తదుపరి ఉత్తర్వుల కోసం వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలని రిజిస్ట్రార్ సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శాంతీరామ్, విజయనగరం జిల్లా మహారాజా, తూర్పుగోదావరి జిల్లా జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలల్లో నకిలీ అనుమతులతో పీజీ సీట్లు పెంచినట్లు ఇప్పటికే వెలుగు చూసింది. దీంతో ఆగష్టులో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఎన్‌ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని మొదటి నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించి సోమవారం విద్యార్ధులకు సీట్లు కేటాయించింది. మంగళవారం మరో 14 సీట్లకు జీఎస్‌ఎల్‌ కాలేజీలో నకిలీ అనుమతులు ఉన్నాయంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది.

పీజీ మెడికల్ సీట్ల వ్యవహారంపై స్పష్టత కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. ఎన్‌ఎంసీ నుంచి వివరణ వచ్చాక అడ్మిషన్లపై రి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ అనుమతులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎన్‌ఎంసీ సమాచారమిచ్చిందని తెలిపారు. ఈ కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశామన్నారు. మరో వైపు నకిలీ అనుమతుల అంశంపై మూడు కళాశాలలకు విశ్వవిద్యాలయం వీసీ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌ కళాశాలలో రేడియో డయాగ్నసిస్‌ కోర్సులో 10కి బదులు 24 సీట్లను కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన అనుమతులు నకిలీవని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ కోర్సులో సీట్ల పెంపునకు జీఎస్‌ఎల్‌ కళాశాల యాజమాన్యం నుంచి తమకు దరఖాస్తే రాలేదని తెలిపింది. 2023 మార్చి 24న జారీ చేసిన అనుమతి పత్రాన్ని (ఎల్‌వోపీ) జత చేసింది. తాజా పరిణామాలతో పీజీ వైద్య విద్యలో ప్రైవేటు కళాశాలల్లో రెండో కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితి దిక్కుతోచకుండా తయారైంది.

తొలివిడత మాదిరే రెండో విడత కౌన్సెలింగ్‌లో చేపట్టిన సీట్ల కేటాయింపును రద్దు చేస్తారని చెబుతున్నారు. గత వారం వరకు నంద్యాలలోని శాంతారామ్‌ వైద్య కళాశాలకు 50, రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలకు 63, విజయనగరంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు 23 చొప్పున సీట్లు కేటాయించినట్లు నకిలీ ఎల్‌వోపీలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఎన్‌ఎంసీ అధికారులు దిల్లీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మరోవైపు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం ఆధారంగానే సీట్లు పెరిగినట్లు జిఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ చెబుతోంది. సమస్య నేషనల్ మెడికల్ కౌన్సిల్‌లోనే ఉందని, అక్కడే అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

తదుపరి వ్యాసం