తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri Hamsa Politics: దుర్గగుడి వేదికగా హంస వాహనం చుట్టూ రాజకీయం..

Indrakeeladri Hamsa Politics: దుర్గగుడి వేదికగా హంస వాహనం చుట్టూ రాజకీయం..

Sarath chandra.B HT Telugu

24 October 2023, 9:10 IST

    • Indrakeeladri Hamsa Politics: దుర్గగుడి సాక్షిగా దేవీ నవ రాత్రులు వేదికగా..విజయవాడలో జరిగిన హంస వాహనంపై తెప్పోత్సవం చుట్టూ నెలకొన్న రాజకీయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది అమ్మవారి హంస వాహనంలోకి అర్చకులు, ఆలయ సిబ్బంది మినహా ఇతరుల్ని అనుమతించక పోవడం చర్చనీయాంశం అయ్యింది.
హంస వాహనంలోను రాజకీయాలే
హంస వాహనంలోను రాజకీయాలే

హంస వాహనంలోను రాజకీయాలే

Indrakeeladri Hamsa Politics: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దేవీ శరన్నవరాత్రుల చివరి రోజు దుర్గా మల్లేశ్వరులు హంస వాహనంపై నదీ విహారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందంగా ముస్తాబు చేసిన పంటుపై గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరులు నదీ విహారం చేస్తారు. వేద పండితుల ఆశీర్వచనాలు మధ్య అత్యంత వైభవంగా జరిగే ఆది దంపతుల జల విహారాన్ని చూడటం భక్తులు తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

గతంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వేద పండితుల నడుమ సాగే దుర్గా మల్లేశ్వరుల తెప్పోత్సవం గత కొంత కాలంగా రాజకీయ రంగు పులుముకుంది. వేద పండితులు, అర్చక స్వాములకే పరిమితం అవ్వాల్సిన హంస వాహనంలో వెళ్ళడానికి రాజకీయ నాయకులు, అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారులు చూపుతున్న ఉత్సాహం వివర్శలకు కారణం అవుతోంది.ఈ ఏడాది హంస వాహనంలో ఇతరులు ఎవరు వెళ్లడానికి వీల్లేదని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

మంత్రి నిర్ణయం స్థానిక ఎమ్మెల్యేకు మింగుడు పడలేదు. హంసవాహనంలో తనను ఎక్కించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి పట్టు బట్టారు. హంస వాహనం పైకి అనుమతి లేకపోవడంతో తెప్పోత్సవం పాసులను ఈవో ఆఫీసుకు మాజీ మంత్రి తిప్పి పంపేశారు.హంసవాహనంపై అర్చకులతో పాటు 32 మందిని మాత్రమే అనుమతించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. దేవాదాయ మంత్రి, జిల్లా అధికారులు, ప్రోటోకాల్ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా భోది బోటు ఏర్పాటు చేసినా తాము హంసవాహనం మాత్రమే ఎక్కుతానని వెల్లంపల్లి మొండిపట్టు పట్టారు.

బంధు మిత్ర పరివార సమేతంగా....

నిబంధనలకు విరుద్ధంగా తమకు అవసరం ఉన్న వారిని, బంధు గణాలను, పరిచయస్తులను, హంసవాహనం పైకి ఎక్కించి తద్వారా రాజకీయాల్లో తమ ప్రాభావాన్ని చూపించుకునే వేదికగా తెప్పోత్సవం మారిపోయింది. హంస వాహనంలో జరిగే పూజల్ని చూడ్డానికి రాజకీయ నాయకులు,ప్రభుత్వ పెద్దలైన విఐపిల కోసమే ప్రత్యేక బోటు ఏర్పాటు చేసినా అందులోకి ఎక్కడాన్ని కొందరు పెద్దలు చిన్నతనంగా భావిస్తున్నారు.

