Women Journalists Workshop: మహిళా జర్నలిస్టుల కోసం మీడియా సెంటర్
workshop for women journalists :హైదరాబాద్ బేగంపేట్లో మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభమైంది. ఇవాళ, రేపు(23,24) జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. ఇందులో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు.
workshop for women journalists: తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక మీడియా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున కచ్చితంగా తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక సాయం కింద 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని తెలిపారు. మహిళా జర్నలిసుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి, శిక్షణ ఇచ్చే కార్యక్రమం చాలా బాగుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తమ మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా దళిత జర్నలిస్టులు వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు. జర్నలిజంలో రోజురోజకీ కొత్త కొత్త విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వస్తోంద్న ఆమె... ఫలితంగా తీవ్ర పోటీ నెలకొందన్నారు. కాబట్టి పోటీ జర్నలిజంలో నిలదొక్కుకోవడం నిజంగా మహిళలకు ఛాలెంజ్ అని చెప్పారు. మహిళా జర్నలిస్టులకు వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఉంటాయని.. అయినా వీటన్నింటిని తట్టుకోని నిలబడి రాణిస్తున్నారని పొగడ్తలు గుప్పించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంతమంది మహిళా జర్నలిస్టులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసిఆర్ ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మహిళా జర్నలిస్టుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లటమే కాదు.. పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు. మహిళా జర్నలిస్టులు అందరూ కలుసుకునే విధంగా మహిళా మీడియా సెంటర్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. జర్నలిజం అంటే ఆషామాషీ కాదని.. అయినా ఈ రంగాన్ని ఎంచుకున్న మహిళలకు అభినందనలు తెలిపారు.
మహిళలందరూ స్వతంత్రంగా ఎదగాలని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొని ముందుకు సాగాలని దానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత హామీ ఇచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజ హితం కోసం మహిళ జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగం చేసే చోట మహిళలపై వివక్ష, లైంగిక వేధింపులు నివారించడానికి ఒక ప్రత్యేక కమిటీని వేయాలని అన్నారు. ప్రభుత్వ సహకారంతో, మీడియా అకాడమీ ప్రోత్సాహంతో మరింత రాణించాలని ఆకాంక్షించారు.