Delhi Vasanth : జహీరాబాద్ లో బీఆర్ఎస్ కు షాక్, బీజేపీలో చేరిన ఢిల్లీ వసంత్
Delhi Vasanth : జహీరాబాద్ లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన ఢిల్లీ సంతోష్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Delhi Vasanth : జహీరాబాద్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజే, జహీరాబాద్ కి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త ఢిల్లీ వసంత్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు ఢిల్లీ వసంత్. సుమారుగా వంద వాహనాల్లో జహీరాబాద్ నుంచి, హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయానికి ఢిల్లీ వసంత్ తన అనుచరులతో తరలి వెళ్లాడు. సరిగ్గా మూడు నెలల క్రితమే వసంత్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ తనకు టికెట్ ఇవ్వకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు పైన మరోసారి నమ్మకం ఉంచడంతో, ఆయన తీవ్ర నిరుత్సహానికి గురయ్యారు. బీజేపీకి కూడా జహీరాబాద్ లో బలమైన నాయకుడు లేకపోవడంతో, పార్టీ టికెట్ తనకే ఇస్తామని హామీ ఇవ్వటంతో, వసంత్ బీజేపీలో చేరారని తెలుస్తోంది.
ఇంటికి కూడా వెళ్లకుండా
ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్... హనుమంతుడి సాక్షాత్కారoగా భావించే హనుమ ఫలాన్ని కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్ కు బహుకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి విజయ ఫలంగా ఈ హనుమ ఫలాన్ని భావిస్తామని మీడియాకు ప్రకటించారు. రామా ఫలం, సీతాఫలం తో పాటు హనుమ ఫలం ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి ఢిల్లీ వసంత్ తెప్పించారు. ఢిల్లీ వసంత్ మీడియాతో మాట్లాడుతూ జహీరాబాద్ లో చెరుకు రైతుల సమస్యలను, యువతకు ఉపాధి, మహిళా అభివృద్ధి, కార్మిక సంక్షేమం కోసం తాను పాటుపడతానని చెప్పారు. ఇప్పటి నుంచి తాను ఇంటికి వెళ్లకుండా గ్రామ గ్రామాన, వీధి వీధిన ప్రచారం చేస్తూ బీజేపీకి గెలుపు బాటలు వేస్తానని శపథం చేశాడు. తన చేరికకు సహకరించిన బాగారెడ్డి కుమారుడు జయపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. శాంతికి చిహ్నమైన జహీరాబాద్ లో గంగా జమున తహజీబ్ తో జహీరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెద్దామని ఢిల్లీ వసంత్ చెప్పారు.
ఇటీవలె బీఆర్ఎస్ లోకి
జులై వరకు వేరు వేరు సామాజిక సమస్యలపైనా పనిచేసిన ఢిల్లీ వసంత్, జులై 7న మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ 115 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కె.మాణిక్ రావునే మరోసారి జహీరాబాద్ అభ్యర్థిగా ప్రకటించడంతో... ఢిల్లీ వసంత్, తన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆ తర్వాత కూడా అధిష్టానాన్ని ఆకట్టుకోవడానికే వసంత్ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ పలు సామజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధిష్టానం మాత్రం, మాణిక్ రావు ను ఎట్టి పరిస్థితుల్లో మార్చే అవకాశం లేదని ప్రకటించడoతో, తప్పని పరిస్థితుల్లో వసంత్ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి మరొక బలమైన పార్టీ అయిన బీజేపీలో చేరారని తెలుస్తోంది.