MLC Kavitha : తెలంగాణ తలవంచదన్న కవిత…కక్ష సాధింపు కాదన్న డికె అరుణ-war of words between brs leaders and bjp for ed notices to mlc kavitha in delhi liquor scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha : తెలంగాణ తలవంచదన్న కవిత…కక్ష సాధింపు కాదన్న డికె అరుణ

MLC Kavitha : తెలంగాణ తలవంచదన్న కవిత…కక్ష సాధింపు కాదన్న డికె అరుణ

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 12:20 PM IST

MLC Kavitha ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించారు. బిఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను లొంగదీసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మరోవైపు బిఆర్‌ఎస్‌ నేతల ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కక్ష సాధింపు చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేదన్నారు.

తెలంగాణ తలవంచదంటున్న కవిత
తెలంగాణ తలవంచదంటున్న కవిత

MLC Kavitha ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు ఇవ్వడంపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ట్విట్టర్‌లో తన స్పందన తెలియచేస్తూ లేఖను విడుదల చేశారు. ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని కవిత తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు.

''ముందస్తు అపాయింట్‌మెంట్ల ఉన్నందున విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలను లొంగ దీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు. ఈనెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉందని, మహిళా బిల్లు కోసం ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టినట్లు కవిత చెప్పారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది బిఆర్‌ఎస్ ప్రధానమైన డిమాండ్ అని, ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచదని అని కవిత ట్వీట్‌ చేశారు.

దిల్లీ మద్యం కేసులో హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను గురువారం ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోది. ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో కవిత తరఫున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కక్ష సాధింపు కాదంటున్న బీజేపీ…

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో చాలా మంది పేర్లు వచ్చాయని, విచారించిన తర్వాతే అరెస్టులు చేస్తున్నారని, అందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డికె అరుణ చెప్పారు. నిజంగా కక్ష సాధింపు ఉంటే మొదట కవితను అరెస్ట్ చేసి ఉండే వారన్నారు.

ఈడీ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని, కక్ష సాధింపు అనేది బీఆర్‌ఎస్‌ పని అని, తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరేనా, అందరితో పాటే కవితకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కవిత ఏమీ ప్రత్యేకం కాదని, అందరితో పాటుగానే ఆమె కూడా అన్నారు. మహిళల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉందన్నారు.

ఈడీ నోటీసులు బీఆర్‌ఎస్‌, బీజేపీ డ్రామాలో భాగమని కాంగ్రెస్‌ నేత మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు. గతంలో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారని, ప్రస్తుతం ఈడీ నోటీసులు కూడా ఇచ్చారని, వీటన్నింటి వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. . బీఆర్‌ఎస్‌-బీజేపీ రాజకీయ డ్రామాలో భాగంగానే ఇలా చేస్తున్నారన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కవిత మంటగలిపారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. లిక్కర్‌ స్కాంలో మహిళ దొరకడం మహిళలకే అవమానమని, ఇది బీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య మైత్రిలో భాగమేనని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారని మాజీ ఎంపి విహెచ్ ఆరోపించారు.

అటు బిఆర్‌ఎస్ నేతలు కూడా బీజేపీపై మాటల దాడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేశారన్నారు. కేంద్రం అణచివేత ధోరణితో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందన్నారు. కేసీఆర్‌పై కుట్రలో భాగమే కవితను నోటీసులు ఇచ్చారని, మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్తేమీ కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజాక్షేత్రంలో బయటపెడతామన్నారు.

మహిళల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని రవాణా మంత్రి అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ అర్ధమవుతోందని, ఢిల్లీలో దీక్ష భగ్నం చేసేందుకు నోటీసులు ఇచ్చారన్నారు. మహిళా దినోత్సవం రోజునే ముఖ్యమంత్రి కుమార్తె కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

మొదటి నుంచి బీజేపీకి ఒక పాలసీ ఉందని, ముందుగా నోటీసులిస్తుందని, భయపడకుంటే అరెస్ట్‌ చేస్తుందన్నారు. ఆ తర్వాత జైలుకు పంపుతుందన్నారు. అరెస్ట్‌ చేసినా వెనక్కి తగ్గేది లేదని, కేంద్రంపై మా పోరాటం కొనసాగుతుందన్నారు.

Whats_app_banner