తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Manifesto: మళ్లీ అదే మేనిఫెస్టో.. వైఎస్సార్సీపీ ఆలోచన అదేనా?

Ysrcp Manifesto: మళ్లీ అదే మేనిఫెస్టో.. వైఎస్సార్సీపీ ఆలోచన అదేనా?

Sarath chandra.B HT Telugu

11 July 2023, 6:54 IST

    • Ysrcp Manifesto: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లోగెలుపు తమదంటే, తమదని ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష టీడీపీ మహానాడులో తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల్లో కొన్నింటిని ఇప్పటికే వెల్లడించింది. మరి అధికారంలో ఉన్న వైసీపీ మాటేమిటి?
వైసీపీ మేనిఫెస్టో అదే
వైసీపీ మేనిఫెస్టో అదే

వైసీపీ మేనిఫెస్టో అదే

Ysrcp Manifesto: ఓటర్లను ప్రభావితం చేసి, జనాన్ని తమకు అనుకూలంగా మార్చడంలో కీలకంగా పనిచేసే ఎలక్షన్ మేనిఫెస్టోలపై అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అధికారంలోకి రావాలని భావించే రాజకీయ పార్టీలు, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టేశాయి. ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు తాయిలాలు అన్ని రాజకీయ పార్టీలు చేసేదే. ఏపీలో ఐదేళ్ల క్రితం నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో సక్సెస్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Gopi Thotakura: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రవాసాంధ్రుడు.. భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

2019లో ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు పెన్షన్లను రూ.రెండు వేలకు పెంచుతానంటూ జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడిన కొద్ది రోజులకే అధికారంలో ఉన్న టీడీపీ దానిని అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకుఇచ్చే మొత్తాన్ని ఒకేసారి రెండు వేల రుపాయలకు పెంచారు. దీంతో అప్పటి ప్రతిపక్ష వైసీపీ పెన్షన్ మొత్తాన్నిమూడు వేలుచేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత దశలవారీగా పెన్షన్ మొత్తాన్ని మూడు వేలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అది రూ.2750 రుపాయలకు చేరింది. మరికొద్ది నెలల్లో రూ.3వేల రుపాయలకు చేరనుంది.

2019 ఎన్నికల నాటికి ఇచ్చిన హామీల్లో దాదాపు 95శాతం అమలు చేశామని ఆ పార్టీ చెబుతోంది. దాదాపు 129 హామీలు ఇస్తే అందులో 111 నెరవేర్చినట్లు వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. మరో 12 హామీలు వివిధ దశల్లో ఉన్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే మరో 45 హామీలను అదనంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

వైసీపీ 2019లో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాలు, వైఎస్సార్ ఆసరా పెన్షన్లు, జలయజ్ఞం, ఉపాధి, మద్య నిషేధం వంటివి ఉన్నాయి. వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో దాదాపు రెండు లక్షల కోట్ల రుపాయల నగదును లబ్దిదారులకు అందచేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.

ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలాల కేటాయింపు వంటి పథకాలతో దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల రుపాయల విలువైన పథకాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించామని వైసీపీ చెబుతోంది. ఒక్కో కుటుంబంలో రెండు, మూడు పథకాలు అందుకున్న వారు కూడా ఉన్నారని వైసీసీ చెబుతోంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, నిధుల కొరత ఉన్నా వాటిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న వైసీపీ 2024 ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుందనే ఆసక్తి అందరిలోను ఉంది.

మళ్లీ అవే హామీలు..ఇంకాస్త మెరుగ్గా…

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్న వైఎస్సార్సీపీ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలోను ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ అధికారంలోకి రాకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలన్నీ రద్దవుతాయని ముఖ‌్యమంత్రి స్వయంగా బహిరంగ సభల్లో చెబుతున్నారు.

దీంతో టీడీపీ కూడా ఇటీవల జరిగిన మహానాడులో నగదు బదిలీ పథకాలను ప్రకటించింది. మహిళా ఓటర్లే లక్ష్యంగా పలు పథకాలు ప్రకటించింది. వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న వాటికంటే మెరుగ్గా నగదు బదిలీ పథకాలు అమలు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నారు.

2024 ఎన్నికల్లో ఏపీలో ప్రధానమైన వర్గాలపై వైసీపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రైతులతో పాటు ప్రభుత్వ సాయం పొందే పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలను ప్రకటించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాలను యథాతథంగా కొనసాగిస్తూ రైతులు, ప్రభుత్వ పెన్షన్లను మరింత మెరుగు పరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో దాదాపు 53లక్షల కుటుంబాలకు రైతు భరోసా అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రైతు రుణ మాఫీ హామీ ప్రకటించే అవకాశాలున్నాయి. రూ.50వేల నుంచి లక్ష రుపాయల వరకు రుణ మాఫీకి వైసీపీ సిద్ధం కావొచ్చని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏపీలో ప్రభుత్వ సాయం అందుకుంటున్న మరో ప్రధాన వర్గం పెన్షనర్లు. దాదాపు 62లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు మంజూరు చేస్తోంది. ఇలా ప్రభుత్వ పెన్షన్లు పొందే వారికి మరికొంత అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2750గా ఉన్న పెన్షన్ జనవరి 1నాటికి రూ.3వేలకు చేరుతుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని వైసీపీ ప్రకటించే అవకాశాలున్నాయి.

ఏపీలో పెన్షన్ మొత్తాన్ని కనీసం వెయ్యి రుపాయలైనా పెన్షన్ పెంపుకు ప్రభుత్వం సిద్ధపడుతుందని చెబుతున్నారు. మిగిలిన పథకాలను యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పెన్షనర్లు, రైతులు కలిపి దాదాపు కోటి 20లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ది చూకూర్చేలా మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు.

తదుపరి వ్యాసం