Rain Alert: తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌-yellow alert has been issued for 25 districts of telangana due to rains for another 5 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rain Alert: తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Rain Alert: తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Basani Shiva Kumar HT Telugu
Aug 18, 2024 03:19 PM IST

Rain Alert: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు
తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు

తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. సిద్దిపేట,యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఉత్తర కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో.. ఆవర్తనం విస్తరించి ఉందని అధికారులు వివరిస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు దీని ప్రభావంతో ఏపీలోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Whats_app_banner