దుర్గా మల్లేశ్వరుల హంస వాహనంపై వేద పండితులు, అర్చక స్వాములు వారి సహాయక దేవాదాయ శాఖ సిబ్బంది మినహా ఎవరూ ఉండకూడదని, అలా చేస్తే అపచారం అని దేవస్థాన అర్చక సిబ్బంది ఎంతో కాలం నుంచి ఆక్షేపించినా, వారి మాటలు వినే పరిస్థితులు లేవు.హంస వాహనంపై అంత మంది ఉండకూడదని అభ్యంతరం చెప్పినా ఖాతరు చేసే వారు కాదు.

తాజాగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హంస వాహనంపై అర్చక స్వాములు, వేద పండితులు మినహా... ఎవరికీ అనుమతి ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంపై భక్తులు, దేవస్థాన వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నా, స్థానిక రాజకీయ నాయకులు నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.

హంస వాహనం పైకి ఈ ఏడాది ఎవరినీ అనుమతించక పోవడంపై మాజీ మంత్రి, స్థానిక MLA వెల్లంపల్లి శ్రీనివాస్ వర్గీయుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. తమ ప్రాభవాన్ని తగ్గించడానికే దేవాదాయ శాఖ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇవేమీ పట్టించుకోని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దుర్గా ఘాట్ నుంచే దేవాదాయ శాఖ కమిషనర్ తో కలిసి తెప్పోత్సవాన్ని వీక్షించారు. రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చగా మారినా, మంత్రి కొట్టు నిర్ణయాన్ని అమ్మవారి భక్తులతో పాటు...దేవస్థాన అర్చక సిబ్బంది, ఉద్యోగులు అభినందిస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా శాస్త్రోక్తంగా దుర్గా మల్లేశ్వరుల జల విహారం జరపాలని కోరుతున్నారు.

అప్పట్లో అలా…

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు చారిత్రక నేపథ్యం ఉన్నా హంస వాహనంపై తెప్పోత్సవం మాత్రం భద్రాచలం సీతారాముల క‌‍ళ్యాణోత్సవాల తర్వాతే ప్రారంభమైంది. భద్రాచలం వేడుకల్లో ఉత్సవ మూర్తులను నదీవిహాారానికి తీసుకువెళుతుండటంతో అదే ఆచారాన్ని 80వ దశకంలో విజయవాడలో ప్రారంభించినట్టు చెబుతారు.

20ఏళ్ల క్రితం వరకు హంస వాహనంపై పెద్దగా హడావుడి లేకుండా భక్తి పూర్వక కార్యక్రమంగా సాగిపోయేది. విజయదశమి రోజు మెట్ల మార్గంలో అమ్మవారి ఉత్సవ మూర్తులను కిందకు తీసుకువచ్చి వన్‌టౌన్‌ పోలీసులు మొక్కులు చెల్లించుకున్న తర్వాత నదీ విహాారానికి తరలించేవారు. కాలక్రమేణా ఉత్సవాల నిర్వహణ మొత్తాన్ని పోలీసులు ఆక్రమించేయడంతో రకరకాల మార్పులు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి.

మొదట్లో హంస వాహనంపై జిల్లా కలెక్టర్, కమిషనర్‌తో పాటు ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు వెళ్లేవారు. మొదటి విడత విహారం పూర్తైన తర్వాత అధికారులు వెళ్లిపోయే వారు. ఆలయ అర్చకులు మాత్రమే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేవారు. 2002లో హంస వాహనం వెనుక బాణాసంచా కాలుస్తున్న పడవ ప్రమాదంలో ఇద్దరు చనిపోవడంతో మార్పులు మొదలయ్యాయి.

ఆ తర్వాత హంస వాహనంపై ఎక్కే జనం కూడా పెరిగిపోయారు. దీనిపై ఆలయ అర్చకులు అభ్యంతరాలు చెప్పినా వాటిని పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇన్నేళ్ల తర్వాత దేవాదాయ శాఖ మంత్రి తెప్పోత్సవాన్ని ప్రక్షాళన చేశారనే అభిప్రాయం ఆలయ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. దుర్గగుడిని కొంతమంది ప్రజా ప్రతినిధులు సొంత జాగీరుగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శల నేపథ్యంలోనే మంత్రి కఠినంగా వ్యవహరించినట్టు ప్రచారం జరుగుతోంది.

తదుపరి వ్యాసం